breaking news
international dons
-
సిటీపై డి–గ్యాంగ్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో తలదాచుకున్న అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను హైదరాబాద్‌పై ఉందా? దీనికి ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావూద్‌కు చెందిన డి–కంపెనీ హైదరాబాద్‌లో ఉండే ఓ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్లు తెలిసింది. దీనికోసం దావూద్ కుడిభుజం ఛోటా షకీల్ ఢిల్లీకి చెందిన షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్‌ను రంగంలోకి దింపాడు. నసీంను నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నవంబర్‌లో అరెస్టు చేశారు. నసీం విచారణ నేపథ్యంలో ‘హైదరాబాద్ సెలబ్రిటీ–డి కంపెనీ’ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెప్తుండగా.. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. టార్గెట్ నేపథ్యంలో.. నసీం ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా.. మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డ్ ప్రకటించారు. షార్ప్ షూటర్‌గా పేరున్న నసీం డి–కంపెనీకి అనుబంధంగా పని చేస్తున్నాడని, దావూద్‌తో పాటు ఛోటా షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని చంపడానికి రంగంలోకి దిగాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గతేడాది జూన్‌లో నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నసీం అనుచరుడు జునైద్ చౌదరిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో నవంబర్ మొదటి వారంలో నసీంను పట్టుకున్నారు. వెలుగులోకి కీలకాంశాలు.. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల విచారణలో నసీం తాను ఛోటా. షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్లు అంగీకరించాడు. పాక్‌లో పుట్టి కెనడియన్‌గా మారిన రచయిత తారిఖ్ ఫథాతో పాటు ‘కాఫీ విత్ డీ’ సినిమా నిర్మాత మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు బయటపెట్టాడు. తారిఖ్ ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఆయన్ను హతమారిస్తే రూ.1.5 కోట్లు చెల్లించడానికి షకీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపాడు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కదలికల్నీ కనిపెట్టాల్సిందిగా షకీల్ చెప్పాడనీ అంగీకరించాడు. షకీల్–రాజన్ మధ్య వైరం ఉన్న నేపథ్యంలో అతడిని హతమార్చడానికి రెక్కీగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు స్పెషల్ సెల్ అనుమానిస్తోంది. షకీల్ రెండుసార్లు నసీంతో మాట్లాడి ఈ కాంట్రాక్టులు ఇచ్చినట్లు వెల్లడైంది. రూ. 45 లక్షల సుపారీ ఛోటా షకీల్ నసీం విచారణలో హైదరాబాద్‌కు సంబంధించిన కోణం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉంటున్న ఓ సెలబ్రిటీని చంపేందుకు షకీల్ నుంచి అతడు రూ.45 లక్షల సుపారీకి అంగీకరించాడని వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ మున్నా సింగ్‌తో కలసి చేయాల్సిందిగా షకీల్ స్పష్టం చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. దీనికోసం గుర్గావ్ ప్రాంతంలో మున్నాను కలిసే యత్నాల్లో ఉండగా నసీం ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సెల బ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనేవి అంతు చిక్కట్లేదు. గతంలోనే సిటీలో డి–గ్యాంగ్ ఛాయలు కనిపించాయి. ఓ వీడియో కంపెనీ యజమానుల్ని దుబాయ్ కు పిలిపించుకుని వారిని కలిసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల్ని సంప్రదించగా.. నసీం కేసు దర్యాప్తులో ఉందని, అనేక అంశాలు వెలుగులోకి రావాలని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు మాత్రం సిటీ సెలబ్రిటీని డి–కంపెనీ టార్గెట్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. -
ఎర్ర దొంగలకు శత్రు దుర్బేధ్యం కటికనహళ్లి
ఆ గ్రామస్తులకు స్మగ్లింగే వృత్తి అక్కడ 200 మంది డ్రైవర్లే పోలీసుల అండతోనే యథేచ్ఛగా స్మగ్లింగ్ గ్రామంలోకెళితే తిరిగి రావడం కష్టమే రియాజ్, అల్లాబక్ష్ చెప్పిందే వేదం అక్కడి నుంచి కేరళ మీదుగా దుబాయ్‌కి పలమనేరు : చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్రచందనం కర్ణాటక రాష్ట్రంలోని హొస్కోట తాలూకా కటికనహళ్లి గ్రామానికి వెళుతోంది. ఈ గ్రామంలో ఆరు ముఠాలు తమ అనుచరులతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాయి. వీరిలో అంతర్జాతీయ డాన్లు ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగి రావడం అంత సులభం కాదు. ఒక్కో గ్యాంగ్‌లో వందమంది దాకా ప్రైవేటు సైన్యాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్ని కుటుంబాల వారు ఇదే వృత్తిగా మార్చుకున్నారు. గ్రామ పొలిమేరల్లోని కోళ్ల ఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్రచందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. మొత్తం మీద ఈ గ్రామం ఎర్రచందనం స్మగ్లర్లకు శత్రుదుర్బేధ్యంగా ఉన్నట్టు చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిన టాస్క్‌ఫోర్స్, పలమనేరు, గంగవరం పోలీసులు చెబుతున్నారు. కటికనహళ్లిలో అందరిదీ ఇదే వృత్తి.. కటికనహళ్లిలో సుమారు 375 కుటుంబాలున్నాయి. వీటిలో 300 కుటుంబాలు ఎర్రచందనం స్మగ్లింగ్‌నే జీవనోపాధిగా మార్చుకున్నాయి. గ్రామంలో 200 మందికి పైగా డ్రైవర్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిన వారు లోడింగ్, అన్లోడింగ్ చేయడం, మహిళలు గ్రేడింగ్ వర్క్, మరికొందరు గోడౌన్ వర్క్ ఇలా ఊరందరికీ ఇదే పనులు. గ్రామంలో ఆరు గ్యాంగులు.. ఈ గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ప్రధానమైన గ్యాంగులు ఆరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో రియాజ్‌ఖాన్, అతని తమ్ముడు నాజర్ ఖాన్ ప్రధానమైన అంతర్జాతీయ స్మగ్లర్లు. వీరితో పాటు ముక్తియార్, అల్లాబక్షు, ఆసీఫ్ అలీ, అర్షద్‌ఖాన్ బ్యాచ్‌లు అంత్యంత ముఖ్యమైనవి. వీరిలో ఆంధ్ర పోలీసులకు పట్టుబడింది అల్లాబక్షు, అర్షద్‌ఖాన్ మాత్రమే. ప్రైవేటు సైన్యం దాడులతో వారిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త వాహనాలు వెళితే స్మగ్లర్ల తనిఖీ.. కటికనహళ్లి సమీపంలో హరేహళ్లి, మఠంమాల్సంద్ర గ్రామాలు సైతం స్మగ్లింగ్‌కు పెట్టింది పేరు. ఈ గ్రామాలన్నీ హొస్కోటకు సమీపంలో ఉన్నవే. ప్రధాన రహదారి నుంచి ఈ గ్రామాలు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లినా ఈ గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులు ముందుగానే తనిఖీలు చేస్తారు. చిత్తూరు జిల్లా నుంచి దుంగలు తీసుకెళ్లే డ్రైవర్లు సైతం ఈ గ్రామాలకు 40 కి.మీ దూరంలోనే వాహనాలను ఆపేస్తారు. అక్కడి నుంచి కటికనహళ్లికి చెందిన డ్రైవర్లే తీసుకెళ్తారు. కటికనహళ్లి టూ కేరళ సముద్రతీరం.. కటికనహళ్లిలో గ్రేడింగ్ చేసిన దుంగలను చెన్నై, కేరళ సముద్ర తీరాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వారా దుబాయ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారముంది. మంగళూరు జిల్లా నుంచి కేరళ రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న సముద్ర తీరాల్లో ఈ స్మగ్లింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలున్నట్లు తెలుస్తోంది. అప్పటికే బుక్ చేసిన స్టీమర్లలో దుబాయ్‌కు తరలిస్తారని గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడిన నాజర్‌ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్‌లో పోర్ట్ సిబ్బందితో పాటు సెంట్రల్, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వాములేనని విచారణలో తేలింది. కర్ణాటక పోలీసుల కుమ్మక్కు.. కటికనహళ్లితో పాటు మరో రెండు గ్రామాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా స్మగ్లింగ్ జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోరు. బెంగళూరు రూరల్ జిల్లా హొస్కోట్, సర్జాపూర్ పోలీస్స్టేషన్లకు చెందిన పలువురు స్మగ్లర్లకు అండగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్ర పోలీసులు కటికనహళ్లికి వెళ్లి ఇక్కడి స్మగ్లర్లను పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది.