breaking news
Green hotels
-
ప్రైవేటుకు ‘హరితా’ర్పణం
సాక్షి, విశాఖపట్నం: సంపద సృష్టి అంటూ.. ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తోంది కూటమి సర్కారు. పర్యాటక శాఖకు ఆదాయం తెచ్చి పెట్టే ఆస్తులేవైనా ఉన్నాయంటే అవి కేవలం హరిత హోటళ్లు మాత్రమే. రాష్ట్రంలో ఏపీటీడీసీకి ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు ఉన్నాయి. వీటిల్లో 30 హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి టూరిజం శాఖను నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు పన్నుతోంది. విజయవాడలో సమావేశం హరిత హోటళ్లను ప్రైవేటు పరంచే సేందుకు ఈ నెల 23న కొంత మంది స్టేక్ హోల్డర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానమందించింది. విజయవాడ బెరంపార్క్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెవరు వస్తారో ఆన్లైన్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించింది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారినే ఈ సమావేశానికి అనుమతిచ్చింది. సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ హరిత హోటళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏయే హోటల్‌కు ఎంత ఆదాయం వస్తుంటుంది.. ఎక్కడెక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి.. మొదలైన అంశాల గురించి ఏపీటీడీసీ అధికారులు స్టేక్ హోల్డర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో హరిత హోటళ్లను ప్రైవేట్ పరం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారుప్రధాన పర్యాటక ప్రాంతాలూ ప్రైవేటుకేనా? పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటళ్లని తొలి విడతలో ప్రైవేట్‌కు అప్పగించే పని వేగవంతం చేస్తున్న సర్కారు తర్వాత టూరిజంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏయే ప్రాంతాల్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టాలనే దానిపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. వాటి ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను ప్రభుత్వం ఉన్నపళంగా అడిగి తెప్పించుకుంది. వీటిలో ఎంపిక చేసిన వాటిని నెల రోజుల వ్యవధిలోనే ప్రైవేట్‌కు అప్పగించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇలా ఆదాయాన్ని తెచ్చే హరిత హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్ని మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తే.. ఏపీటీడీసీ, ఏపీ టూరిజం అథారిటీకి ఆదాయం ఎలా వస్తుందంటూ జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. వీలైనంత త్వరగా.. తాము చెప్పిన సంస్థలకు పర్యాటక ఆస్తుల్ని కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే.. టూరిజం శాఖకు రాష్ట్రంలో ఒక్క హోటల్ కూడా లేకుండా పోతుంది. ఇన్నాళ్లూ తక్కువ ఖర్చుతో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ప్రజలపైనా భారం భారీగానే పడనుంది. ఉపాధికి గండి పర్యాటక శాఖకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టులో 50 నుంచి 60 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, 40 శాతం అవుట్ సోర్సింగ్, 10 శాతం మంది రెగ్యులర్ ఉద్యోగులుంటారు. ఒక వేళ 30 హోటళ్లని ప్రైవేట్‌కు కట్టబెడితే.. దాదాపు 1000 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసి కూడా కేవలం కాసులకు ఆశపడి.. ఉపాధిపొందుతున్న వారి కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం వెనకాడటం లేదు. -
కంప్యూటరీకరణపై కాలయాపన
- రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం - ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు - పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం సాక్షి, హైదరాబాద్: భారీ ధరలకు కొన్న పడవలను మరమ్మతుల పేరుతో వృథాగా పడేయటం.. రూ.కోట్లు వెచ్చించి నాసికరం పనులతో సౌండ్ అండ్ లైట్ షోలు పడకేసేలా చేయటం.. అడ్డగోలు బిల్లులతో హరిత హోటళ్లలో నిధులు దారి మళ్లించటం.. ఇలా పర్యాటక అభివృద్ధి సంస్థలో అధికారులది ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించి నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించటం ద్వారా కొంతవరకు పరిస్థితిని అదులోపులోకి తెచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కౌంటర్లను కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ మురగబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల పేరుతో కాలయాపన పర్యాటకుల టూర్ బుకింగ్స్, వివిధ ప్రాం తాల్లో సౌండ్ అండ్ లైట్ షో టికెట్ల విక్రయం, హోటళ్ల లెక్కలకు సంబంధించిన కీలక విషయాల్లో కంప్యూటరీకరణ సరిగా లేదు. దీంతో కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం 2015లో రూ.రెండున్నర కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో సంబంధిత పనులు చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్.. టెండర్ల పేరుతో కాలయాపన చేసింది. ఓసారి టెండర్లు పిలవగా, కేవలం ఒకే బిడ్ దాఖలైందన్న కారణంతో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత అదే తరహాలో మరోసారి రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలిచి.. పనులు మొదలుపెట్టినా కొలిక్కి తేలేక పోయారు. ఇలా రెండేళ్లపాటు ఆ నిధులను కంప్యూటరీకరణ కోసం ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో నిధులను అసలు లక్ష్యం కోసం ఖర్చు చేయలేదని గుర్తించిన ఆడిట్ విభాగం.. కార్పొరేషన్ వివరణ కోరింది. ఖాళీ బిల్లులతో నిధుల దారి మళ్లింపు రాష్ట్రవ్యాప్తంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేస్తున్నా చాలా చోట్ల పర్యవేక్షణ సరిగా లేక నిధులు దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ బిల్లులను దగ్గర పెట్టుకుని వాటితో నిధులు దారి మళ్లిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల స్వయంగా పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్‌లోని ప్లాజా హోటల్లో అక్రమాల నిగ్గు తేల్చారు. హుసేన్సాగర్ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల వద్ద బోటింగ్ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ప్లాజా హోటల్, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకు కరెంటు ఖాతాలోనే ఉంచటం వల్ల పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ కోల్పోయింది. వేరే పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.లక్షల్లో అదనంగా ఆదాయం సమకూరేదన్న విషయం ఇటీవల ఆడిట్ పరిశీలనతో తేలింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ రెస్టారెంట్ నిర్వహణకు టెండర్లు పిలిచినా సకాలంలో దాన్ని అప్పగించక భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించలేదు.