సర్పవరం పోలీసు స్టేషన్‌ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు? | Kakinada Sarpavaram CI Post Sparks Intense Competition Amid Alleged Political Lobbying, More Details Inside | Sakshi
Sakshi News home page

సర్పవరం పోలీసు స్టేషన్‌ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు?

May 9 2026 9:39 AM | Updated on May 9 2026 12:28 PM

Sarpavaram Police Station SI Post Sparks Controversy

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు మాం...చి డిమాండ్‌ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్‌స్పెక్టర్‌ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్‌)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్‌స్పెక్టర్‌గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్‌లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్‌ అయ్యారు. 

కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్‌లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్‌ రవికుమార్‌ ఇన్‌చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్‌కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్‌ సీట్‌గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. 

అందరి కళ్లూ దానిపైనే.. 
కాకినాడ రూరల్‌ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్‌ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్‌ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్‌ కోసం కాకినాడ రూరల్‌లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్‌లో పోస్టింగ్‌ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్‌ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి.  

ఇప్పుడూ డిమాండే 
అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్‌ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్‌.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్‌లు ఈ పోస్టింగ్‌ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్‌ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  

గిట్టుబాటు ఖాయం! 
కాకినాడ రూరల్‌ మండలంలో ఉన్న రెండు ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఒకే తరహా డిమాండ్‌ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్‌ సర్కిల్‌ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్‌లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్‌కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్‌ వంటి ఇండస్ట్రియల్‌ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్‌æ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి  వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement