breaking news
Housing loan market
-
అప్పు తీసుకునే వారేరీ?
• నోట్ల రద్దుతో తగ్గిన గృహ రుణ మార్కెట్ • కొన్నిచోట్ల మంజూరైన రుణాలూ వాపసు • తీసుకోవాలనుకునే వారిదీ వేచి చూసే ధోరణే • రియల్టీ ధరలు తగ్గుతాయేమోనని ఆశలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలు సహా పలు నగరాల్లో గృహ రుణ మార్కెట్ డీలా పడింది. బ్యాంకుల్లో జమ చేసిన నగదు పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం లేక... కొనుగోళ్లు, వినియోగం తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇంటి రుణాల కోసం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వైపు తొంగిచూసే వారు కరువయ్యారు. ఈ పరిస్థితి అటు బ్యాంకులను, ఇటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను కలవరపెడుతోంది. నోట్లకు కటకటతో... 90 శాతానికి పైగా నగదు లావాదేవీలపై ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత వాతావరణంలో రిటైల్ గృహ రుణాలు కావాలంటూ వచ్చే వారి సంఖ్యగణనీయంగా తగ్గిపోయిందని ఈ రంగానికి చెందిన ఫైనాన్స్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు, అసలు గృహ రుణం కావాలంటూ గత కొన్ని రోజుల్లో తమ కార్యాలయం తలుపు తట్టిన కస్టమర్ ఒక్కరూ లేరనిఆయన పేర్కొనడం పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇక ఇప్పటికే రుణానికి ఒప్పందం చేసుకుని కొనుగోళ్ల కోసం టోకెన్ పేమెంట్ తీసుకున్న వారు సైతం... తదుపరి విడత నిధుల కోసం తిరిగి రావడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మరికొందరైతే రుణం వద్దంటూ మంజూరైన వాటిని సైతం రద్దు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. చూద్దాంలే... ఇక ఇళ్లు కొనాలనే నిజమైన ఆసక్తితో ఉన్నవారు సైతం ‘చూద్దాం... రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయేమో’ అన్న ధోరణితో వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి ఒకరు తెలియజేశారు. ఉదాహరణకు... ముంబైలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు డీమోనిటైజేషన్ ప్రకటన రావడానికి ముందు వరకు ప్రతి నెలా సగటున 15–20 వరకు ఇంటి రుణం కోసం ప్రతిపాదనలు వచ్చేవి. డీమోనిటైజేషన్ తర్వాతగత నెల రోజుల్లో వచ్చిన ప్రతిపాదనలు రెండు మాత్రమే. వాస్తవానికి డీమోనిటైజేషన్ తర్వాత కొనుగోళ్లు పెరుగుతాయని కొందరు అంచనా వేశారు. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు మరింత మంది ముందుకొస్తారని,దాంతో మార్కెట్ మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమైంది. బ్యాంకుల్లోకి భారీగా వచ్చి పడుతున్న నగదు జమలతో రుణాల రేట్లు తగ్గుముఖం పట్టడం కూడా ఈ రంగానికి కలసి వస్తుందన్న అంచనాలు వ్యక్తమయ్యా యి. కానీ, ఇప్పటి వరకు ఆ పరిస్థితులేవీ కనిపించడం లేదు. ఆరు నెలలు ఆగాల్సిందే... డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న ప్రకటించగా.. ఇప్పటికే ఓ నెల పూర్తయింది. అయినప్పటికీ గృహ రుణ మార్కెట్ పుంజుకోలేదని ఓ రియల్టీ సంస్థ ప్రతినిధి చెప్పారు. రుణాల కోసం కస్టమర్లుతిరిగి డిమాండ్ చేయడానికి, తాము కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, మొత్తం మీద సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం ఆరు నెలలైనా పడుతుందన్నది ఆయన అభిప్రాయం. వ్యాపారంపై ప్రభావం.. ఒకవైపు కార్పొరేట్ రుణాల డిమాండ్ తగ్గడంతో బ్యాంకులు గత ఏడాదిగా తమ రుణ పోర్ట్‌ఫోలియోని పెంచుకునేందుకు గృహ రుణాలపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు డీమోనిటైజేషన్ ఫలితంగా గృహ రుణ మార్కెట్పడిపోవడం వాటి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. గత మూడు, నాలుగేళ్లుగా గృహ రుణాల వృద్ధి 20 శాతం పెరుగుతూ వస్తోంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లు కొనుగోలు దారులు తమ నిర్ణయాలనువాయిదా వేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాల్లో గృహ రుణ మార్కెట్ వ్యాపారం ఏమంత ఉండకపోవచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. -
ఎనిమిదేళ్లలో నాలుగింతలకు హౌసింగ్ మార్కెట్: ఎడల్‌వైస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత గృహరుణ మార్కెట్లో లగ్జరీ కంటే చిన్న స్థాయి ఇళ్లకే డిమాండ్ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా రూ. 15 లక్షలలోపు రుణాలకు మంచి గిరాకీ ఉందని ఆర్థిక సేవల సంస్థ ఎడల్‌వైస్ పేర్కొంది. వచ్చే ఎనిమిదేళ్లలో దేశీయ హౌసింగ్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగుతుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నట్లు ఎడల్‌వైస్ రిటైల్ ఫైనాన్స్ ప్రెసిడెంట్ అనిల్ కొత్తూరి తెలిపారు. ప్రస్తుతం దేశీయ గృహరుణ మార్కెట్ విలువ రూ. 2.40 లక్షల కోట్లుగా ఉందని, అది వచ్చే ఏడాది రూ. 3 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఎడల్‌వైస్ రెండో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం వల్ల ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోందన్నారు. దీనికితోడు ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం కూడా గృహరుణ మార్కెట్ వృద్ధికి ఉపకరిస్తోందన్నారు.