
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంఛైజీ మధ్య వివాదంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావును బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం కేసులో కేసు నమోదైంది. ధరం గురువరెడ్డి ఫిర్యాదుతో 465, 468, 471, 403, 409, 420 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
ఇక విచారణలో భాగంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఉన్న గౌలిగూడ క్రికెట్ క్లబ్‌ను అడ్డుపెట్టుకుని జగన్‌మోహన్‌రావు మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ భార్య, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితతో కలిసి క్లబ్ డాక్యుమెంట్లను అతడు ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. ఈ మేరకు ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటితోనే జగన్‌మోహన్ రావు హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తేల్చింది.
అదే విధంగా.. హెచ్‌సీఏలో జగన్‌మెహన్ రావు భారీగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లుగానూ సీఐటీ గుర్తించింది. అసోసియేషన్ సభ్యులకు, జగన్‌మోహన్ రావుకు మధ్య భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా విచారణలో తేలింది.
అంతేకాదు.. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో బ్లాక్‌మెయిల్ చేయడం, కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంలో బెదిరింపులకు దిగడం నిజమేనని గుర్తించింది. కార్పొరేట్ బాక్సులను తమకు కేటాయించాలని.. లేదంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనివ్వబోమంటూ బ్లాక్‌మెయిల్ చేశారని తేలింది. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే జగన్‌మోహన్ రావు నేరపూరితంగా హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చాడని సీఐడీ గుర్తించింది.
కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో వివాదం నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణ నేపథ్యంలో హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది.
అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని జగన్‌మోహన్ రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఫ్రాంఛైజీ చెప్పినప్పటికీ.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని ఆయన బెదిరింపులకు దిగారు. లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని బ్లాక్‌మెయిల్ చేశారు.
ఇందుకు ఎస్‌ఆర్‌హెచ్ నిరాకరించగా.. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు జగన్‌మోహన్ రావు తాళాలు కూడా వేయించారు. ఈ నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ఎస్‌ఆర్‌హెచ్ ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి.. విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. అక్రమాలు వాస్తవమేనని తేలడంతో అరెస్టులు చేసింది.

ఈ విషయం గురించి సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా వివరాలు తెలియజేశారు. ‘‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.. SRH ఫ్రాంచైజీని బెదిరించి టికెట్స్ పొందాలని చూశారు.. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు’’ అని తెలిపారు.