ఎటు చూసినా కాకతీయుల జ్ఞాపకాలే..

Stone Sculptures of the Kakatiya In Inumdurthy Village Warangal - Sakshi

ఇనుగుర్తిలో కనువిందు చేస్తున్న కట్టడాలు

గ్రామమంతా రాజుల పాలన ఆనవాళ్లు

తవ్వకాల్లో బయటపడుతున్న పలు నిర్మాణాలు 

కాకతీయుల కాలం నాటి శివాలయాలను పలు గ్రామాల్లో చూస్తుంటాం. కానీ వారు పరిపాలించిన కాలంలో మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. రాతిస్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది విగ్రహం, నాగేంద్రుడి విగ్రహం, ఎత్తైన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి.

జెడ్పీఎస్‌ఎస్‌లో భద్రంగా..
కాకతీయుల కాలం శాసనాలు కలిగిన రాతి స్తంభాన్ని స్థానిక జెడ్పీఎస్‌ఎస్‌ స్కూల్‌ ఆవరణలో ఉంచారు. కాకతీయుల ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు. పగిలిన విగ్రహాలు, విరిగిన స్తంభాలతో పాటు నంది విగ్రహాన్ని మరమ్మతు చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణంలో ఇంకుడుగుంత కోసం తవ్వుతుండగా కల్యాణ మండపం, పూల చిత్రాల రాళ్లు బయటపడ్డాయి. ఆరు ఫీట్ల వైశాల్యంతో రెండుఫీట్ల మందంతో ఉన్న ఈ రాతి విగ్రహంపై వృత్తాకారంలో చెక్కిన తీరును చూసి గర్భగుడిలోని కల్యాణ మండపం రాయిగా గుర్తించారు. అదే విధంగా పూలచిత్రాలు కలిగిన రాళ్లు, ఆలయంలో రాతిస్తంభాలు బయటపడ్డాయి. ఇక అప్పట్లో చనిపోయిన వారిని ఖననం చేసిన, సమాధి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇలా అనేక ఆనవాళ్లు గ్రామంలో కనిపించడంతో కాకతీయుల కాలంలో ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు చెబుతారు. ప్రభుత్వం గుర్తిస్తే కాకతీయుల నాటి ఆనవాళ్లు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉన్నందున ఆ దిశగా ప్రయత్నించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇంకా ఎన్నో..
ఇనుగుర్తి గ్రామ శివారులో ఉన్న గుంటిచెరువు వద్ద కాకతీయుల నాటి కాలంలో నాటిన చెట్లు, చెరువు మధ్యలో ఉయ్యాలను రాతిస్తంభాలతో ఏర్పాటు చేయడాన్ని చూడొచ్చు. చెరువుపక్కనే యాదవరాజుల విగ్రహాలు, బతుకమ్మలు పేర్చినట్లు బిందెపై బిందె పెట్టినట్లుగా చెక్కిన రాతి నిర్మాణాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ రెండు దేవాలయాలు ఉండటం మూలంగా ఇనుంగుడి అనే పేరు గ్రామానికి వచ్చిందని, అది కాస్త్త కాలక్రమంలో ఇనుగుర్తిగా మారినట్లు చెబుతారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top