breaking news
Heavy reforms
-
బడ్జెట్‌పైనే మార్కెట్ దృష్టి
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ సర్కార్.. కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న (శుక్రవారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. ఈ ప్రధాన అంశమే మార్కెట్ వర్గాలకు ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, కంపెనీల ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నందున బడ్జెట్లో ఈసారి ద్రవ్య లభ్యత పెంపు, భారీ సంస్కరణల సూచనలు ఉండేందుకు ఆస్కారం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లో నెమ్మదించిన డిమాండ్ మళ్లీ ఊపందుకునేలా చూడడం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ బడ్జెట్లో ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన.. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, ఇంధన, విద్యుత్, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలకు ఊతమిచ్చే నిర్ణయాలు వెల్లడైతే మాత్రం మార్కెట్‌కు నూతన ఉత్సాహం వస్తుంది. గతంలో కూడా.. మూలధన వ్యయంపై ప్రకటనలు, విధాన సంస్కరణలే సూచీల దిశానిర్దేశం చేశాయి’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మ¯Œ డీకే అగర్వాల్ అన్నారు. నిరాశపరిస్తే నేలచూపులే.. ఈవారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్.. భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంచేయనుంది. భారీ అంచనాలు ఉన్న కారణంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ విశ్లేషించారు. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణిలోనే ఉండడం ఉత్తమం అని సూచించారు. మార్కెట్ ప్రస్తుత గమనం చూస్తుంటే తుపానుకు ముందు ప్రశాంతతలా ఉందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోతే అమ్మకాల ఒత్తిడి భారీస్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆటోరంగంలో ఉంటే భారీ పతనం కానీ.. లేదంటే.. కోలుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. ఆటో, మెటల్ రంగాలు ఈవారం ఫోకస్లో ఉండనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఈవారంలో బడ్జెట్, 2018–19 ఆర్థిక సంవత్సర ఎకనామిక్ సర్వే (జూలై 4న) ఉన్న కారణంగా.. ప్రస్తుతం కన్సాలిడేషన్ లో ఉన్న మార్కెట్ ఈ ప్రధాన అంశాలు పూర్తయిన తరువాత బలమైన ర్యాలీ నమోదుచేయవచ్చని భావిస్తున్నట్లు ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. అంతర్జాతీయ పరిణామాలు ఆశాజనకం.. మార్కెట్ వర్గాలను ఇరకాటంలో పడేసిన వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా ఆగింది. అమెరికా–చైనాల మధ్య ట్రేడ్వార్కు ప్రస్తుతానికి తెరపడింది. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు అంగీకరించారు. జపాన్ లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సు సందర్భంగా శనివారం సమావేశమైన ఇరువురు నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ , ట్రంప్‌ల మధ్య ఆదివారం చరిత్రాత్మక భేటీ జరగడం కూడా మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. ఈ తాజా అంశాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ జూన్ నెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వస్తుంది. మౌలికరంగ డేటా శుక్రవారం మార్కెట్ ముగిశాక వెల్లడికానుండగా.. జూలై ఒకటి నుంచి గతనెల ఆటో రంగ అమ్మకాల సమాచారం వెల్లడికానుంది. మరోవైపు అంతర్జాతీయ అంశాల్లో.. ఈవారంలోనే అమెరికా, చైనా దేశాల తయారీ రంగ సమాచారం వెల్లడికానుంది. రూ.10,384 కోట్ల విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాల కారణంగా వీరు వరుసగా ఐదో నెల్లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. జూన్‌లో ఈక్విటీ మార్కెట్లో రూ.2,273 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.8,112 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా గత నెలలో రూ.10,384 కోట్లను పెట్టుబడిపెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.87,313 కోట్లను వీరు పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
పరుగు ఇక 3 కిలోమీటర్లే!
పోలీసు నియామకాల్లో సంస్కరణల దిశగా ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో భారీ సంస్కరణలు రాబోతున్నాయి. దేహదారుఢ్య పరీక్షల సరళీకృతం.. సివిల్స్, పబ్లిక్ సర్వీసు కమిషన్ తరహాలో ప్రిలిమ్స్, మెయిన్ రాత పరీక్షలు.. అభ్యర్థుల మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో పరిశీలన... రాష్ట్ర పోలీసుల నియామకాల్లో రాబోతున్న భారీ మార్పులివి. పోలీసు నియామకాల్లో సంస్కరణలపై డీజీపీ అనురాగ్ శర్మ పంపిన ఈ ప్రతిపాదనలను... రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.. ⇒ ఇటీవలి కాలంతో వివాదాస్పదమైన ‘ఐదు కిలోమీటర్ల పరుగు (5 కేఎం రన్)’ను ఉపసంహరించుకోనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో ఐదు కిలోమీటర్ల పరుగును నిర్వహించేవారు. పోస్టులు తక్కువగా ఉండడం, వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడడంతో అభ్యర్థుల వడపోత కోసం గత ప్రభుత్వాలు ఈ కఠిన పరీక్ష పెట్టేవి. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఈ పరుగు పరీక్షలో పాల్గొని కొందరు అక్కడికక్కడే ప్రాణాలు విడవడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురికావడం జరిగింది. దీంతో 5 కిమీ పరుగును మూడు కిలోమీటర్లకు కుదించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ⇒ అభ్యర్థుల వడపోత కోసం ఇక నుంచి ముందుగానే సివిల్స్, గ్రూప్స్ పరీక్షల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. తొలుత అభ్యర్థులకు బహుళ ఐచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో నెగ్గిన అభ్యర్థులకు మళ్లీ వ్యాస రూప(సబ్జెక్టివ్) పరీక్ష (మెయిన్స్) నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యను బట్టిన మెయిన్స్‌లో నెగ్గిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేహదారుఢ్య పరీక్షల్లో పరుగు తగ్గింపు మినహా ఇతర ఏ మార్పులూ ఉండవు. ⇒ పోలీసు ఉద్యోగం మానసిక ఒత్తిడితో కూడినది. సెలవులు, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మానసిక స్థితి బలంగా లేనివారు తీవ్ర ఒత్తిడికిలోనై సంయమనాన్ని కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంటుంది. ప్రధానంగా టీఎస్ఎస్పీ, ఏఆర్ విభాగాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది విధి నిర్వహణలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతరులపై కాల్పులు జరపడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగంలో చేరకముందే అభ్యర్థుల్లోని మానసిక బలం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై మానసిక నిపుణులతో పరీక్షలు జరిపించి పరిశీలించనున్నారు. దేహదారుఢ్య పరీక్షల తర్వాత అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహిస్తారు.