breaking news
Himalaya region
-
బద్దలయ్యేందుకు సిద్ధంగా 42 హిమానీ సరస్సులు
కాఠ్మండు: నేపాల్‌లో అత్యంత ఎత్తయిన పర్వతాల మధ్య ఏర్పడిన హిమానీ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) ఇప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలపై యమపాశాలుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వార్త స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. నేపాల్‌లోని శంఖువసభ జిల్లా కేంద్రమైన ఖంద్బారీ పట్టణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సమీకృత పర్వతాభివృద్ధి కేంద్రం(ఐసీఐఎంఓడీ) చర్చా కార్యక్రమంలో విషయ నిపుణుడు శరద్ ప్రసాద్ జోషి ఈ వివరాలను వెల్లడించారు. హిమానీనదం(గ్లేసియర్) నుంచి ప్రవహించే నీటి కారణంగా పర్వత సానువుల వద్ద ఏర్పడే సరస్సును గ్లేసియర్ లేక్ అంటారు. ‘‘ఇలాంటి 42 సరస్సులు భారీ స్థాయిలో నీటితో నిండుకుండలా మారాయి. ఇవి ఏ క్షణంలోనైనా బద్దలై దిగువకు పెద్దమొత్తంలో నీరు దూసుకురానుంది. దిగువ ప్రాంతాల ప్రజల ఇల్లు, వ్యాపారాలు, పంటలు నాశనమవడం ఖాయం. నేపాల్‌లో 2,069 హిమానీ సరస్సులుండగా ఇప్పుడు కోషి ప్రావిన్స్‌లోని 42 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి’’ అని జోషి హెచ్చరించారు. శంఖువసభ జిల్లా పరిధిలో భోత్ఖోలా, మకాలూ ప్రాంతంలోని సరస్సులు సహా నాలుగు గ్లేసియర్ సరస్సుల్లో నీరు భారీగా చేరిందని ఆయన వెల్లడించారు. మూడు కిలోమీటర్ల పొడవు, 206 మీటర్ల లోతైన తల్లోపోఖారీ సరస్సు అత్యంత ప్రమాదకారిగా మారిందని చెప్పారు. ఐసీఐఎంఓడీ, హైడ్రోలజీ, మీటియోరాలజీ, ఐరాస అభివృద్ధికార్యక్రమం నేపాల్ సంస్థలు కలిసి ఈ ప్రమాదం నుంచి స్థానికులను, వారి ఆస్తులను పరిరక్షించేందుకు సహాయక చర్యలపై దృష్టిసారించాయి. అరుణ్ లోయలో పలు నివాసాలు, మౌలికవసతుల వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని మరో నిపుణురాలు నీరా శ్రేష్ఠ ప్రధాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభావిత ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేయనుందని ఆమె తెలిపారు. -
'హిమాలయాల్లో భూకంపం వస్తే...'
ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి హెచ్చరించారు. హిమాలయ పర్వశ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గత 53 సంవత్సరాల్లో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు సూచనలు అందుతున్నాయని శశిధర్ రెడ్డి తెలిపారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. 1950 నుంచి అలాంటి ప్రమాదాన్ని ఇప్పటి వరకు ఎదుర్కోలేదన్నారు. అయితే హియాలయ పర్వత ప్రాంతాల్లో అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించి ఉన్నట్టయితే భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండిలో భూకంపం సంభవిస్తే చండిఘర్ లో 20 వేల మంది ప్రాణలకు ముప్పు ఏర్పడుతుందని శశిధర్ రెడ్డి హెచ్చరించారు.


