‘మూసీ’లా మారే ప్రమాదం

International Day of Action for Rivers: Godavari, Krishna Rivers Getting Polluted - Sakshi

గంగానదితో సహా మనదేశంలో అనేక ముఖ్యనదులు, వాటి ఉపనదులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదుల్లో కూడా కాలుష్యం బాగా పెరిగిపోయింది. గోదావరి నది వెంబడి తెలంగాణ  రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశ్రామిక వ్యర్థాలను; వివిధ పట్టణ, నగరాల ‘సీవరేజ్‌’ను శుద్ధిచేయకుండా వదిలివేస్తుండటంతో దానిలో కాలుష్య స్థాయి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది. భద్రాచలం ఎగువన ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధిచేయకుండా నదిలోకి వదిలేస్తున్నాయి. భద్రాచలం పట్టణం నుండి వచ్చే మురుగు...  ‘ఫిల్టరేషన్‌’ లేకుండానే గోదావరిలో కలుస్తోంది. ఐటీసీ పేపర్‌ బోర్డు పరిశ్రమ నుండి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలిసిపోతోంది. 

అలాగే ఇతర పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల కూడా గోదావరి కాలుష్యం బారిన పడుతోంది. మూడు దశాబ్దాలకు ముందు 1991లో రూ. 34.19 కోట్లతో ‘గోదావరి నదీ కాలుష్య నివారణ పథకం’ ప్రయత్నం మొదలైనా... అలసత్వం వల్ల అది అమలుకు నోచుకోలేదు.

కృష్ణానదిలో కాలుష్యం మరింత దారుణంగా ఉంది. గత దశాబ్ద కాలంలో కృష్ణానదిలో వివిధ రకాల కాలుష్యం రెట్టింపైనట్లు నిపుణులు చెపుతున్నారు. కృష్ణానదిలో ‘బయొలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌’ (బీఓడీ), ‘అల్కల్నిటీ’ లెవెల్స్‌ బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా ‘ఆహార ప్రక్రియ పరిణామ క్రమం’లో తీవ్రమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గోదావరి, కృష్ణా నదుల ప్రక్షాళనకు తగిన చర్యలు తీసుకోకపోతే మూసీ నదిలా మురుగు కాల్వల్లా ఇవీ మారిపోయే ప్రమాదం ఉందని గ్రహించి సత్వరమే కార్యాచరణకు పూనుకోవాలి.

– డా. కొత్తపల్లిశ్రీనివాసవర్మ, జర్నలిస్టు
మార్చి 14న ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ రివర్స్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top