breaking news
Gouthu Shyamasundara Shivaji
-
ఎమ్మెల్యేనా మజాకా..!
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామసుందర శివాజీ ప్రజల అవసరాల కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తారనడానికి పెట్రోల్ బంకులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలాసలో ప్రభుత్వ పెట్రోల్ బంకు మంజూరైనా తన బంకులకు ఎక్కడ పోటీగా వస్తుందోనని భయపడి అధికారాన్ని అడ్డంపెట్టుకుని బంకు ఏర్పాటుకాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైన ఎమ్మెల్యే.. తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవడానికి మాత్రం ముందుంటారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల ప్రభుత్వ పెట్రోల్ బంకులను మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒకటి, పలాసలో మరొకటి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు, ఏర్పాట్లు తదితర పనులు చకచకా సాగిపోయాయి. శ్రీకాకుళంలో ఇప్పటికే సేవలందుతుండగా పలాసలో మాత్రం ఇంకా మోక్షం కలగలేదు. ఇందుకు ఎమ్మెల్యే శివాజీయే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అందులో కీలకమైనది పెట్రోల్ బంకుల వ్యాపారం. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలు, పలాస, మందస, శ్రీకాకుళం, సోంపేట తదితర ప్రాంతాల్లో సుమారు 14 పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ప్రభుత్వ బంకు ఏర్పాటు చేస్తే తన వ్యాపారానికి అడ్డుగా ఉంటుందని గ్రహించిన పలాస ఎమ్మెల్యే తనదైన శైలిలో బంకుకు మోకాలడ్డారు. శంకుస్థాపన జరిగినా.. పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని ఐదెకరాల స్థలంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు. 2018 మే 31న శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే శివాజీ తన వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించి బంకు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే 11 నెలలు పూర్తయినా నేటికీ బంకుకు మోక్షం కలగలేదని చెబుతున్నారు. ట్యాంకర్లు, ఇతర వస్తువులు నిర్మాణ స్థలం వద్దకు తీసుకువచ్చినా పనులు మాత్రం పూర్తి కాలేదని అంటున్నారు. ప్రభుత్వం తరఫున బంకు ఏర్పాటైతే స్వచ్ఛమైన పెట్రోల్ వస్తుందని ఎదురుచూశామని, ఎమ్మెల్యే కారణంగా నిరాశే ఎదురైందని పలువురు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శివాజీ ఛత్రం కింద..సెకండ్ క్యా‘డర్’!
♦ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుపై మరో కేసు ♦ కేసుల్లో ఇరుక్కున్న ముకుందరావు, బుల్లు ప్రధాన్ ♦ ద్వితీయ శ్రేణి నాయకులకు ఎక్కడికక్కడ చెక్? ♦ ‘గౌతు’ కుటుంబ వ్యతిరేకుల్లో తీవ్ర అలజడి రాజకీయాల్లో జెండా మోసేవారెవ్వరికైనా అధికార పీఠం ఒక్కసారైనా అధిరోహించాలనే ఆశ సహజం! అధికార పీఠంపై ఉన్నవారికి చేజారిపోకూడదనే ఆరాటం అంతే సహజం! ఇది రాజకీయాల్లో సహజసూత్రం! కానీ పలాస నియోజకవర్గంలో మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఎవ్వరికైనా పదవులపై అలాంటి ఆశలుంటే వదులుకోవాల్సిందే! ఎందుకంటే సుదీర్ఘకాలం పలాస రాజకీయాలను శాసిస్తున్న గౌతు కుటుంబాన్ని కాదని ఎదురేగిన ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కొక్కరూ పోలీసు కేసుల్లో చిక్కుకుపోతున్నారు! వారిలో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ముందున్నారు. టీడీపీ కౌన్సిలర్లు పాతాళ ముకుందరావు, బుల్లు ప్రధాన్‌లపై కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే గౌతు కుటుంబాన్ని కాదన్న కొర్ల కవితా కన్నారావు మందస ఎంపీపీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది! మొత్తంమీద ఈ కేసుల వ్యవహారంతో పలా స టీడీపీ శ్రేణుల్లో అలజడి రేగుతోంది. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తన కుమార్తె టీడీపీ జిల్లా అధ్యక్షురాలైన శిరీషను వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చాలారోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలాస, లేదంటే తమ సొంతూరు సోంపేట కలిసిఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారనే వాదనలు ఉన్నాయి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సహా టీడీపీ నాయకులెవ్వరైనా సరే శివాజీ అనుమతి లేకుండా సోంపేటలో అడుగు పెట్టడానికి సాహసం చేయరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా శివాజీతో ఢీ అంటే ఢీ అంటున్న కోత పూర్ణచంద్రరావు మంగళవారం సోంపేట గడ్డపై అడుగుపెట్టడం వల్లే మరో కేసులో ఇరుక్కుపోయారనే వాదనలు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి శివాజీ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బెర్త్ ఆశించారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన మరో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావుకే చంద్రబాబు చాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికలలో తాను పోటీ చేయబోనని, తనకు చివరి అవకాశంగా మంత్రిమండలిలో చోటు కల్పించాలని శివాజీ కోరినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై ఆయన కన్నీంటిపర్యంతమైన సంగతి జిల్లా ప్రజలకు తెలిసిందే. అయితే శివాజీ చెబుతున్నట్లుగా మరో రెండేళ్లలో రాజకీయాల విరమణ చేస్తే... తమకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వస్తుందని పలాస టీడీపీ శ్రేణుల్లో కొంతమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు ఆయన గత రెండేళ్లలో తరచుగా అనారోగ్య కారణాల వల్ల సమావేశాలకు హాజరుకాలేకపోతున్నారు. దీంతో పలు కార్యక్రమాలను ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ నిర్వహిస్తూ వచ్చారు. అదే సమయంలో కొర్ల కన్నారావు, కోత పూర్ణచంద్రరావు కాస్త ముందుకెళ్లి... వచ్చే ఎన్నికలలో పలాస సీటు తమకు వస్తుందని అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో శివాజీ అప్రమత్తమయ్యారు. తన కుమార్తె శిరీషను పలాస నియోజకవర్గంలో రాజకీయ కార్యక్రమాలకే గాకుండా అధికారిక కార్యక్రమాలకు పంపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించడానికీ వెనుకాడలేదు. మరోవైపు టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలకు సెగ మొదలైంది. ఇది ముదురుపాకాన పడి పోలీసు కేసుల వరకూ వెళ్లింది! మొదలైన గుండె ‘కోత’.... పలాస మున్సిపల్ చైర్మన్‌గా కోత పూర్ణచంద్రరావు ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు ప్రత్యేకంగా అనుచర గణం ఏర్పడింది. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లోని కార్యకర్తలు ఆయన వెంటే ఎక్కువ మంది చేరిపోయారు. అప్పటి నుంచి కోతను ఎమ్మెల్యే శివాజీ దూరం పెట్టడం మొదలెట్టారు. పలాసలో రైతుబజారు ఏర్పాటు కోసం స్థలం విషయంలో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ప్రత్యక్ష పోరు ప్రారంభమైంది. వివాదంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం స్థలాన్ని కొంతమంది వ్యాపారులకు అప్పగించేందుకు జరిగిన వ్యవహారంలో శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి హస్తం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం సాగకుండా కోత అడ్డుకున్నారు. ఈ తర్వాత ఏఎంసీ సమావేశ మందిరంలో జరిగిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో శివాజీ, పూర్ణచంద్రరావుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న పిళ్లా జగన్మోహన్రావును ప్రత్యేక జీవోతో పలాస మున్సిపల్ కమిషనర్‌గా శివాజీ తీసుకొచ్చారు. ఇక కమిషనర్‌కు, చైర్మన్‌కు మధ్య తరచూ చెక్‌లపై సంతకాల్లో వివాదం రేగుతూ వచ్చింది. చివరకు వారిద్దరి మధ్య దాడి ఘటన చోటు చేసుకుంది. కమిషనర్ కేసు పెట్టడంతో కోత చాలారోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంలోనే 24వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుందరావు, మరో కౌన్సిలర్ బళ్ల రేవతి భర్త శ్రీనివాసరావులపై సైతం కేసులు నమోదయ్యాయి. ఇటీవలే బెయిల్ మంజూరవ్వడంతో జనాల్లోకి కోత వచ్చారు. కొద్దిరోజులకే మళ్లీ పేకాట కేసులో ఇరుక్కుపోవడం గమనార్హం. టీడీపీ కౌన్సిలర్‌పై రౌడీషీట్... పలాస మున్సిపల్ సమావేశాల్లో పాతాళ ముకుందరావు చైర్మన్ కోతకు అండగా నిలబడేవారు. ఇటీవల సర్వసభ్య సమావేశంలో కమిషనర్‌ను నిలదీశారు. కమిషనర్‌కు శివాజీ మద్దతుగా నిలిచారు. అయితే మూడు రోజులకే ముకుందరావుపై పాత కేసులను తిరగేసి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల బూత్ వద్ద గలాటా చేశాడని, అంబులెన్స్‌లో నాటుసారా రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. టీడీపీలోనూ సోషల్ మీడియా కేసు... పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు లక్ష్మీ ప్రధాన్ భర్త బుల్లు ప్రధాన్. హుదూద్ ఇళ్లకు లబ్ధిదారుల జాబితాను బహిరంగం చేయాలని సర్వసభ్య సమావేశంలోనే ఎమ్మెల్యే శివాజీని ఆయన ప్రశ్నించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో బుల్లు ప్రధాన్ స్థానిక సమస్యలపై వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పోస్టులు పెట్టడం మొదలెట్టారు. చివరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చౌదరిలకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలను తరచుగా పోస్టు చేస్తుండేవారు. దీంతో ప్రధాన్‌పై కేసు నమోదైంది. కొర్ల కవిత పదవీ త్యాగం.... మందస మండల అభివృద్ధికి ఎమ్మెల్యే శివాజీ అడ్డుపడుతున్నారనే తీవ్ర ఆరోపణలు చేస్తూ టీడీపీకే చెందిన కొర్ల కవితా కన్నారావు తన ఎంపీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయమేమిటంటే గత ఎన్నికలలో పలాస సీటు కోసం ఆమె భర్త కన్నారావు కూడా పోటీపడ్డారు. శివాజీ సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయనకు కన్నారావుకు మధ్య ఎడముఖం పెడముఖంగానే ఉండేది. ఈ నేపథ్యంలో మందసలో టీడీపీ రెండు వర్గాలు విడిపోయింది. ఈ పోరులో కవిత తన ఎంపీపీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.