శాంతి.. మానవత్వమే మతం
సర్వమత సమ్మేళనంలో వక్తలు
రాజమహేంద్రవరం కల్చరల్ :
మానవత్వాన్ని, శాంతిని కోరుకునేదే మతమని సర్వమత సమ్మేళనంలో వక్తలు ఉద్ఘాటించారు. జమాతె ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని బిలాల్ ఫంక్షన్హాల్లో సర్వమత సమ్మేళనం నిర్వహించారు. సంస్థ జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా అధ్యక్షత వహించారు. కార్యక్రమ కన్వీనర్ అక్బర్‌బాషా మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు దేశవ్యాప్తంగా ‘శాంతి–మానవత’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ హిందూమతంపై మాట్లాడుతూ.. అందరం కలసి నడుస్తూ, ఒకేమాటపై నిలబడాలని హిందూ మతం చెబుతోందని విశదీకరించారు. ఏ ఒక్కరూ దుఃఖంతో రోదించకూడదని వేదమంత్రాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హిందూ మతం ప్రపంచశాంతిని కోరుతోందని చెప్పారు. బౌద్ధమతంపై వీపూరి సుదర్శన్ మాట్లాడుతూ మానవుని దుఃఖ నివారణకు రాజ్యాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు బుద్ధుడని పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, మైత్రి, సర్వమానవ సౌభ్రాతృత్వం బౌద్ధంలోని ప్రధాన లక్షణాలని వివరించారు. సిక్కుమతంపై ధరంసింగ్ గ్రాంతి మాట్లాడుతూ అన్ని మతాలకూ దేవుడు ఒక్కడేనని, మనిషి దేవునికి దూరంగా తొలగి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఇస్లాంపై సంస్థ నగర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ ఇస్లాం మానవత్వానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఒక ప్రాణిని హతమారిస్తే, యావత్ మానవాళిని హతమార్చినట్టేనని, అలాగే ఒక ప్రాణిని రక్షిస్తే, అందరినీ రక్షించినట్టేనని ఇస్లాం చెబుతోందన్నారు. క్రైస్తవ మతంపై రెవరెండ్ విజయ సారథి మాట్లాడుతూ దేవుడు తనలాగే జీవించాలని మనిషిని సృష్టించినట్టు పేర్కొన్నారు. ఆయనకు ప్రతిరూపంగా పుట్టిన మనం.. దేవుని వ్యతిరేకశక్తులకు లోబడి, దుర్గుణాలను అలవర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరిపై ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుడు మనలను సృష్టించిన లక్ష్యం నెరవేరుతోందని వివరించారు.