breaking news
Grant funds
-
చెరువుల రక్షణే లక్ష్యం
- రూ.3 కోట్లతో పెద్దచెరువు అభివృద్ధి - పర్యాటక కేంద్రంగా మారుస్తాం - మంత్రి హరీశ్‌రావు వెల్లడి పటాన్చెరు: చెరువుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. చెరువుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలంలోని అమీన్పూర్ పెద్దచెరువు అభివృద్ధికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బయోలాజికల్ హెరిటేజ్ సైట్‌గా దీన్ని మారుస్తామన్నారు. పెద్దచెరువును ఆదివారం మంత్రి సందర్శించారు. అమీన్పూర్ చెరువును దత్తత తీసుకుని, దాని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, ఇతర అధికారులను ఆయన అభినందించారు. చెరువు వద్ద రెండు గంటలు గడిపిన హరీష్ మాట్లాడుతూ... చెరువులో కూకట్పల్లి మొదలుకుని ఇతర ఆవాస ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు నీటి శుద్ధి కోసం ప్రత్యేక ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు మరో కోటి రూపాయల జీహెచ్ఎంసీ నిధులు వెచ్చిస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. చెరువు విశిష్టతను కాపాడుతూ, ఎఫ్టీఎల్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం చెరువు వద్ద మొక్క నాటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జేసీ వెంకట్రామ్రెడ్డి, జిల్లా ఎస్పీ సుమతి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహాశీల్దార్ ఫర్హీన్ షేక్, ఇరిగేషన్ శాఖా ఎస్ఈ సురేందర్, రాష్ట్ర పీసీబీ అధికారి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. 41 రకాల సీతాకోకచిలుకలు అమీన్పూర్ పెద్ద చెరువు పరిసరాల్లో 171 పక్షిజాతులు జీవిస్తున్నాయని చెరువును దత్తత తీసుకున్న తేజ్‌దీప్‌కౌర్ మంత్రికి వివరించారు. ఇందులో విదేశీ వలస పక్షులు, 41 రకాల సీతాకోక చిలుక లు, 9 రకాల వన్యప్రాణులు, 250 రకాల అరుదైన, ఔషధ మొక్కలు ఉన్నాయన్నారు. చెరువులో కలుషితాల వల్ల మొత్తం జీవ వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. దీన్ని పరిర క్షించాలన్నారు. బ్లాస్టింగ్లు ఆపాలన్నారు. అక్రమ నీటి చౌర్యం, బోరు నీటి వ్యాపార క్షేత్రాలను స్థానిక రెవెన్యూ శాఖ నియంత్రించలేకపోతుందని తేజ్‌దీప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి, స్థానిక టీఆర్ఎస్ నేత గాలి అనిల్‌కుమార్ ఇంట్లో తేనీటీ విందుకు హరీష్ హాజరయ్యారు. -
పంచాయతీలకు నిధులు మంజూరు
ఇందూరు : దీర్ఘకాలికంగా పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరయ్యాయి. పారిశుధ్య సమస్య పరిష్కారం, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు పల్లె ప్రజల చిన్న చిన్న సమస్యలను తీర్చడానికి 2014-15 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7.38 కోట్లు మంజురు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రెజరీ శాఖ ద్వారా ఈ నిధులను అలాట్ చేసి బ్యాంకు ఖాతాల్లో వేయడానికి పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే పంచాయతీ ఖాతాల్లో నిధులు పడనున్నాయి. ఈ నిధులతో పంచాయతీల్లో సానిటేషన్ పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధి దీపాలు, అంగన్వాడీలు, పాఠశాలల్లో మరుదొడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టవచ్చు. జడ్పీకి రూ. 2 కోట్లు.. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 2014-15 సంవత్సరానికిగాను జిల్లా పరిషత్‌కు రూ. 2 కోట్లు మంజురయ్యాయి. మొత్తం రూ. 23 కోట్లు జిల్లాకు రావాల్సి ఉండగా మొదటి దశగా రూ. 2 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మండల పరిషత్‌లకు కోటి రూపాయల వరకు మంజూరయ్యాయి. ఈ నిధులను కూడా ట్రెజరీ ద్వారా జిల్లా, మండల పరిషత్‌లకు కేటాయించనున్నారు. ఈ నిధులను జిల్లాలోని 718 పంచాయతీల ఖాతాల్లో వేయడానికి వీలుగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ మూడు డివిజన్ పంచాయతీ కార్యాలయాల వారిగా పంచాయతీలను విభజించి, అందులో పంచాయతీల జనాభా ఆధారంగా నిధులను కేటాయిస్తున్నారు.