breaking news
heritage curd
-
హెరిటేజ్ పెరుగులో నాణ్యతా లోపం
విజయనగరం మున్సిపాలిటీ : పాలు, పెరుగు విక్రయించే హెరిటేజ్ సంస్థకు చెందిన ఉత్పత్తుల్లో నాణ్యతా లోపం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ తయారుచేసి డీలర్ల ద్వారా విక్రయిస్తున్న పాలు, పెరుగులో నాణ్యత లేకపోవడంతో కొనుగోలు చేసిన వినియోగదారులు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఆదివారం స్థానిక కాటవీధికి చెందిన శ్యామలరావు స్థానిక పాన్‌షాప్ వద్ద రూ.10 విలువ చేసే హెరిటేజ్ సంస్థకు చెందిన పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి విప్పి చూడగా అందులో నాచులాంటి పదార్ధం దర్శనమిచ్చింది. దీంతో కొనుగోలుదారు శ్యామ్ తిరిగి దుకాణదారుడి వద్దకు వెళ్లినా తమకు సంబంధం లేదంటూ సమాధానమివ్వడంతో అవాక్కయ్యాడు. ఆహారకల్తీ నిరోధక అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి నాణ్యతా లోపం కలిగిన ఆహార పదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. -
హెరిటేజ్ పెరుగా.. ఫెవికాల్ గమ్మా?
► తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో కలకలం ► హెరిటేజ్ పాలు తాగిన బాలుడికి అస్వస్థత శంఖవరం (పత్తిపాడు): తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో హెరిటేజ్ పాలు తాగిన ఏడాది బాలుడు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన వైనం కలకలం రేపింది. ఆ బాలుని తండ్రి ‘‘ఇవి పాలా, పెరుగా? హెరిటేజ్ గమ్మా?’’ అంటూ ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు షేక్ గౌస్ శనివారం విలేకర్లకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక హెరిటేజ్ ప్లాంట్‌లో శుక్రవారం రాత్రి గౌస్ రెండు పాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఒక ప్యాకెట్ పాలను ఆయన భార్య పెరుగుగా వాడుకునేందుకు తోడు పెట్టారు. మరో ప్యాకెట్ పాలను ఉదయం వారి కుమారుడు రెహెన్(1)కు ఇచ్చేందుకు ఫ్రిజ్‌లో పెట్టారు. ఉదయాన్నే పాలు కాచి పట్టించగా, రెహెన్‌కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం రెహెన్ ఆస్పత్రిలో కోలుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి గౌస్ భోజనం చేస్తుండగా పెరుగు వేసుకుందామని గిన్నెలో గరిటె పెడితే బయటకు రాలేదు. గమ్‌లా పెరుగు గరిటెను పట్టుకుని వదల్లేదని గౌస్ వివరించారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన హెరిటేజ్ ప్లాంట్‌కు వెళ్లి అమ్మకందారును నిలదీశారు. ఆయన మార్కెటింగ్ మేనేజర్ ఫోన్ నంబరు ఇవ్వడంతో ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్.బాబి శనివారం సాయంత్రం వచ్చి ఆ పెరుగును పరిశీలించారని గౌస్ చెప్పారు. ఆయనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తోడు పెట్టిన పెరుగును, ప్యాకెట్లను పరిశీలనకు పంపుతానని చెప్పి వెళ్లారని వివరించారు.