International Day of Action for Rivers
-
నదులకు లాలపోసే తల్లులు!
ప్రాణం పోసే శక్తి స్వరూపిణి స్త్రీ. మనుషులకే కాదు దైవసమానమైన నదులకు కూడా ప్రాణం పోస్తోంది ఆ శక్తి. జీవం కోల్పోయి, మృత్యుదిబ్బలుగా మారిన ఎన్నో నదులకు దేశవ్యాప్తంగా ప్రాణం పోస్తున్నారు మహిళలు. సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు...తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల గుండా ప్రవహించే పాలార్ నది ఉపనది నాగనది పూర్వవైభవం కోల్పోయింది. ఎండిపోయి నిర్జీవంగా మారింది. వర్షాలు పడినా సరే ఆ మృత నదిలో నీటి గలగలలు లేవు. ఈ నది ఎండి పోవడం పంట పొలాలపై, అక్కడి ప్రజల ఉపాధిపై ప్రభావం చూపింది. ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని పట్టణాల బాట పట్టారు.ఈ నేపథ్యంలో నదిని పునర్జీవింపజేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది. ఈ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం విశేషం. వెయ్యిమంది మహిళలు సంవత్సరం పాటు 21 గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ బావులు, రెండు వందల బౌల్డర్ చెక్‌లను నిర్మించారు. బౌల్డర్ చెక్‌లతో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేయడానికి, నీటి కోతను నివారించడానికి, భూగర్బ జల మట్టాలను పెంచడానికి ఎంతో కష్టపడ్డారు.వారి శ్రమ ఫలించిందిభూగర్భ జలాలు పెరిగాయి. అవి నాగనదిలోకి వెళ్లాయి. నది మెల్లగా ప్రాణం పోసుకోడం మొదలైంది. ఈ వార్త తెలిసిన మరింతమంది మహిళలు నాగనది పునర్జీవనోద్యమంలో భాగం అయ్యారు.ఇప్పుడు..నాగనది ఏడాది పొడవునా ప్రవహిస్తోంది. ఈ సజీవ ప్రవాహం ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక దృశ్యాన్ని మార్చివేసింది. వ్యవసాయం తిరిగి మొదలైంది. తమిళనాడులోని పదిహేను జిల్లాలలో ఇరవై అయిదు నదులను పునర్జీవింప చేయడానికి నాగనది స్ఫూర్తిగా మారింది.కోసీ నది కోసం...అటవీ నిర్మూలన పెరగడం వల్ల కోసీ నది ప్రమాదంలో ఉందని గ్రహించిన సామాజిక కార్యకర్త బసంతిదేవి బాధపడడానికి మాత్రమే పరిమితం కాలేదు. తన బాధ్యతగా గట్టిపని ఏదైనా చేయాలని అనుకుంది. నదితోపాటు సమీపంలోని అడవులను కాపాడాలని నిర్ణయించుకుంది.‘నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఉద్యమంలో మహిళలను భాగం చేయడానికి ఊరూ వాడా తిరిగింది ఉత్తరాఖండ్‌కు చెందిన బసంతి. ఎన్నో సంవత్సరాలు అలుపెరుగని కృషి చేసింది. వందలాది మంది మహిళలను కోసి నది పరిరక్షణ ఉద్యమంలో భాగం చేసింది. వందలాది గ్రామ మహిళలు చెట్లను రక్షించడానికి, మొక్కలను నాటడానికి, నదిని కాపాడుకోవడానికి నడుం కట్టారు.ప్రతి గ్రామంలో ఏర్పడిన మహిళా సంఘాల సమష్టి కృషి ద్వారా అడవుల నరికివేత ఆగిపోయింది. మొక్కలు చెట్లు అయ్యాయి. కోసి నది ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశాలలో నీరు సమృద్ధిగా దొరకడం మొదలైంది. నీటి ఊటలు పునర్జీవనం పొందాయి. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.‘సేవ్ కోసీ ఉద్యమం’ నేటికీ కొనసాగుతుండడం విశేషం.‘మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజులలో చాలా సందేహాలు ఉండేవి. అయితే ఉద్యమకారులకు సంకల్పబలం తప్ప సందేహాలు ఉండకూడదు అనే మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఉద్యమాన్ని విజయవంతం చేసింది’ అంటుంది ఉత్తరాఖండ్‌లోని చోప్రియాలి గ్రామానికి చెందిన భువనేశ్వరీ. ఆమె ‘మహిళా మంగళ్ దళ్’ సభ్యురాలు.నదుల నేస్తం... నీతా పటేల్గుజరాత్లోని వెనకబడిన జిల్లాలలో డాంగ్ ఒకటి. ఈ జిల్లాలోని గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న క్రమంలో నర్మదా, బహ్రూచ్ కొండ ప్రాంతాల్లో జూన్ అక్టోబర్ మాసాల మధ్య సమృద్ధిగా వర్షాలు కురిసిన్పటికీ ఆ ప్రాంతాలలో పచ్చదనం లేకపోవడాన్ని గమనించింది నీతా పటేల్. గ్రామస్తులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పటేల్.గ్రామాలు తిరుగుతూ ఎంతోమందిని సమీకరించింది. వందలాదిమందితో వేలాది మొక్కలు నాటించింది. డాంగ్ జిల్లాలో ప్రవహించే పూర్ణ, ఖాప్రి, అంబికా, గిరా, దోధాద్ నదులపై ఎన్నో చెక్ డ్యామ్‌లు, గ్రూప్ వెల్స్, చెక్ వాల్స్, బోరీ బంద్‌లు (ఇసుక నిండిని సంచుల) ఏర్పాటు చేసింది. ఎన్నో గ్రామాలలో మహిళలతో నీటి సంఘాలు ఏర్పాటు చేయించింది. సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థలను నీతా అభివృద్ధి చేసింది. దీనివల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ‘నది పరిరక్షణ ఉద్యమంలో విజయం సాధించడానికి ఈ ఉద్యమంలో భాగమైన ఎంతోమంది గిరిజన మహిళలు కారణం’ అంటుంది నీతా పటేల్....వీరు మాత్రమే కాదు జయశ్రీ వెంకటేశన్(తమిళనాడు), గౌరీ మిరాషి (కామ్ నది, ఔరంగాబాద్), కిరణ్ కౌర్ (బహ్మపుత్ర/వారద బేసిన్, అస్సాం), శాంతిరాయ్ (తీస్తా నది, పశ్చిమ బెంగాల్), జల్ సహేలి (ఉత్తర్‌ప్రదేశ్)... ఎంతో మంది వాటర్ ఛాంపియన్లు మృత్యుశయ్యపై ఉన్న నదులకు జీవం పోస్తున్నారు. నదుల కళ్లలో కొత్త వెలుగు తీసుకు వస్తున్నారు.సేవ్ గంగోత్రిపర్వతారోహకురాలు అయిన డాక్టర్ హర్షవంతి ‘సేవ్ గంగోత్రి’ ప్రాజెక్ట్‌తో ఎంతోమందిలో అవగాహన కలిగిస్తోంది. భోజ్ అడవిని పునరుద్ధరించే పని చేపట్టింది. వేలాది మొక్కలు నాటించింది. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ప్రాంతంలో ప్రధాన జల వనరుల దగ్గర పరిస్థితులను మెరుగు పరచడానికి విశేష కృషి చేసింది. నదుల రక్షణ, పర్యావరణంపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘మహిళా శక్తితో ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు’ అంటుంది హర్షవంతి.మన నదులు మన భవిష్యత్విధ్వంసక నీటి అభివృద్ధి ప్రాజెక్ట్‌లను (పెద్ద డామ్లు) వ్యతిరేకించడానికి, నదులకు జీవం పోసి కాపాడుకోవడానికి నదుల పరిరక్షణ దినం మొదలైంది. ఈ సంత్సరం థీమ్: మన నదులు–మన భవిష్యత్. నదీ పర్యావరణ వ్యవస్థలను రక్షించడం, పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఎన్నో సమావేశాలు, సదస్సులు, నదులను శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి, బ్రెజిల్‌లోని కురిటిబాలో 1997లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో నదుల పరిరక్షణ దినోత్సవానికి బీజం పడింది. -
‘మూసీ’లా మారే ప్రమాదం
గంగానదితో సహా మనదేశంలో అనేక ముఖ్యనదులు, వాటి ఉపనదులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదుల్లో కూడా కాలుష్యం బాగా పెరిగిపోయింది. గోదావరి నది వెంబడి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశ్రామిక వ్యర్థాలను; వివిధ పట్టణ, నగరాల ‘సీవరేజ్’ను శుద్ధిచేయకుండా వదిలివేస్తుండటంతో దానిలో కాలుష్య స్థాయి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది. భద్రాచలం ఎగువన ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధిచేయకుండా నదిలోకి వదిలేస్తున్నాయి. భద్రాచలం పట్టణం నుండి వచ్చే మురుగు... ‘ఫిల్టరేషన్’ లేకుండానే గోదావరిలో కలుస్తోంది. ఐటీసీ పేపర్ బోర్డు పరిశ్రమ నుండి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలిసిపోతోంది. అలాగే ఇతర పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల కూడా గోదావరి కాలుష్యం బారిన పడుతోంది. మూడు దశాబ్దాలకు ముందు 1991లో రూ. 34.19 కోట్లతో ‘గోదావరి నదీ కాలుష్య నివారణ పథకం’ ప్రయత్నం మొదలైనా... అలసత్వం వల్ల అది అమలుకు నోచుకోలేదు. కృష్ణానదిలో కాలుష్యం మరింత దారుణంగా ఉంది. గత దశాబ్ద కాలంలో కృష్ణానదిలో వివిధ రకాల కాలుష్యం రెట్టింపైనట్లు నిపుణులు చెపుతున్నారు. కృష్ణానదిలో ‘బయొలాజికల్ ఆక్సిజన్ డిమాండ్’ (బీఓడీ), ‘అల్కల్నిటీ’ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా ‘ఆహార ప్రక్రియ పరిణామ క్రమం’లో తీవ్రమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల ప్రక్షాళనకు తగిన చర్యలు తీసుకోకపోతే మూసీ నదిలా మురుగు కాల్వల్లా ఇవీ మారిపోయే ప్రమాదం ఉందని గ్రహించి సత్వరమే కార్యాచరణకు పూనుకోవాలి. – డా. కొత్తపల్లిశ్రీనివాసవర్మ, జర్నలిస్టు మార్చి 14న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ -
విందామా నది గీతం
మన సంస్కృతిలో నదీ జలాలు అత్యంత పవిత్రమనే భావన ఉంది. కేవలం అవసరాల కోసమే నదీ జలాలనీ, అదే వాటి ఉపయోగమనీ భారతీయులు భావించరు. నదిలో ఒక్కసారి మునిగితే పాపప్రక్షాళన అవుతుందని, మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. తల్లి తర్వాత పుణ్యస్థలిగా నదీమతల్లులను కొలిచే దేశం మనది. ఆధ్యాత్మిక జీవనానికి ప్రధాన భూమిక పోషించేవి నదులే! దేవతాస్వరూపాలుగా ప్రతి భారతీయుడూ భావించే నదుల సందర్శన జీవితకాల ధన్యతను చేకూర్చుతుందని నమ్మేవారెందరో! ప్రకృతి ప్రేమికులూ నదుల చుట్టూ అల్లుకుపోయిన ఆహ్లాదకరవాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఆ విధంగా నదులు పర్యాటకరంగంలో ఓ భాగమయ్యాయి. మార్చి 14 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్’ సందర్భంగా మన దేశంలో నదీ విహారం గురించి ఈ ప్రత్యేక వ్యాసం.. -నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నాగరికతలన్నీ నదీ తీరాన వెలసినవే. పంట పొలాలకు నీరందించి, వాటిని సస్యశ్యామలం చేయడమే కాకుండా రవాణా, విద్యుచ్ఛక్తి, చేపల పెంపకం.. ఇంకా అనేకానేక మానవావసరాలకు ఉపయోగపడుతున్నవి. హిమాలయాల్లో పుట్టి భారతదేశాన్నంతటినీ పలకరిస్తున్న నదుల జాబితా మన దగ్గర పెద్దదే! ఒక కొత్త అనుభూతి కోసం మన దేశంలో నదీ ప్రయాణం ఓ ప్రత్యేకమైన మార్గాన్ని చూపుతోంది. నదుల ఉపయోగం తెలుసుకోవాలన్నా, నదీ జలాలను కాపాడడానికి మనదైన గొంతుకను వినిపించాలన్నా వాటిని దగ్గరగా సందర్శించాలి. అందుకే, రండి నదీ విహారానికి... ఆధ్యాత్మిక ప్రయాణం గంగ... మనదేశంలో అతి ప్రధానమైనది, అత్యంత పవిత్రమైనది గంగానది. ఒక్కసారి ఈ నదిలో మునిగితే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని హిందువుల నమ్మిక. హిమాలయాల్లో పుట్టిన ఈ నదీ తీరాన ఎన్నో పుణ్యక్షేతాలు వెలిశాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది కాశీ పుణ్యక్షేతం. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్న ఈ నది బెంగాల్‌లోని ఫరక్కా, కలకత్తాల మధ్య పడవ ప్రయాణం యాత్రికులు మర్చిపోలేనిది. ఈ ప్రయాణంలో ఉత్తర భారతదేశంలోని వారసత్వ కట్టడాలతో పాటు ఇతర సందర్శనీయ స్థలాల వీక్షించవచ్చు. అయితే, ఎంతో ఘన ఖ్యాతి గంగా నది మానవ తప్పిదాల వల్లే కాలుష్యం బారిన పడిందని పర్యావరణ నివేదికలు చెబుతున్నాయి. అయినా ఎన్నో మార్గాలలో ఆహ్లాదంగా పలకరించే ఈ నది రిషీకేష్ దగ్గర శివపురి నుంచి లక్ష్మణ్ ఝూలా వరకు ఏడాది పొడవునా తెప్పల పోటీలు జరుగుతాయి. ఈ రివర్ రాఫ్టింగ్ సాహసకృత్యాలలో పాల్గొనేవారి సంఖ్య ప్రతీ ఏడాదీ పెరుగుతూనే ఉంది. పొడవైన ప్రయాణం బ్రహ్మపుత్ర... హిమాలయాలలోని మానస సరోవరం సమీపంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తున్నది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్రా నదీ ప్రయాణం ప్రధానంగా అస్సామ్‌లో 850 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కజిరంగా జాతీయ ఉద్యానంలోని ఎలిఫెంట్ సఫారీ చెప్పుకోదగినది. నదీ తీరాన ఎన్నో దేవాయాలు, తేయాకు తోటలు, గ్రామాలలో పట్టు పరిశ్రమలు.. చూడదగినవి. బ్రహ్మపుత్రా నది పసిఘాట్ వద్ద 180 కిలోమీటర్ల పొడవున సాగే తెప్పల ప్రయాణం అత్యంత ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 300 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయాలను ఈ న దీ ప్రయాణ గమనంలో వీక్షించవచ్చు. ప్రాచీన నాగరికత ప్రయాణం సింధు... సింధునది హిమాలయాలలోని కైలాస పర్వత సానువులలో పుట్టి.. మార్గంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులను కలుపుకుంటూ పాకిస్థాన్‌లో అరేబియా సముద్రంలో కలుస్తున్నది. భారత, పాకిస్తాన్‌లు రెండు దేశాలకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ నది వల్ల మనదేశంలో పంజాబీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు అధిక ప్రయోజనం పొందుతున్నాయి. కైలాసగిరి నుంచి మొదలైన సింధు నది ప్రయాణం జమ్మూ, కాశ్మీర్లో 550 కి.మీ ఉంటుంది. ఇక్కడే లడాఖ్, జన్స్కర్ ప్రాంతాలలో ప్రతి జులైలో సింధు నదీ ఉత్సవాలు జరుపుతారు. వేసవిలో ఈ నదీ ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి స్థాయి హెచ్చుగా ఉండటంతో తెప్పల (రివర్‌రాఫ్టింగ్) పోటీలతో ఈ నదీ ప్రాంతం కళకళలాడుతుంటుంది. నదీ విహారం ఎందుకంటే... ప్రకృతి సౌందర్య వీక్షణకు. నదుల పరిరక్షణ అవసరం తెలుసుకోవడానికి. తమ వంతు ప్రయత్నంగా పరిశోధనకు పూనుకోవడానికి. నదీ జలాలు కలుషితం అవడానికి గల కారణాలను వెతకడానికి. అందమైన ప్రకృతి దృశ్యాలను కెమెరా కన్నుతో వీక్షించడానికి. ఫిల్మ్ డాక్యుమెంటరీ నిర్మాణానికి. సూర్యోదయ, సూర్యాస్తమయాల వీక్షణకు. ఆధ్యాత్మికంగా మన గురించి మనం తెలుసుకోవడానికి. పర్యాటకులు ప్రధానంగా వీటిని దృష్టిలో పెట్టుకొని టూర్ప్యాకేజీలు, టూర్ గైడ్లను ఎంచుకుంటారు. అయితే ఇవి ఆయా ప్రాంతాలలో ఉన్న నదీ సౌందర్యాన్ని బట్టి పర్యాటకుల ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా విదేశీ పర్యాటకులు నదీ తీరాలలో, నదీ జలాలలో విహరించడానికి వస్తుంటారు. ఎంచుకున్న ప్రాంతం, వారికున్న పని, బడ్జెట్‌ను బట్టి ప్యాకేజీలు ఉంటాయి. సురక్షిత ప్రయాణం గోదావరి... పక్షుల కువకువలు వింటూ, పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ పెద్ద పెద్ద కొండలను దాటుకుంటూ, నదీ తీరంలో గిరిజన గ్రామాలను చూస్తూ సాగే ప్రయాణంలో గోదావరిది అగ్రతాంబూలం. దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన గోదావరి నాసిక్ సమీపంలోని త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉపనదులు కలుపుకుంటూ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద మొదలయ్యే ఈ పడవ ప్రయాణం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. చిన్న చిన్న పడవల ద్వారానూ ప్రయాణికులు నది ఆవలి ఒడ్డుకు చేరుకుంటూ ఆనందోల్లాసాలను పొందుతుంటారు. ప్రకృతి ఆరాధకుల్లో చాలా మంది ఒక్కొక్కరుగానే ఈ నదీ తీర సందర్శనకు చేరుకునేవారుంటారు.ఆహ్లాదకర ఆనందాలను, ఆధ్యాత్మిక సౌరభాలను ఎద నిండా నింపే గోదావరి పర్యాటకులకు సురక్షితమైనదిగా పేరుంది. అయితే, మధ్య భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో నదీ విహారం అనేది చాలా పరిమితంగానే ఉంటోంది. గోదావరి నదీ తీరంలో ఉన్న దేవాలయాలు, కొన్ని సాంస్కృతిక కేంద్రాలకే పర్యటనలు పరిమితమయ్యాయి. ఇక్కడితో పోల్చుకుంటే కేరళ రాష్ట్రంలోని బ్యాక్‌వాటర్ క్రూయిజ్ విహారం అత్యద్భుతంగా ఉంటోంది. ఇక్కడి క్రూయిజ్ ప్యాకేజీలు, వినోదకార్యక్రమాలు సెలవుదినాల్లో ప్రత్యేక ఆఫర్లతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.నదుల ప్రయాణంలో మమేకమైన వారికి ఎన్నో ఆనందాలే కాదు.. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, విజ్ఞానమూ చేరువవుతుంది. పచ్చందనాల పరవశం కృష్ణ... పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. తుంగభద్ర, భీమ, మూసీ, ఘట ప్రభ, మున్నేరు ఉపనదులను కలుపుకుంటూ ఈ ప్రయాణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదిలో పడవ ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ లాంచీ సదుపాయాన్ని కల్పిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి సాగే పడవ ప్రయాణంలో ప్రకృతి సోయగాలను, గిరిజన గ్రామాలను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శిస్తూ ఉల్లాసంగా గడపవచ్చు.


