జపాన్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ పారుపల్లి కశ్యప్.. ఆరో సీడ్ తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో 14- 21, 18- 21 తేడాతో ఓటమిచెందాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కశ్యప్ కు అవకాశం దక్కనీయకుండా చెన్ ధాటిగా ఆడాడు.
ఈ పరాజయంతో భారత జట్టులోని ఏ ఒక్కరు కూడా కనీసం సెమీస్ కు చేరుకోకుండానే ఇంటిదారిపట్టినట్లయింది. ఈ సిరీస్ లో ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 4వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 12వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌లు ప్రిక్వార్టర్స్ దశలోనే పట్టగా, సింధు, గుత్తా జ్వాలా జోడి మొదటిరౌండ్ లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.