breaking news
indian teachers kidnap
-
నా భర్తను విడిపించండి: కల్యాణి
హైదరాబాద్ : లిబియాలో కిడ్నాప్‌కు గురైన తన భర్తను క్షేమంగా విడిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని గోపీకృష్ణ భార్య కల్యాణి కోరారు. గత ఏడేళ్లుగా తన భర్త లిబియాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారని ఆమె తెలిపారు. కిడ్నాప్ విషయం తనకు నిన్న తెలిసిందని, తన భర్తతో పాటు మరో ముగ్గురు విధులకు వెళ్తుండగా కారు ఆపి డ్రైవర్‌ను దించేసి అపహరించి తీసుకు వెళ్లారన్నారు. బుధవారం సాయంత్రం తన భర్తతో చివరిసారిగా మాట్లాడినట్లు చెప్పారు. గోపికృష్ణ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాచారంలో నివాసం ఉంటోంది. బలరాం శ్రీకాకుళం జిల్లా వాసి. కాగా గోపీకృష్ణ కిడ్నాప్ అయ్యాడా, మరొకటా అనేది తమకు ఇంకా స్పష్టత రాలేదని ఆయన సోదరుడు మురళీ అన్నారు. తాము లిబియా ఎంబసీతో మాట్లాడామని, అయితే ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారా, లేదా అనేది తమకు తెలియాల్సి ఉందన్నారు. లిబియా రాజధాని ట్రిపోలిలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురైన విషయం విదితమే. కాగా, ఇందులో ఇద్దరు కర్ణాటక వారు, ఒకరు తెలంగాణ, మరొకరు ఆంధ్రప్రదేశ్ వాసి అని సమాచారం. -
లిబియాలో నలుగురు భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ : లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వీరంతా బుధవారం సాయంత్రం అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా కిడ్నాప్‌కు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. తెలుగువారిలో హైదరాబాద్ కు చెందిన గోపీకృష్ణ, బలరామ్ గా గుర్తించారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా తమవారు కిడ్నాప్ అయిన వార్త తెలుసుకున్న బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమవారిని క్షేమంగా విడిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.