breaking news
gowthu sirisha
-
గౌతు కంచుకోటకు బీటలు
సాక్షి, పలాస (శ్రీకాకుళం): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సోంపేట నియోజకవర్గ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన గౌతు కంచుకోటకు ఎట్టకేలకు బీటలు తప్పలేదు. గౌతు లచ్చన్న ఆరు పర్యాయాలు, ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వివిధ పదవీ బాధ్యతలు చేపట్టినా ఈసారి మాత్రం వారసత్వ రాజకీయాలు చెల్లవని గౌతు కుటుంబానికి పలాస నియోజకవర్గం ప్రజలు తేల్చిచెప్పారు. స్థానికుడైన మత్స్యకార కులానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పట్టం కట్టారు. పలాస కేంద్రంగా శివాజీ తన కుమార్తె గౌతు శిరీషను రాజకీయ అరంగేట్రం చేయించి మూడో తరం వారసత్వ రాజకీయాలు నడపాలని భావించారు. ఐతే ఇక్కడ ప్రజలు మాత్రం స్థానిక నేతలుగా వారిని గుర్తించలేకపోయారు. వలస రాజకీయాలు ఇక ఏమాత్రం ఇక్కడ చెల్లవని తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పలాస నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో పలాస నియోజకవర్గంగా ఏర్పడింది. ఒకప్పుడు కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు, టెక్కలి నియోజకవర్గంలో ఉండేవి. కొత్తగా ఏర్పడిన పలాస నియోజకవర్గంలోకి పలాసతో పాటు వజ్రపుకొత్తూరు మందస మండలాలు చేరాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఈ నియోజకవర్గంలో అనూహ్య మార్పులు వచ్చాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులు మొదటిసారిగా ఎమ్మెల్యే శివాజీపై పోటీ చేసి విజయం సాధించారు. గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం అప్పుడే బీటలు వారింది. 2014 ఎన్నికల్లో మళ్లీ శివాజీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల తర్వాత శివాజీ తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. దీంతో అల్లుడు వెంకటన్న చౌదరి అధికార దాహంతో రాజ్యంగేతర శక్తిగా మారి ఆర్ధిక అరాచకాలకు పాల్పడడంతో ప్రజలు ఛీత్కరించుకున్నారు. గౌతు కుటుంబానికి గతమంతా ఘన కీర్తి అయితే నేడు అపకీర్తి మూట గట్టుకోవడానికి వారి కుటుంబం స్వయం కృతాపరాధం కూడా లేకపోలేదు. వర్గాల సృష్టికర్త శివాజీ.. పార్టీలో వర్గాలను, ముఠాలను ఏర్పాటు చేసి తనకు నచ్చిన వర్గానికి కొమ్ముకాయడం, వెంటేసుకురావడం, నచ్చని వర్గాన్ని నట్టేట ముంచడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అదే పలాస నియోజకవర్గంలో ఆయనకు కొంపముంచింది. రాజకీయంగా ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీకుండా తొక్కేయడం వల్ల చాలా మంది ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా మారారు. అందులో భాగంగానే మందస మండల ఎంపీపీ కొర్ల కవితా కన్నారావు, వజ్రపుకొత్తూరు జెడ్పీటీసీ ఉప్పరపల్లి నీలవేణి ఉదయ్‌కుమార్, పలాస– కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, పలాస మాజీ జెడ్పీటీసీ వడిశ హరిప్రసాద్ తదితరుల రాజకీయ భవిష్యత్‌కు చరమ గీతం పాడాలని గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఈ విధంగా ఆయన కంచుకోటకు బీటలు వారడానికి గల అనేక కారణాల్లో వారి స్వయంకృతాపరాధమే ఎక్కువ శాతం ఉంది. -
టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు శుక్రవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది. కంచిలి మండలం బూర్గామ్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించపోయిన క్రమంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ సమయంలో శిరీష సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.