breaking news
IIFA Awards 2016
-
మగవాళ్లు చూడాల్సిన సినిమా : నాగార్జున
‘‘చునియా దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉంది. అందరి ఆశీస్సులే ఆమెకు పెద్ద అండ. ఈ చిత్రాన్ని ముఖ్యంగా మగవాళ్లు చూడాలి. ఆడవాళ్లను ఎలా ప్రేమలోకి దింపాలో ఇందులో అద్భుతంగా చూపించారు. బాయ్‌ఫ్రెండ్, భర్త నుంచి ఆడవాళ్లు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రలో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడేసావే’. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని నాగార్జున, దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. పాటల సీడీని రాఘవేంద్రరావు ఆవిష్కరించి మాజీ ఎం.పి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఇచ్చారు. ‘‘నేను దర్శకత్వం వహించిన ‘శాంతినివాసం’ సీరియల్లో చునియా- కన్నాను పడేస్తే, సుమ-రాజీవ్ కనకాలను పడేసింది. రాజమౌళి దగ్గర పనిచేయడంతో ప్రేక్షకుల్ని ఎలా పడేయాలో కొంత టెక్నిక్‌ను చునియా నేర్చుకుంది’’ అని రాఘవేంద్రరావు తెలిపారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ‘‘నాగార్జునది లక్కీ హ్యాండ్’’ అన్నారు. -
నా మీద సెటైర్లకు...నవ్వుకోవడానికి నేను రెడీ!
సెలబ్రిటీలపై సెటైర్లు వేయడం అంటే రిస్కే. హద్దులు దాటితే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ లిమిట్ తెలుసుకుని జోక్ చేస్తే, అప్పుడు అందరూ హాయిగా నవ్వుకుంటారు. ‘ఐఫా’లో తెలుగు అవార్డుల ప్రదానోత్సవానికి హోస్ట్‌లుగా వ్యవహరించిన అల్లు శిరీష్, నవదీప్, రెజీనాలు వేసిన సెటైర్లు అలా అందర్నీ నవ్వించాయి. యాంకర్‌గా పొందిన అనుభూతిని అల్లు శిరీష్ పంచుకున్నారు. ముఖ్యాంశాలు.. ♦ బాలీవుడ్ ‘ఐఫా’ అవార్డులు ప్రదానానికి నేను వెళ్లా. విద్యాబాలన్‌లా డ్రెస్ చేసుకుని షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్, షాహిద్ కపూర్ చేసిన స్కిట్ చూసి, ‘మన తెలుగులో ఇలా ఎందుకు చేయడం లేదు?’ అనుకున్నా. ఎవరో ఒకరు ముందడుగు వేయాలని ‘ఐఫా-ఉత్సవం’కి యాంకర్‌గా చేశా. ♦ ‘విజ్ క్రాఫ్ట్’ ఆండ్రే నాకు మంచి స్నేహితుడు. యాంకర్‌గా చేస్తాననీ, నాకో మంచి కాంబినేషన్ ఉంటే బాగుంటుందనీ నవదీప్ పేరు సజెస్ట్ చేశా. మా ఇద్దరితో పాటు ఎవరైనా ఫిమేల్ స్టార్ ఉంటే రసవత్తరంగా ఉంటుందనుకుని, రెజీనాని అడిగితే ‘ఓకే’ చెప్పింది. స్క్రిప్ట్ మొత్తం దాదాపు నేనే అనుకున్నా. నేనేదీ ఆశించి చేయలేదు కానీ, నాకు చెక్ పంపించారు. ‘ఎందుకు?’ అనడిగితే ‘ఫ్రెండ్షిప్ వేరు.. ఇది వేరు’ అన్నారు. ♦ సెలబ్రిటీల మీద సెటైర్లు వేయడం అంటే వాళ్లను నవ్వించాలి తప్ప హద్దులు దాటకూడదు. నాకు అందరితోనూ పరిచయం ఉండటం, కొందరితో చనువు ఉండటంతో ఎవరెవరు ఏయే విషయాలపై సెటైర్ వేస్తే, ఫీలవుతారో తెలుసు. ‘మీ గురించి ఇలా అనాలనుకుంటున్నాం’ అని చెప్పి, చేశాం. కానీ, ‘వెంకీ ఫోన్ నంబర్ ఇస్తారు?’ అని మేమంటే ‘ఏరా.. మీకైతే చాలా నంబర్లు ఉంటాయి.. నాకున్నది ఒక్క నంబరేరా’ అని వెంకటేశ్ గారు వేదికపై అనడం స్పాంటేనియస్‌గా వచ్చింది. ఇలా అప్పటికప్పుడు వచ్చినవీ ఉన్నాయి. ♦ మా మామయ్య (చిరంజీవి) ‘బాగా చేశావ్.. సరదాగా మాట్లాడావ్’ అని మెసేజ్ పెట్టారు. నాన్నగారు (అల్లు అరవింద్) కూడా అభినందించారు. రవితేజ అయితే, తన స్టైల్లో ‘బాగా చేశావ్ అబ్బాయి’ అన్నారు. చాలామంది దర్శక-నిర్మాతలూ ప్రశంసించారు. ♦ సినిమాల్లో ఏ పాత్ర చేస్తే, అందుకు తగ్గట్టుగానే నటించాలి. ఇక్కడ అలా కాదు.. ఎంతైనా రెచ్చిపోవచ్చు. వ్యాఖ్యాతగా చేయడం ద్వారా నాకు మంచి టైమింగ్ ఉన్న విషయం, నేను బాగా మిమిక్రీ చేయగలననే విషయం అందరికీ తెలిసింది. సో... ఈ వేడుక వల్ల నాకు సినిమా అవకాశాలు పెరుగుతాయనే ఫీలింగ్ చేసిన తర్వాత కలిగింది (నవ్వుతూ..). ♦ తెలుగు పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు సినిమా ప్రీమియర్స్ వేసి, అందర్నీ పిలిచేవాళ్లు. చిరంజీవిగారి సినిమాలకు మిగతావాళ్లు వచ్చేవాళ్లు. బాలకృష్ణగారి ‘నరసింహనాయుడు’ సినిమా వేసినప్పుడు మేం వెళ్లాం. అలా ఆ తరం వాళ్లు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. ఇప్పుడు మా జనరేషన్ అంతా కూల్‌గానే ఉంటున్నాం. ♦ నాకు తెలిసి మేం వేసిన పంచ్‌లు ఎవర్నీ హర్ట్ చేయలేదు. శ్రుతీహాసన్‌ని ‘ఫాదర్ స్టార్’ అనీ, ఫాదర్ వల్లే పైకి వచ్చిందనీ నవదీప్ అంటే, ‘ఏయ్.. అలా అంటావేంటి? తన టాలెంట్‌తో పైకొచ్చింది’ అంటాను. సో.. శ్రుతి హర్ట్ అవ్వలేదనే అనుకుంటున్నాను. నాతో తను బాగుంటుంది. బన్నీ (అల్లు అర్జున్)తో యాక్ట్ చేస్తోంది కాబట్టి, నన్ను చిన్నపిల్లాడు అనుకుంటుందేమో.. ‘స్వీటీ’ అని పిలుస్తుంటుంది. ♦ ఈ వేడుకలో లాగా రేపు నా మీద ఎవరైనా అలా వేసినా సరదాగా తీసుకుంటా. సరదాగా ఒకరి మీద ఒకరు వేసుకునే జోక్స్ అనుబంధాన్ని పెంచుతాయని నా నమ్మకం. ఓవరాల్‌గా ‘ఐఫా’ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. -
సందడే సందడి!
ఆది, సోమవారం... ఈ రెండు రోజులూ అంగరంగ వైభవంగా జరిగిన ‘ఐఫా- ఉత్సవం’ 2016 అవార్డు వేడుక హైదరాబాద్‌లో హాట్ టాపిక్ అయ్యింది. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించిన ఈ ఉత్సవంలో పలువురు తారలు పాల్గొని, వీక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగాలకు చెందిన తారలు ఒకే వేదికపై కనిపించడంతో పాటు స్నేహంగా మాట్లాడుకుని, కళకు భాషాభేదం లేదని మరోసారి నిరూపించారు. తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డు ప్రదానం సందర్భంగా మామూలుగానే సరదాగా ఉండే విక్టరీ వెంకటేశ్ హుషారుగా దేవిశ్రీప్రసాద్‌తో వేసిన స్టెప్స్ ప్రత్యేక సందడిని తీసుకొచ్చాయి. ప్రముఖ కన్నడ హీరో శివరాజ్‌కుమార్ చేసిన హై ఓల్టేజ్ డ్యాన్స్ భేష్ అనిపించింది. శరీరాకృతికి తగ్గట్లుగా పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో అందమైన శిల్పాన్ని తలపించారు శ్రుతీహాసన్. ఇంకా బోల్డన్ని ప్రత్యేకతలతో సాగిన రెండోరోజు వేడుకకు హీరోలు అల్లు శిరీష్, నవదీప్, హీరోయిన్ రెజీనా చేసిన యాంకరింగ్ ఓ హైలైట్.