ఎమర్జెన్సీకి ఆరెస్సెస్ మద్దతు!
ఐబీ మాజీ చీఫ్ టీవీ రాజేశ్వర్ వెల్లడి
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి ఆరెస్సెస్ మద్దతు తెలిపిందా? ఆనాడు ఇందిరను, ఆమె కుమారుడు సంజయ్ గాంధీని ఆరెస్సెస్ అప్పటి చీఫ్ బాలాసాహెబ్ దేవరస్ కలవాలనుకున్నారా? ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆరెస్సెస్ మద్దతిచ్చిందా?.. ఈ ప్రశ్నలన్నింటికి కచ్చితంగా అవునని సమాధానమిస్తున్నారు కేంద్ర నిఘా విభాగం (ఐబీ) మాజీ చీఫ్ టీవీ రాజేశ్వర్. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఐబీలో డిప్యూటీ చీఫ్గా ఉన్నారు. రిటైర్ అయిన తరువాత యూపీ, సిక్కింల గవర్నర్గా పనిచేశారు.
తాను రాసిన ‘ది క్రూషియల్ ఈయర్స్’ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై ఇండియా టీవీకి ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఎమర్జెన్సీ నాటి విశేషాలను పంచుకున్నారు. ‘ఎమెర్జెన్సీ విధించిన ఆర్నెళ్ల తరువాత దాన్ని ఎత్తేయాలని ఐబీ సూచిం చింది. అందుకు ఇందిర అనుకూలంగానే ఉన్నప్పటికీ.. సంజయ్ మాత్రం ససేమిరా అన్నారు.. దేవరస్ ఇందిరతో భేటీ కావాలనుకున్నారు. కానీ ఇందిర ఒప్పుకోలేదు. ఎమెర్జెన్సీలో తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలిపేందుకు ఆయన సంజయ్నీ కలుసుకోవాలనుకున్నారు’ అని రాజేశ్వర్ తెలిపారు.