breaking news
granet quary
-
అడ్డదారుల్లో.. అడ్డగోలుగా
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : డివిజన్ కేంద్రమైన టెక్కలిలో మైన్స్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇక్కడి అధికారులు సంవత్సరాలు తరబడి సిట్టింగ్ వేయడంతో అటు గ్రానైట్ క్వారీల్లో... ఇటు ఇప్పుడిప్పుడే చాప కింద నీరులా సాగుతున్న క్రషర్ చిప్స్ అనుమతుల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అండతో మైనింగ్ అధికారులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు తారాస్థాయిలో ఉన్నప్పటికీ అవేమీ బయట పడకుండా సదరు నేతకు, చోటా నాయకులకు గుట్టు చప్పుడు కాకుండా ముడుపులు చెల్లించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఐదేళ్లలో క్వారీ బ్లాకుల తరలింపు విషయంలో అక్రమాలు ఉన్నప్పటికీ ఎక్కడా బయట పడకుండా అధికారులు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించినట్లు సమాచారం. ఇప్పుడు క్వారీల్లో నిల్వగా ఉన్న మెటిరీయల్తో తయారయ్యే చిప్స్ విషయంలో మళ్లీ అధికారుల చేతివాటం తారాస్థాయికి చేరుకుంది. క్వారీలకు అనుకుని సమీప దూరంలో ఉన్న కొన్ని క్రషర్ యూనిట్లకు అడ్డగోలు ‘టీపీ’ (తాత్కాలిక అనుమతులు) ఇచ్చి, ఇష్టారాజ్యంగా రవాణాకు ప్రోత్సహిస్తున్నారు. వాస్తవానికి ప్రతి డంపర్‌కు లోడ్ చేసే విషయంలో ఎప్పటికప్పుడు బిల్లులు పక్కాగా ఉండాలి. అయితే ఇక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నామమాత్రంగా అనుమతులు ఇస్తూ లెక్కలేని విధంగా యూనిట్లను లోడ్ చేసుకుంటున్నారు. టెక్కలి సమీపంలో కొన్ని క్వారీల నుంచి రోజూ టెక్కలి మీదుగా లెక్కకు మించిన చిప్స్ లోడ్లు రవాణా జరుగుతున్నాయి. ఏ రోజూ వాటిపై మైన్స్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో అడ్డగోలు ‘టీపీ’ల వ్యవహారం బయట పడడం లేదు. వాస్తవానికి టెక్కలి మైన్స్ కార్యాలయంలో కొంతమంది అధికారులు, దిగువ స్థాయి సిబ్బంది సంవత్సరాలు తరబడి ఇక్కడే తిష్ట వేయడం వల్ల కొన్ని రకాల వ్యవహారాలు అలవాటుగా మారిపోయాయి. దీంతో అక్రమాలు చోటు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో చేరాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తే, ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
గ్రానైట్ క్వారీ కార్మికుడి ఆత్మహత్య
తిమ్మాపూర్ : తిమ్మాపూర్ గ్రామ శివారులోని సన్‌షైన్ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్ గ్రామానికి చెందిన మండల్ అరవింద్(50) భార్య, పిల్లలతో ఐదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు. క్వారీ వద్ద షెడ్డులో నివాసముంటూ క్వారీలోనే పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం స్వగ్రామంలో చిన్న కూతురు వివాహం చేశాడు. అప్పులు తెచ్చి వివాహం చేసిన అరవింద్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపం చెందాడు. శుక్రవారం వేకువజామున షెడ్డుకు దూరంగా వెళ్లాడు. బహిర్భూమికి వెళ్లాడని భార్య, కుమారుడు భావించారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. క్వారీకి కొంత దూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అరవింద్ అల్లుడు పంకజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.