breaking news
Intermediate College
-
జూలైలో ద్వితీయ.. ఆగస్టులో ప్రథమ తరగతులు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యా ఏడాది ప్రారంభంపై కసరత్తు కొనసాగుతోంది. తరగతుల నిర్వహణ ఎలా అనే దానిపై బోర్డు నియమించిన అధికారుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నివేదికను విద్యాశాఖ మంత్రికి అందజేసే అవకాశం ఉంది. తరువాత దానిపై చర్చించి ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూలైలో సెకండియర్ తరగతులు, ఆగస్టులో ఫస్టియర్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. నష్టపోయిన పని దినాల సర్దు బాటు, భౌతికదూరం పాటించేలా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనలు, షిప్ట్ పద్ధతులు, ఒక్కో సెక్షన్లో విద్యార్థుల సంఖ్య కుదింపు వంటి అంశాలపై కమిటీ పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. అయితే ఈ కమిటీ తరగతుల ప్రారంభానికి సంబంధించి సిఫార్సు చేసినా, కరోనా కేసులు, కట్టడి పరిస్థితుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే తుది నిర్ణయం ఆధారంగానే ఉండనున్నాయి. ఒకవేళ కేంద్రం కనుక జూలైలో తరగతుల నిర్వహణ వద్దంటే సెకండియర్ తరగతులు ఆగస్టులోనే ప్రారంభించే అవకాశం ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు.. ► జూలైలో ఇంటర్ సెకండియర్, ఆగస్టులో ఫస్టియర్ క్లాసుల్ని ప్రారంభించాలి. ► విద్యా ఏడాది ఆలస్యంతో ఎన్ని రోజులు నష్టపోతే అన్ని రోజుల సిలబస్‌ను ఆన్లైన్లో నిర్వహించాలి. లేదంటే నష్టపోయిన పనిదినాల్లో సగం ఆన్లైన్లో నిర్వహించాలి. మిగతా సగం పాఠాలను సిలబస్ నుం చి తొలగించవచ్చా? అనేది చూడాలి. ఈ మేరకు ఇంటర్ వార్షిక పరీక్షల్లోనూ వాటిని తొలగించి, ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఎంసెట్‌లోనూ ఆ మేరకు చర్యలు చేపట్టాలి. ► రెగ్యులర్ తరగతుల నిర్వహణలో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌కు చర్యలు చేపట్టాలి. కొంతమందికి ఆన్లైన్, కొంతమందికి ఆఫ్‌లైన్ నిర్వహణను పరిశీలించాలి. లేదంటే ఫస్టి యర్ వారికి ఉదయం, సెకండియర్ వారి కి మధ్యాహ్నం నిర్వహించవచ్చు. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్ వారికి, మరో మూడ్రోజులు సెకండియర్ వారికి నిర్వహించవచ్చా? అనేది చూడాలి. ఒకే కోర్సు లోని విద్యార్థులను విభజించి రోజు విడిచి రోజు ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను పరిశీలించాలి. ► ఆన్లైన్ బోధనకు వెళ్లే క్రమంలో అందుకు తగిన సదుపాయాలున్నాయో లేవో చూ డాలి. ప్రస్తుతం విద్యార్థులకు ఫోన్లు ఉన్నా యి. ఫోన్ విత్ డేటా ఉండేలా ట్యాబ్స్‌ను గవర్నమెంట్ సరఫరా చేస్తే విద్యార్థులకు ఉపయోగం. ► ఆన్లైన్ కంటెంట్ ప్రస్తుతం మార్కెట్లో విద్యార్థులకు అర్థం కానివి ఉన్నాయి. వర్చువల్ ల్యాబ్స్‌ను ప్రైవేటు సంస్థలతో రూపొందించాలి. అధ్యాపకులు వాటిని ఉపయోగించుకొని ఆన్లైన్లో బోధన నిర్వహించాలి. ► పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడం సాధ్యమవుతుందో లేదో పరిశీలించాలి. ► తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేందుకు ప్రస్తుతం సెక్షన్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను తగ్గించాలి. ప్రస్తుతం ఒక్కో సెక్షన్లో 88 మంది ఉంటున్నారు. దానిని 40–50కి పరిమితం చేయాలి. ► హైజెనిక్ కండిషన్‌కు జాతీయ స్థాయి నిబంధనల్ని పాటించాలి. ► రోజూ తరగతి గదుల శానిటైజేషన్‌కు చర్యలు చేపట్టాలి. ► స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు చే యాలి. తరగతి గదుల్లో మాస్క్ తప్పనిస రి. హ్యాండ్‌వాష్ అమలుచేయాలి. ► కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం భౌతికదూరం పాటించాలి. ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దు. -
విజయవాడలో శ్రీ చైతన్య కళాశాల నిర్వాకం
సాక్షి, విజయవాడ : గురునానక్ కాలనీలోని శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్‌లో విద్యార్ధుల తల్లిదండ్రులు, కళాశాల సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రలు వారిని ఇంటికి వెళ్ళటానికి కళాశాలకు చేరుకున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థుల ఫీజులకు అదనంగా మరో పదివేలు కట్టి సామానులు తీసుకువెళ్లాలంటూ సిబ్బంది వారిని అడ్డకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అనుకున్నదాని ప్రకారం ఫీజు అంతా కట్టిన తరువాత అదనంగా మరో పదివేలు ఎందుకు కట్టాలని కళాశాల సిబ్బందిని నిలదీశారు. అయితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. అదనంగా ఫీజు కడితేనే విద్యార్థుల సమాన్లు, సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారని తల్లి దండ్రులు ఆరోపించారు. -
‘అవేర్’ కళాశాల వద్ద ఉద్రిక్తత
అశ్వారావుపేట, న్యూస్‌లైన్ : అవేర్ సంస్థకు చెందిన స్థానిక వ్యవసాయ ఇంటర్మీడియేట్ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఏడుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తొలుత రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేయొద్దని, కళాశాల వద్దే ఆందోళన చేయాలని ఎస్సై రమేష్ సూచించడంతో అక్కడికి చేరుకున్నారు. కళాశాలలోకి ప్రవేశించేందుకు యత్నించగా యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఎస్సై జోక్యం చేసుకుని విద్యార్థులను లోపలికి పంపించారు. కళాశాలలో నాణ్యమైన ఆహారం అందించాలని, హాస్టల్లో భద్రత కల్పించాలని, పాములు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన ఏడుగురిని సస్పెండ్ చేయడం అన్యాయమని విద్యార్థులు నినదించారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకూ ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేత కుదరని సిబ్బంది కరాఖండిగా చెప్పడంతో విద్యార్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లి ఉరేసుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థులు చేతులు కోసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో సిబ్బంది అసహనానికి గురయ్యారు. ఈ గొడవ తమకెందుకని, రాజీనామాలు చేసి వెళ్లిపోతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కళాశాల వద్ద చోటుచేసుకున్న పరిణామాల గురించి అవేర్ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందింది. స్పందించిన యాజమాన్యం విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తామని, కళాశాలలోని సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.