breaking news
hostels problems
-
పిల్లలకు తాగునీరు ఎప్పుడిస్తారు?
సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు ఎప్పటిలోగా తాగు నీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 453 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం ఖండించడం లేదని ప్రస్తావించింది. హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? అందుకు సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదని ఆక్షేపించింది. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా సాధారణంగా ఉందని ధర్మాసనం తప్పుబట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా హాస్టళ్లు ఉన్నందున ప్రతి చోటా తాము స్వయంగా పరిశీలించడం సాధ్యం కాదని, అందువల్ల, తాలూకా/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మౌలిక సదుపాయాలను క్రమం తప్పకుండా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కాల పరిమితితో సమగ్ర ప్రణాళికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులే లేవు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం హాస్టల్లో 86 మంది విద్యార్థులు కామెర్లకు గురికావడం, విద్యార్థి మరణించడం, 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఘటనపై సీజే ధర్మాసనం విజయనగరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిని విచారణకు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆ హాస్టల్‌ను తనిఖీ చేసి నివేదికను హైకోర్టుకు సమరి్పంచారు. బావి నుంచి నేరుగా ట్యాంక్‌లోకి పంపిన నీటినే విద్యార్థులు తాగుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు.611 మంది విద్యార్థులు ఉంటే కేవలం 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తరువాతే నిరి్మంచారని కార్యదర్శి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 11 మరుగుదొడ్లకు, 2 సాన్నపు గదులకు అసలు తలుపులే లేవని నివేదించారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ ఆ హాస్టల్లో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. ప్రణతి నివేదించిన వివరాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు ఎక్కడ? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకు, కాగితాలకే పరిమితం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46 అమలు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులు హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు, విద్య నాణ్యతను పెంపొందించటానికి ఉద్దేశించినవని గుర్తు చేసింది.హాస్టళ్లలో పిల్లలకు శుభ్రమైన తాగునీరు ఎప్పటిలోపు అందిస్తారో కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆక్షేపించింది. 320 కొత్త ఆర్వో వాటర్ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అవి ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల సంఖ్యకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కమిటీ పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని తేల్చి చెప్పింది. సంక్షేమ శాఖల అధికారులకు ఈ కమిటీలో స్థానం కల్పించాలని సూచించింది. నెలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించాలని పేర్కొంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హాస్టళ్లలో ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పనకు పిల్ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది.2025లో హైకోర్టు అడిగినా సీఎస్ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదు హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆహారం, వ్రస్తాలు, ఆశ్రయం ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని 2025 జూలైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినా ఇంతవరకు తమకు సమరి్పంచలేదని ధర్మాసనం తెలిపింది. హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు్ల క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించకపోవడం, ఆ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం జరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. నెలకొకసారి తనిఖీలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సమస్యను అధిగమించేందుకు పరిష్కార చర్యలు చేపట్టకుంటే ఎన్ని తనిఖీలు చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. -
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పీడీఎస్‌యూ నాయకులు ఆర్ట్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నేత శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని, సరైన మెను ఇవ్వడం లేదన్నారు. పాలిష్ చేసిన దొడ్డు బియ్యాన్ని హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారని అన్నారు. ప్రతి హాస్టల్‌కు ఏఎన్ఎంను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి మెస్ చార్జీల కింద నెలకు రూ.2,500 కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు నరసింహారావు, పైండ్ల యాకయ్య, దుర్గం సారయ్య, రవీందర్, నరేష్, తిరుపతి, వేణు తదితరులు పాల్గొన్నారు.


