Inspector post
-
సర్పవరం పోలీసు స్టేషన్ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు మాం...చి డిమాండ్ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్స్పెక్టర్గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్ అయ్యారు. కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్‌లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్ రవికుమార్ ఇన్చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్‌కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్ సీట్‌గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అందరి కళ్లూ దానిపైనే.. కాకినాడ రూరల్ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్ కోసం కాకినాడ రూరల్‌లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్లో పోస్టింగ్ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి. ఇప్పుడూ డిమాండే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్లు ఈ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిట్టుబాటు ఖాయం! కాకినాడ రూరల్ మండలంలో ఉన్న రెండు ఇన్స్పెక్టర్ పోస్టులకు ఒకే తరహా డిమాండ్ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్ సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్‌కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్æ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది. -
ఈ సీటు... యమ హాటు!
♦ పటాన్చెరు ఇన్స్పెక్టర్ పోస్టుకు భలే గిరాకీ ♦ ఐదేళ్లలో ఐదుగురి బదిలీ ఓ దఫా పనిచేస్తే ♦ స్థిరపడొచ్చన్న భావన ♦ సగటున ఎనిమిది నెలలకో అధికారికి స్థానచలనం ♦ కారణం తెలియకుండానే బదిలీ ♦ తరచూ మార్పులపై అన్ని వర్గాల్లోనూ విస్మయం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలీసు అంటేనే గుండె ధైర్యం... దానికి బుద్ధిబలం, భుజబలం తోడైతే సూపర్ పోలీస్. కానీ పటాన్‌చెరుకు పోలీస్ బాసులుగా వచ్చిన వారు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పోస్టింగ్ తీసుకునే వారికి అ‘ధన’పు అర్హత ఉండాలట!. ఈ సర్కిల్ బాస్ కుర్చీలోకి వచ్చేవారికి నియమ నిబంధనలు బలాదూర్. సహచర మిత్రులు కళ్లు మూసి తెరిచేలోగా సీటు మీదికెక్కి కూర్చుంటారు. అంతే వేగంగా తెరమరుగై పోతుంటారు. గడిచిన ఐదేళ్లలో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఐదుగురు ఇన్స్పెక్టర్లు వచ్చిపోవడమే ఇందుకు నిదర్శనం. బాధ్యతలు చేపట్టిన వారికి పట్టు వచ్చే సరికి తప్పిస్తున్నారు. ఫలితంగా శాంతిభద్రతలను అదుపు చేయడం కష్టసాధ్యమవుతుందన్న వాదన కూడా ఉంది. మూడేళ్లయినా పనిచేయాలి... సాధారణంగా ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనీసం మూడేళ్లయినా పనిచేయాలి. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో పారదర్శక కారణాలతో ఇన్స్పెక్టర్ను బదిలీ చేయవచ్చు. ఇక్కడ ఇన్స్పెక్టర్ పోస్టుకు ఏ ప్రత్యేక కారణాలు పనిచేస్తున్నాయో తెలియదు.. కానీ, సగటున ప్రతి ఎనిమిది నెలలకో అధికారి బదిలీ అవుతున్నారు. దీంతో పటాన్చెరు సీఐ అంటేనే పవర్ అన్న పేరొచ్చింది. జిల్లాలో మిగితా ప్రాంతాలతో పోలిస్తే పటాన్చెరు పోస్టుకు డిమాండ్ ఎక్కువే అని చెప్పవచ్చు. పటాన్చెరు అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కావడం, రియల్ వ్యాపారం ఎక్కువగా ఉండటం, వాణిజ్య సంస్థలు, వ్యాపార కేంద్రాలకు తోడు సివిల్ వ్యవహారాలు ఎక్కువగా సీఐ పోస్టును ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక్కసారైనా ఇక్కడి సీటులో కూర్చుంటే ఆర్థికంగా స్థిరపడవచ్చన్న భావన పోలీసు వర్గాల్లో పేరుకుపోయిదంటే ఆశ్చర్యం కలగక మానదు. దీనికితోడు అదనంగా హెచ్ఆర్ఏ లభించడం, హైదరాబాద్‌కు పటాన్చెరు సమీపంగా ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కానీ ఈ పోస్టు దక్కడం అంత సులువేమీ కాదు. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల ఆశీస్సులతోపాటు రాజకీయ పలుకుబడి ఉంటే తప్ప ఇక్కడ పోస్టింగ్ రాదని పోలీసు వర్గాల్లో విస్తృత ప్రచారంలో ఉంది. అయితే అన్ని కష్టాలు పడి ఈ పోస్టింగ్ దక్కించుకున్నా ఎక్కువ కాలం అక్కడ కొనసాగలేకపోతున్నారు. ఇలా వచ్చి.. అలా వెళ్తున్నారు.. ఈ సీటు జిల్లాలోనే హాట్ కేకులా మారింది. ఈ పోస్టును దక్కించుకున్న వారంతా ఇలా వచ్చి ... అలా వెళ్తున్నారు. సగటున 8 నెలలకంటే ఎక్కువగా పనిచేసే వాతావరణం ఇక్కడ లేదు. 2010 నుంచి బదిలీ వ్యవహారం ఇలానే సాగుతోంది. 2010 నవంబర్ 21న పటాన్చెరు బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన కె.కిష్టయ్య ఆరు నెలలు మాత్రమే పనిచేయగలిగారు. ఏమైందో ఏమో కానీ, అర్ధంతరంగా బదిలీ చేసి రవీందర్ రెడ్డిని నియమించారు. ఆయన కిందామీదపడి రెండేళ్లు పూర్తి చేశారు. వెంటనే ఆయన్నూ బదిలీ చేసి శంకర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయన కేవలం 18 నెలలపాటు పనిచేయగా కిష్టయ్యకు బాధ్యతలు అప్పగించారు. శంకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలకు ఆర్థిక, రాజకీయ పలుకుబడితోపాటు సామాజికవర్గ నేపథ్యంలో కనీసం అటు ఇటుగా రెండేళ్ల కాలమైనా పనిచేయగలిగారు. కృష్ణయ్య పూర్తికాలం ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆరు నెలలలోపే బదిలీ చేశారు. ఆయన బదిలీకి కారణాలేంటో ఎవరికీ తెలియదు. ఆయన బదిలీపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో బదిలీ చేసిన అధికారులకే తెలియాలి. ఆ తర్వాత లింగేశ్వర్‌రావు బాధ్యతలు చేపట్టారు. 26 ఆగస్టు 2015న పటాన్‌చెరుకు అటాచ్ అయిన లింగేశ్వర్‌రావు ఆ తర్వాత.. 15 అక్టోబర్ 2015న ఇక్కడే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఈయన కూడా ఎనిమిది నెలలలోపే బదిలీ ఉత్తర్వులు అందుకోవాల్సివచ్చింది. ఆయన స్థానంలో కొత్తగా ప్రభాకర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈయన కూడా ఎంతకాలం ఉంటారో వేచి చూడాలి మరి. బదిలీలపై విమర్శల వెల్లువ... పటాన్చెరు పోలీస్ బాసులు స్వల్పకాలంలోనే బదిలీలు అవుతుండటం విమర్శలకు దారితీస్తోంది. సీఐలు పూర్తికాలం పనిచేయకపోవటం వల్ల ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. అదీగాక నేరాలతోపాటు రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరచూ అధికారులను మార్చడం వల్ల ప్రజలకు పోలీసులపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ వ్యవహారంపై ప్రజలు, రాజకీయ వర్గాలతోపాటు పోలీసుశాఖలోనూ అంతర్గత విమర్శలకు దారితీస్తోంది.


