breaking news
Government responsible
-
‘చాపరాయి’ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్ : తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో గిరిజనులు విషజ్వరాలతో మృతి చెందిన ఘటనకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ చాపరాయిలో మూడు వారాల్లో 16 మంది అనారోగ్యంతో మృత్యువాత పడ్డారని ఆవేదన చెందారు. ప్రభుత్వం కనీస ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు సరైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు లేవని, తండాల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదని విచారం వెలిబుచ్చారు. ఏదైనా అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లాలంటే సరైన రోడ్లు లేవన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ కేవలం రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇస్తామని చెప్పిన చంద్రబాబు దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన తండాలు, ఏజెన్సీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో జీవీఎస్ నాయకులు మల్లికార్జున, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ సాకే చిరంజీవి, విద్యార్థి విభాగం రాజునాయక్, వై.సుధాకర్, శీనానాయక్, భాస్కర్‌నాయక్, రమేష్‌నాయక్ పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం
దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రైతు ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గలేదని, వాటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి రఘునందన్‌రావు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నారెడ్డి రాంరెడ్డి కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కుమ్మరి నర్సింలు, భిక్షపతి, యాదగిరి తదితరులున్నారు.