breaking news
inugurthy villagers
-
ఎటు చూసినా కాకతీయుల జ్ఞాపకాలే..
కాకతీయుల కాలం నాటి శివాలయాలను పలు గ్రామాల్లో చూస్తుంటాం. కానీ వారు పరిపాలించిన కాలంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. రాతిస్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది విగ్రహం, నాగేంద్రుడి విగ్రహం, ఎత్తైన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. జెడ్పీఎస్ఎస్లో భద్రంగా.. కాకతీయుల కాలం శాసనాలు కలిగిన రాతి స్తంభాన్ని స్థానిక జెడ్పీఎస్ఎస్ స్కూల్ ఆవరణలో ఉంచారు. కాకతీయుల ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు. పగిలిన విగ్రహాలు, విరిగిన స్తంభాలతో పాటు నంది విగ్రహాన్ని మరమ్మతు చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణంలో ఇంకుడుగుంత కోసం తవ్వుతుండగా కల్యాణ మండపం, పూల చిత్రాల రాళ్లు బయటపడ్డాయి. ఆరు ఫీట్ల వైశాల్యంతో రెండుఫీట్ల మందంతో ఉన్న ఈ రాతి విగ్రహంపై వృత్తాకారంలో చెక్కిన తీరును చూసి గర్భగుడిలోని కల్యాణ మండపం రాయిగా గుర్తించారు. అదే విధంగా పూలచిత్రాలు కలిగిన రాళ్లు, ఆలయంలో రాతిస్తంభాలు బయటపడ్డాయి. ఇక అప్పట్లో చనిపోయిన వారిని ఖననం చేసిన, సమాధి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇలా అనేక ఆనవాళ్లు గ్రామంలో కనిపించడంతో కాకతీయుల కాలంలో ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు చెబుతారు. ప్రభుత్వం గుర్తిస్తే కాకతీయుల నాటి ఆనవాళ్లు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉన్నందున ఆ దిశగా ప్రయత్నించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంకా ఎన్నో.. ఇనుగుర్తి గ్రామ శివారులో ఉన్న గుంటిచెరువు వద్ద కాకతీయుల నాటి కాలంలో నాటిన చెట్లు, చెరువు మధ్యలో ఉయ్యాలను రాతిస్తంభాలతో ఏర్పాటు చేయడాన్ని చూడొచ్చు. చెరువుపక్కనే యాదవరాజుల విగ్రహాలు, బతుకమ్మలు పేర్చినట్లు బిందెపై బిందె పెట్టినట్లుగా చెక్కిన రాతి నిర్మాణాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ రెండు దేవాలయాలు ఉండటం మూలంగా ఇనుంగుడి అనే పేరు గ్రామానికి వచ్చిందని, అది కాస్త్త కాలక్రమంలో ఇనుగుర్తిగా మారినట్లు చెబుతారు. -
అట్టుడికిన ఇనుగుర్తి... టవర్ దిగని యువకులు
వరంగల్ :వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే తప్ప టవర్ దిగేది లేదంటూ యువకులు పట్టుబట్టారు. ఇప్పటికి దాదాపు 22 గంటలుగా ఐదుగురు యువకులు టవర్ మీదే ఉండిపోయారు. అధికారులు నేరుగా ప్రకటన చేస్తేనే తాము కిందికి దిగి వస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇనుగుర్తి బంద్ పాటించారు. వివిధ ప్రాంతాల్లోని సెల్ టవర్, వాటర్ ట్యాంకులపైకి మండల సాధన సమితి సభ్యులతోపాటు యువకులు ఎక్కి ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నూతన మండలాల ప్రకటనలో ఎక్కడా ఇనుగుర్తి ప్రస్తావన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హామీ ఇచ్చారని... ఇనుగుర్తి మండలం వస్తుందని... ఇన్నాళ్లు వేచి ఉన్నామని... ఇప్పుడు తమ ఆశ నిరాశ అయిందని వారు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టినందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామస్తులు దహనం చేశారు. అయితే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు తాము దిగేది లేదని... సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు భీష్మించుకున్నారు. దీంతో వారు సెల్ టవర్ ఎక్కి 22 గంటలు అయినా కిందకి దిగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు.