breaking news
inter district championship
-
టైటిల్ పోరుకు హైదరాబాద్ జట్లు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాయి. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 34–28తో నల్లగొండపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 15–13తో ఆధిక్యంలో ఉన్న హైదరాబాద్ చివరివరకు దాన్ని కాపాడుకుంది. రెండో సెమీస్‌లో వరంగల్ 38–19తో రంగారెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల సెమీస్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 24–22తో ఖమ్మంపై గెలుపొందగా, నల్లగొండ 36–32తో రంగారెడ్డిని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
హైదరాబాద్ జట్లకే టైటిల్స్
హైదరాబాద్: తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు దక్కించుకున్నాయి. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు 13-15, 15-9, 15-11తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందగా... మహిళల విభాగంలోనూ హైదరాబాద్ జట్టు 13-15, 15-10, 15-12తో రంగారెడ్డి జట్టుపైనే విజయం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్లు వరుసగా రెండోసారి గెలుచుకోవడం విశేషం. పురుషుల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో వరంగల్ జట్టు 15-09, 13-11తో నిజామాబాద్‌పై, మహిళల కేటగిరీలో ఖమ్మం 15-1, 15-10తో కరీంనగర్‌పై పైచేయి సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్, బోయిన్పల్లి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పల్లవి మోడల్ స్కూల్, అల్వాల్ ప్రిన్సిపాల్ సునీర్ నాగి పాల్గొన్నారు.