breaking news
itam satyam
-
కలిసికట్టుగా పనిచేద్దాం
ఖమ్మం : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలని మధిర, ఖమ్మం ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఐతం సత్యం సన్మాన సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం జరిగింది. అంతకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నయాబజార్ కళాశాల నుంచి బయల్దేరిన ఈ ప్రదర్శన భక్తరామదాసు కళాక్షేత్రం వరకు కొనసాగింది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఐతం సత్యం డీసీసీ అధ్యక్షుడిగా నియామకం పొందదం హర్షణీయమన్నారు. ఈయనకు ఉన్న అపార అనుభవం జిల్లా పార్టీ అభివృద్ధికి దోహద పడతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు ఆదేశాలనుసారం నడుచుకోవాల్సిన అవసరం పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం విషయంలో పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ త్యాగాల చరిత్ర గల ఇందిరాగాంధీ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు రుణపడి ఉంటారన్నారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్న సోనియాగాంధీ ఆదర్శమూర్తి అని కొనియాడారు. ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గర్వపడాలన్నారు. ఆమె ఆదేశాల మేరకు నియమితులైన ఐతం సత్యం నాయకత్వాన్ని గౌరవించాలన్నారు. అందరికీ అండగా ఉంటా : ఐతం నలుబై ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకు అన్ని వర్గాల నాయకులతో పనిచేసిన అనుభవం ఉందని ఐతం సత్యం అన్నారు. ఏ ఒక్కరి వర్గానికి కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటానన్నారు. తనను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సోనియాగాంధీకి, అందుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు, గ్రంథాలయం చైర్మన్ దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, సేవాదళ్ అధ్యక్షుడు జావీద్, నాయకులు కూల్‌హోం ప్రసాద్, అశోక్, బాలాజీనాయక్, కక్కెర రాంమోహన్‌రావు, ఎస్ఏఎస్ అయ్యుబ్, మందడపు సత్యనారాయణ, దోరెపల్లి రవికుమార్, సిరిపురం సుదర్శన్, రషీద్, నాగబత్తిని రవి, కిషోర్‌బాబు, రాంప్రసాద్, శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చల్లారని అసమ్మతి! ఐతం సత్యం సన్మాన సభకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రేణుకాచౌదరితోపాటు పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనాయకులు హాజరుకాలేదు. దీంతో డీసీసీలో రాజుకున్న అసమ్మతి సెగలు చల్లారలేదనే విషయం చర్చనీయాంశమైంది. -
వీడిన పీటముడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ నేతల వర్గ పోరు కారణంగా నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకపు వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఐతం సత్యంను పార్టీ ఇన్చార్జి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి నియామకపు పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సాయంత్రం అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి వ నమా వెంకటేశ్వరరావుకు 2014 శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ఇవ్వక పోవడంతో పార్టీని వీడి వైఎస్సార్సీపీ తరపున పోటీచేశారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెట్టాలనే దానిపై పార్టీలోని వర్గాల మధ్య ఏకాభ్రిపాయం కుదరలేదు. జిల్లా కాంగ్రెస్‌లో అగ్రగణ్యులుగా పేరున్న నేతలందరూ ఎవరికి వారే తమ వర్గాలకు చెందిన వారికి ఈ పదవి దక్కేలా పలు పేర్లను సూచించారు. అయితే సాక్షాత్తు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగే వీరి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ఢిల్లీ వరకు పిలిపించినా అధ్యక్షుడి వ్యవహారం మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు. ఈ నేపథ్యంలో అసహనం వ్యక్తం చేసిన ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎవరెవరు ఏ పేర్లు సూచిస్తారో ఆ జాబితా తమకు ఇవ్వాలని కొన్ని నెలల క్రితం సూచించారు. అయితే జిల్లాకు చెందిన కాంగ్రెస్ వర్గాలు పలు పేర్లు ప్రతిపాదించాయి. మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు ఇవ్వడం సాధ్యం కాకుంటే బీసీ నేత శీలంశెట్టి వీరభద్రానికి ఇవ్వాలని రాంరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో ప్రతిపాదించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఐతం సత్యంవైపు మొగ్గు చూపారు. సామాజిక సమీకరణ ల్లో ఆయనకు ఇవ్వడమే మంచిదని ఢిల్లీ పెద్దల ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి మాత్రం పరుచూరి మురళీకృష్ణ పేరును ప్రతిపాదించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే రెండు నెలలపాటు అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారంపై ఎటూ తేల్చని కాంగ్రెస్ అధిష్టాన వర్గం భవిష్యత్తులో పార్టీ అవసరాలు, సభ్యత్వ నమోదు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి అధ్యక్షుడిగా ఐతం సత్యం పేరు ఖరారు చేసింది. కాంగ్రెస్ అధిష్టానవర్గంలో పట్టున్న రేణుకాచౌదరి ప్రతిపాదించిన పేరు కాకుండా జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు అద్దం పడుతోంది. కాగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన సత్యంకు.. డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కాంగ్రెస్ వర్గాలు, ద్వితీయ శ్రేణి నేతలు ఏ మేరకు సహకరిస్తారన్న అంశం ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రధాన చర్చనీయాంశమైంది.