breaking news
hari hara kala bhavan
-
రేపే జాబ్‌మేళా.. వెంటనే నియామకాలు!
కంటోన్మెంట్: హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఫార్మా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో అర్హులైన వారికి ఉద్యోగులు కల్పించేందుకు మంగళవారం సికింద్రాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగే ఈ కార్యక్రమాన్ని మెప్మా పీడీ, జలమండలి ఎండీ దానకిశోర్ ప్రారంభించనున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, టెక్నికల్, నాన్‌టెక్నికల్, ఫార్మా, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో మొత్తం 27 విభాగాల ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు మెప్మా కంటోన్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. కేటగిరీలవారీగా అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు రావాల్సిందిగా సూచించారు. ఈ మేళాలో సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలను అక్కడికక్కడే నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతారని పేర్కొన్నారు. -
కోలాహలంగా ఎస్ఎస్కే సమాజ్ స్వర్ణోత్సవాలు
రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్ సికింద్రాబాద్ శాఖ స్వర్ణోత్సవాలు ఆదివారం హరిహరకళాభవన్‌లో కోలాహలంగా నిర్వహించారు. వందల మంది సమాజ్‌కు చెందిన మహిళలు, పురుషులు, పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ఆటాపాటలతో, డ్యాన్సులతో అలరించారు. రాంగోపాల్‌పేట్‌లోని సమాజ్ కార్యాలయం నుంచి వందలాది మంది మహిళలు హారతులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎంజీరోడ్, సుభాష్‌రోడ్, ఆర్పీరోడ్, బాటా గుండా హరిహరకళాభవన్ వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే అర్జునుడి చిత్రపటాన్ని రథంలో ఉంచి కోలాహలంగా ఊరేగింపు చేశారు. అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, బహుమతులు అందించారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే పీ శంకర్రావులు హాజరై ఎస్కేఎస్ సమాజ్‌కు అండగా ఉంటామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ వీరిని బీసీ డీ నుంచి ఏ కులంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల నిధులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సనత్‌నగర్ కో ఆర్డినేటర్ శీలం ప్రభాకర్, కార్పొరేటర్లు కిరణ్మయి, ముద్దం నరసింహాయాదవ్, సమాజ్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ప్రతినిధులు పాల్గొన్నారు.