breaking news
historic visit
-
అరబ్ దేశంలో పోప్ ఫ్రాన్సిస్ చారిత్రక పర్యటన
ఉర్: కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(84) అరబ్ దేశం ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్నారు. శనివారం ఆయన ఇరాక్‌లోని పవిత్ర నగరం నజాఫ్‌లో షియాల గ్రాండ్ అయతొల్లా అలీ అల్– సిస్తానీ(90)తో భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో ఇరువురు మతపెద్దలు శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరారు. ఇరాక్‌లోని క్రైస్తవులను కాపాడుకోవడంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని, ఇతర ఇరాకీయుల మాదిరిగానే వారు కూడా సమానహక్కులతో స్వేచ్ఛగా జీవించాలని గ్రాండ్ అయతొల్లా అలీ అల్– సిస్తానీ ఆకాంక్షించారు. తన వద్దకు వచ్చేందుకు శ్రమ తీసుకున్న పోప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత బలహీనవర్గాలు, తీవ్ర వేధింపులకు గురయ్యే వారి పక్షాన గళం వినిపించినందుకు పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని వాటికన్ పేర్కొంది. ఇరాక్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవించే మత పెద్దల్లో అల్ సిస్తానీ ఒకరు. అల్ సిస్తానీ నివాసంలో జరిగిన ఈ భేటీకి కొన్ని నెలల ముందు నుంచే అయతొల్లా కార్యాలయం, వాటికన్ అధికారుల మధ్య తీవ్ర కసరత్తు జరిగినట్లు సమాచారం. గ్రాండ్ అయతొల్లా భేటీతో ఇరాక్‌లోని షియా సాయుధ ముఠాల వేధింపుల నుంచి క్రైస్తవులకు భద్రత చేకూర్చడం, క్రైస్తవుల వలసలను నిరోధించడమే పోప్ ఫ్రాన్సిస్ పర్యటన ఉద్దేశంగా భావిస్తున్నారు. 40 నిమిషాల సేపు చర్చలు పోప్ ఫ్రాన్సిస్ శనివారం బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారులో నజాఫ్‌కు బయలుదేరి వెళ్లారు. షియాలు అత్యంత పవిత్రంగా భావించే ఇమామ్ అలీ సమాధి ఉన్న రసూల్ వీధిలోని అల్ సిస్తానీ నివాసానికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ, ఆయనకు సంప్రదాయ దుస్తులు ధరించిన కొందరు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోప్ శాంతి చిహ్నంగా పావురాలను గాలిలోకి వదిలారు. పోప్ తన షూస్ వదిలేసి అల్ సిస్తానీ ఉన్న గదిలోకి ప్రవేశించారు. సందర్శకుల రాక సమయంలో సాధారణంగా తన సీట్లో కూర్చుని ఉండే అల్ సిస్తానీ లేచి నిలబడి, పోప్ ఫ్రాన్సిస్‌ను తన గదిలోకి ఆహ్వానించారనీ, ఇది అరుదైన గౌరవమని చెప్పారు. మాస్కులు ధరించకుండానే ఇరువురు పెద్దలు దగ్గరగా కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. వారి భేటీ సుహృద్భావ వాతావరణంలో 40నిమిషాల పాటు సాగిందని నజాఫ్‌కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అల్ సిస్తానీయే ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. ఫ్రాన్సిస్‌కు టీ, బాటిల్ నీళ్లు అందజేయగా, ఆయన నీరు మాత్రమే తాగారని చెప్పారు. అయితే, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పోప్.. శుక్రవారం బాగ్దాద్‌లో పలువురితో సమావేశం కావడం, అల్ సిస్తానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమైందని కూడా ఆయన అన్నారు. అనంతరం ఆయన పురాతన ఉర్ నగరంలో సర్వమత సమ్మేళానికి వెళ్లారు. అక్కడ, మత పెద్దలంతా గౌరవపూర్వకంగా లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మాస్కు ధరించి పోప్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరాక్‌లోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు శతాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరిచి శాంతి, ఐక్యతల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా భావించే అబ్రహాం జన్మించింది ఉర్లోనే కావడం విశేషం. శుక్రవారం ఇరాక్ చేరుకున్న పోప్ ఫ్రాన్సిస్ మొదటి రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక పోప్ చేపట్టిన మొదటి పర్యటన ఇదే. గ్రాండ్ అయతొల్లాతో భేటీ అయిన మొదటి పోప్ కూడా ఆయనే. పోప్ రాక సందర్భంగా నజాఫ్‌లో 25 వేల మంది బలగాలు భారీ బందోబస్తు చేపట్టాయి. -
దూరం 90 మైళ్లు.. వెళ్లడానికి 88 ఏళ్లు!
అట్లాంటిక్ మహాసముద్రంలోకి చొచ్చుకుపోయినట్లుండే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా, క్యూబాల మధ్య దూరం 90 మైళ్లు. ఐదున్నర దశాబ్ధాలపాటు ఉప్పూ-నిప్పులా ఉన్న ఆ రెండు దేశాలు వైరం వీడి శాంతిబాటపట్టిన నేపథ్యంలో 88 ఏళ్ల తర్వాత ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలు పునరుద్ధరించుకున్నప్పటికీ దేశాధినేతల పర్యటన వెలితి అతి త్వరలో పూడనుంది. ఆ వెలితి పూడ్చబోయేది.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. సతీమణి మిషెల్లితోకలిసి ఒబామా మార్చి 21,22తేదీల్లో క్యూబాలో పర్యటిస్తారని శుక్రవారం వైట్ హౌస్ వర్గాలు తేల్చిచెప్పాయి. ఒక అమెరికా అధ్యక్షుడు చివరిసారిగా క్యూబా వెళ్లింది 1928లో. నాటి ప్రెసిడెంట్ కెల్విన్ కూలిడ్జ్ పర్యటన తర్వాత ఆ దేశాల సంబంధాలు అంతకంతకూ దిగజారాయి. ఇరాక్, అఫ్టానిస్థాన్ ల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించడం, ఇరాన్ తో శాంతి ఒప్పందం తదితర చర్యలతో శాంతి కాముకుడిగా పేరుపొందిన ఒబామా 88 ఏళ్ల తర్వాత క్యూబాలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు కావటం ఆయనపొందిన నోబెల్ శాంతి పురస్కారానికి మరింత గౌరవాన్ని ఆపాదించినట్లవుతదని కొందరిభావన. 'ఇరుదేశాల మధ్య శాంతి, సుహృద్భావం పెంపొందించేందుకు క్యూబాకు వెళతానని 14 నెలల కిందటే చెప్పా. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత 'క్యాస్ట్రో' గడ్డలోని దౌత్యకార్యాలయంపై అమెరికా జెండా రెపరెపలాడటాన్ని చూడాలని నా మనసు ఉవ్విళూరుతోంది' అని ఒబామా గురువారం ట్విట్టర్ లో స్పందించారు. శాంతి చర్చల ప్రక్రియ మొదలైనప్పటినుంచి క్యూబాకు అమెరికా టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న ఒబామా.. ఇప్పటికీ పలు అంశాల్లో తీవ్రమైన విబేధాలున్నాయని, తన పర్యటనలో వాటిని ప్రస్తావిస్తానని, అయితే రెండు దేశాలు కలిసికట్టుగా సాగటం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తన పర్యటన తప్పక క్యూబా అభ్యున్నతికి తోడ్పడుతుందని, తద్వారా హవానా ప్రజల జీవనప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఒబామా పేర్కొన్నారు. రావుల్ క్యాస్ట్రో సహా పలువురు మంత్రులు, క్యూబన్ వాణిజ్యవేత్తలతో ఒబామా చర్చలు జరుపుతారు. అనంతరం అటునుంచే అర్జెంటీనా బయలుదేరి వెళతారు.