breaking news
Inti No13 Movie
-
థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హారర్ మూవీ
కొత్తదనం ఉంటే ప్రేక్షకులు.. థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని 'ఇంటి నెం.13' నిరూపిస్తోంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసేవారి సంఖ్య పెరుగుతోంది. 72 థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ రావడంతోపాటు ఈ సంఖ్య 120 వరకు పెరిగింది. సినిమాలోని ట్విస్టులకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి, డైరెక్టర్ టేకింగ్కి ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?) ఎంతో సైలెంట్‌గా మొదలైన మా సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏరియాలోనూ సెకండ్ షోలు హౌస్ ఫుల్ అవ్వడం చూస్తే సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అర్థమవుతుంది. థియేటర్లలో జనం లేకపోయినా సూపర్‌హిట్ అయిందని, కలెక్షన్స్ దుమ్ము రేపుతోందని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ‘ఇంటి నెం.13’ చిత్రానికి రాలేదు. ఈ చిత్రం తప్పకుండా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తోంది అని దర్శకుడు పన్నా రాయల్ ధీమాగా చెప్పాడు. (ఇదీ చదవండి: Ooru Peru Bhairavakona OTT: సర్ప్రైజ్ ఓటీటీ ఎంట్రీకి 'ఊరి పేరు భైరవకోన' రెడీ!?) -
ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?
టైటిల్: ఇంటి నెం.13 నటీనటులు: నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్, దేవయాని తదితరులు రచన, దర్శకత్వం: పన్నా రాయల్ సంగీతం: వినోద్ యాజమాన్య సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్ మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్ సమర్పణ: డా.బర్కతుల్లా నిర్మాత: హేసన్ పాషా బ్యానర్స్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ విడుదల తేదీ: 01.03.2024 సినిమా నిడివి: 126 నిమిషాలు హారర్ మూవీస్ అంటే దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే తెరకెక్కుతుంటాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలను తీసి పేరు గడించారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం(మార్చి 1న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్‌మెంట్‌కి బహుమానంగా ఒక విల్లా గిఫ్ట్‌గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పనిమనిషి జేజమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని, సైకియాట్రిస్ట్‌లను తీసుకొస్తాడు. కానీ ఇద్దరూ చేతులెత్తేస్తారు. ఫైనల్‌గా గజానంద్ (ఆనంద్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా నడిపించేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. వినోద్ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్‌రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక నిపుణులు చిన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్ చేసేలా వినోద్ సంగీతం అందించారు.దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ సాయి బద్వేల్ సినిమాను క్రిస్పీగా ఎడిట్ చేశారు. వెంకట్ బాలగోని, పన్నా రాయల్ రాసిన మాటలు పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. -
మాల్గాడి పాడిన ఈ మాస్ సాంగ్ విన్నారా..?
నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంటి నెం.13’. పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని ‘నర నరము..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. రాంబాబు గోశాల రచించిన ఈ పాటకు వినోద్ యాజమాన్య సంగీతం అందించారు. డిఫరెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాట పాడారు. ‘‘మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇంటి నెం.13లో ఏం జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. ‘నర నరము..’ అంటూ ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.