breaking news
hyderbad cricket association
-
నందినికి నజరానా.. నగదు ప్రోత్సాహకంగా రూ. లక్ష
సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసార నందినికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ అరశనపల్లి జగన్మోహన్ రావు అండగా నిలిచారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ (ఉప్పల్ బ్రాంచ్)లో జరిగిన వార్షికోత్స వేడుకలో నందినిని జగన్మోహన్ రావు ఘనంగా సత్కరించారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఈనెల 8వ తేదీన తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి రూ.1 లక్ష చెక్‌ను నగదు ప్రోత్సాహకంగా ఆయన అందించారు.భవిష్యత్‌లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్మోహన్ రావు సూచించారు. నందిని 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం నందిని మాట్లాడుతూ... ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని కోరింది. అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నందిని పతకాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ ఎ.మదన్మోహన్ రావు, ఫైనాన్స్ డైరెక్టర్ రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరితా రావు, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరిన్ని క్రీడా వార్తలుశ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు నాలుగో విజయం సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో నాలుగో విజయం చేరింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో ఐజ్వాల్ ఎఫ్‌సీ జట్టుపై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున గుర్ముఖ్ సింగ్ (5వ నిమిషంలో), లాల్రొమావియా (24వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. నాలుగింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదింటిలో ఓడి 15 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనెల 6న హైదరాబాద్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. సుశ్రుత–శ్రీశాన్వి జోడీకి కాంస్య పతకం సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో సుశ్రుత అనియా ఆనంద్–శ్రీశాన్వి కామారపు (తెలంగాణ) జోడీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో సుశ్రుత–శ్రీశాన్వి ద్వయం 11–13, 6–11, 9–11తో దివ్యాంశి–నైషా (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. తెలంగాణ జట్టుకు ఎస్.ప్రణీత్, ఎం.చైతన్య కోచ్‌లుగా వ్యవహరించారు. -
HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984- 2000 వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. -
హైదరాబాద్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లేనట్టే
-
క్రికెట్ ‘డాక్టర్’ ఇక లేరు
మోముపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు... హోదాతో సంబంధం లేకుండా ఆత్మీయ పలకరింపు... ఒకవైపు క్రికెట్ పరిపాలనలో చురుకైన పాత్ర... మరోవైపు ఇంజనీరింగ్ విద్యాసంస్థల నిర్వహణ... ఎలాంటి బాధ్యతనైనా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు... క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే అలుపెరగని ఆల్‌రౌండర్... ఆయనే మాటూరి వెంకట (ఎంవీ) శ్రీధర్. హైదరాబాద్ రంజీ క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే జనరల్ మేనేజర్ (జీఎం) పదవిని అలంకరించారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణంతో గత నెలలో తన పదవికి రాజీనామా చేసే వరకు ఆయన తన కార్యదక్షతతో ఆ పదవికే వన్నె తెచ్చారంటే అతిశయోక్తి కాదు. సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్), హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మాటూరి వెంకట శ్రీధర్ సోమవారం కన్ను మూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 14, బీఎన్ రెడ్డి కాలనీలోని తన స్వగృహంలో మధ్యాహ్నం భోజనం చేశాక ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో శ్రీధర్ అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న స్టార్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. స్కానింగ్ చేస్తుండగానే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తరలించారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 51 ఏళ్ల శ్రీధర్‌కు భార్య సాగరిక, కొడుకు, కూతురు ఉన్నారు. ఆ ‘ట్రిపుల్’ సెంచరీ అద్భుతం... విజయవాడలో 1966 ఆగస్టు 2న జన్మించిన ఎంవీ శ్రీధర్ 1988లో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగారు. 2000 వరకు కొనసాగిన ఆయన కెరీర్లో మొత్తం 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. 150 ఇన్నింగ్స్‌లో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 6,701 పరుగులు సాధించారు. 1989లో మొహమ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో దులీప్ ట్రోఫీ టైటిల్ నెగ్గిన సౌత్‌జోన్ జట్టులో శ్రీధర్ సభ్యుడిగా ఉన్నారు. 1994 జనవరిలో ఆంధ్ర జట్టుతో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రీధర్ ‘ట్రిపుల్ సెంచరీ’తో తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. శ్రీధర్ ట్రిపుల్ సెంచరీతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 211 ఓవర్లలో 6 వికెట్లకు 944 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. రంజీ చరిత్రలో ఇప్పటికీ ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో శ్రీధర్ 699 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి 523 బంతులు ఆడి 37 ఫోర్లు, 5 సిక్సర్లతో 366 పరుగులు చేసి అవుటయ్యారు. రంజీ క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన శ్రీధర్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నపుడు జాతీయ జట్టులో కూడా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండటంతో ఆయనకు భారత జట్టులో ఆడే అవకాశం రాలేదు. ‘డాక్’గా సుపరిచితం... హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీధర్‌ను క్రికెట్ వర్గాల్లో ముద్దుగా ‘డాక్’ అని పిలుస్తారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పరిపాలన వ్యవహారాల్లో అడుగు పెట్టారు. 2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా... 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా.. 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ పదవికి వెంకటపతిరాజు రాజీనామా చేశాక 2010–2011 సీజన్లో కొంతకాలం ఆయన తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఎన్. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్రీధర్‌ను 2013లో బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ (జీఎం)గా నియమించారు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉన్న ఆయన గత నెలలో 27న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీధర్ భారత క్రికెట్ జట్ల మ్యాచ్ షెడ్యూల్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఐసీసీ సమావేశాల్లో బోర్డు ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. గత ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. ఈ ఏడాది జూన్‌లో కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా తర్వాత విండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజిలను నిర్వహిస్తున్న ఆయన కొంతకాలం హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రాలో హెచ్ఆర్–రిక్రూట్మెంట్, రిలేషన్స్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా కూడా పనిచేశారు. సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఎంవీ శ్రీధర్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలియజేశారు. క్రికెటర్‌గా, హెచ్‌సీఏ కార్యదర్శిగా శ్రీధర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, ఎంవీ నరసింహారావు, నోయల్ డేవిడ్, ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే, హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేక్, మాజీ కార్యదర్శి పీఆర్ మాన్సింగ్ తదితరులు శ్రీధర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘మంకీగేట్’ వివాదం సమయంలో... 2008లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టుకు ఎంవీ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్‌గా వ్యవహరించారు. సిడ్నీ టెస్టు సందర్భంగా భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంపై... హర్భజన్‌పై రిఫరీ మైక్ ప్రాక్టర్ మూడు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించారు. రిఫరీ నిర్ణయంపై అప్పీల్ చేసిన బీసీసీఐ హర్భజన్‌పై వేటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తమ పర్యటనను అర్ధంతరంగా ముగించి స్వదేశానికి తిరిగి వచ్చేస్తామని హెచ్చరించింది. విచారణ అనంతరం హర్భజన్‌పై జాతి వివక్ష అభియోగాలను అప్పీల్ కమిషనర్ జస్టిస్ జాన్ హాన్సెన్ కొట్టివేసి అతనిపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఈ వివాదం సమయంలో శ్రీధర్ ఆటగాళ్లకు, మీడియాకు, రెండు దేశాల బోర్డుల మధ్య చర్చలకు సంధానకర్తగా వ్యవహరించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ‘శ్రీధర్ చాలా మంచి మనిషి. ఆయనంటే నాకెంతో గౌరవం. అడిలైడ్‌లో ఈ కేసు తీర్పు వచ్చే సమయంలో నాతో కారులో శ్రీధర్ ఉన్నారు. నేను ఎలా మాట్లాడాలో ఆయన నాకు సూచనలు ఇచ్చారు. వివాదం మరింత ముదరకుండా అంతర్జాతీయ మీడియాతో ఆయన మాట్లాడిన తీరు అద్భుతం. శ్రీధర్ మృతితో నేనొక మంచి మిత్రుడిని కోల్పోయాను’ అని హర్భజన్ అన్నాడు. -
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్ నియమితులయ్యారు. శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సభ్యులంతా ఆయన నియామకానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. లోధా కమిటీ సిఫారసుల అమలులో భాగంగా ప్రస్తుతం అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ స్థానంలో నరేందర్ గౌడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.