breaking news
General pilgrims
-
గుణపాఠాలు నేర్వలేదు!
గత పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారిని పట్టించుకోని వైనం హైదరాబాద్: ముఖ్యమంత్రి సలహాలు, సూచనల మేరకు మాత్రమే పుష్కరాలు జరగాలి అనుకున్నారేమో కానీ... ఈసారి పుష్కర ఏర్పాట్లలో అధికారుల ప్రణాళికలు ఏవీ అమలు పెట్టలేదు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని.. గత పుష్కరాన్ని విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న అధికారుల సూచనలు, సలహాలనైనా తీసుకొన్న దాఖలాలు కనిపించలేదు. తాజా దుర్ఘటన నేపథ్యంలో పుష్కరాల నిర్వహణలోని ఈ లోపం తేటతెల్లం అవుతోంది. ‘పుష్కరస్నానాలు చేయడానికి వచ్చే వీఐపీలు సామాన్య ప్రజల ఘాట్ల వైపు రాకూడదు...’ 2003 సంవత్సరంలో జరిగిన పుష్కరాల సందర్భంగా నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ జవహర్‌రెడ్డి పెట్టిన నియమం ఇది. వీఐపీలకు ప్రత్యేక ఘాట్ ఉన్న నేపథ్యంలో రాజకీయ,సినీ, సామాజిక ప్రముఖులంతా అటువైపు వెళ్లి స్నానాలు చేసుకొనేలా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల సామాన్య భక్తులు స్నానాలు చేసే ఘాట్లలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. అప్పట్లో ఈ నియమాన్ని తప్పనిసరిగా అమలు చేశారు. నాటి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేస్తామని పట్టుబట్టినా లక్షలాది భక్తుల భద్రతా చర్యల దృష్ట్యా పుష్కర ఘాట్‌కు వస్తే సాధారణ భక్తుల్లాగే స్నానం చేయాలే తప్ప వీఐపీ సౌకర్యాలు కల్పించడం, సాధారణ భక్తులను స్నానం చేయకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ భక్తుల్లో ఒకరిగా వచ్చి స్నానం చేసి వెళ్తే అభ్యంతరం లేదని నేతలకు కలెక్టర్ తెలిపారు. దీంతో వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు సామాన్య భక్తులతో కలిసే అప్పుడు పుష్కర ఘాట్‌లో స్నానం చేశారు. ఈ తరహా ఏర్పాటు ఈ సారి లేకపోవడం... గత అనుభవాలను పట్టించుకోకపోవటంతో దుర్ఘటన జరిగిపోయింది. విదేశాల్లో ‘పుష్కర’ మంత్రులు సాక్షి, హైదరాబాద్: పుష్కరాలను పర్యవేక్షించాల్సిన కీలక సమయంలో ముఖ్యమంత్రి సహా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన మంత్రులంతా విదేశీ పర్యటనల్లో తలమునకలయ్యారు. పుష్కర ఏర్పాట్లకు మంత్రులతో ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘంలో సభ్యులైన యనమల, నారాయణ ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకూ సీఎం చంద్రబాబుతో పాటు జపాన్‌లో పర్యటించారు. పుష్కరాల కమిటీ ఛైర్మన్ పరకాల ప్రభాకర్ సైతం సీఎంతో పాటు జపాన్ పర్యటనకు వెళ్లారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు తానా సభలకు వెళ్లి వచ్చారు. తిరుమలలోనూ అదే నియమం.. తిరుమలలో గరుడోత్సవానికి గతంలో ముఖ్యమంత్రులు హాజరయ్యేవారు. ఇరుకైన మాడ వీధుల్లో గరుడోత్సవానికి మందీమార్బలంతో ముఖ్యమంత్రులు రావడంతో తొక్కిసలాటలు జరిగి సాధారణ పౌరులు గాయపడేవారు. దీంతో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అజేయ కల్లం గరుడోత్సవానికి ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు రాకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో 2004 నుంచి గరుడోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలోని వారు హాజరు కావడం మానేశారు. -
ఆధ్యాత్మికానందం
శ్రీవారితో పాటు పద్మావతీ అమ్మవారిని, కపిలేశ్వరుడిని దర్శించుకున్న ప్రణబ్‌ముఖర్జీ టీటీడీ ఆతిథ్యానికి పులకించిన ‘దాదా’ అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్న గవర్నర్, సీఎం తిరుమల: రాష్ట్రపతి తిరుమల పర్యటనలో భాగంగా ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఆయన శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని, తిరుపతిలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకుని పరవశించారు. ఈ సందర్భంగా టీటీడీ చేసిన ఘనమైన ఏర్పాట్లతో ప్రణబ్ ముఖర్జీ పరవశించి ఆనందంగా తిరుగుప్రయాణమయ్యారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో తిరుమలలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, తిరుపతిలో జేఈవో పోలా భాస్కర్ బృందాలు వేర్వేరుగా ఏర్పాట్లు చేశాయి. విమానం దిగిన తర్వాత తిరుచానూరుకు చేరుకున్నప్పటి నుంచి రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుకు ఎక్కడా కూడా చిన్నలోటులేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, ఆ తర్వాత కపిలేశ్వర స్వామి దర్శనం, తిరుమలకు చేరుకున్న తర్వాత అతిథిగృహంలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. ధరించేందుకు పట్టువస్త్రాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల వరకు అన్నీ కూడా ముందస్తుగానే సిద్ధం చేశారు. ఉత్తరాది వంటకాల వడ్డింపు రాష్ట్రపతి పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీ ఆ మేరకు ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతికి ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఆయన వ్యక్తిగత వ ంటమనిషి (చెఫ్) ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు. ఇక గవర్నర్, సీఎంకు టీటీడీ తయారు చేసిన పదార్థాలు వడ్డించారు. ఇదే తరహాలో వారి వెంట వచ్చిన మంత్రులు, సీఎస్, డీజీపీతోపాటు రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్, సీఎం పేషీ అధికార యంత్రాంగానికి సకల సదుపాయాలు సమకూర్చారు. టీటీడీ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసుల సమన్వయం టీటీడీ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు విభాగాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా సమన్వయ సహకారంతో పనిచేశాయి. అన్ని విభాగాలను, అధికారులందరినీ ఒకే తాటిపై తీసుకురావటంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షణలో టీటీడీ విభాగాలు, కలెక్టర్ సిదార్థ్జైన్, అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ, తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీసు విభాగాలు పనిచేశాయి. సీవీఎస్వో నాగేంద్రకుమార్ పర్యవేక్షణలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధులు పంచుకుని సమర్థవంతంగా పనిచేశారు. రాష్ర్టపతి పర్యటన తీర్థయాత్ర మొత్తం ఏడున్నర గంటలు సాగింది. ఉదయం 10.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం దిగిన తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. భక్తులకు 4 గంటలపాటు దర్శనం నిలిపివేత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సామాన్య భక్తులతోపాటు రూ.300 టికెట్ల భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. సుమారు నాలుగుగంటల తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటలకే ఆలయం వద్ద ఏ ఒక్క భక్తుడు రాకుండా చూసుకున్నారు. ఆలయంలో కల్యాణోత్సవం ముగిసిన తర్వాత కూడా వారికి దర్శనం కల్పించి, వెలుపలకు పంపారు. ఆలయ ప్రాంతంలోనూ భక్తులను కట్టడి చేశారు. సమష్టిగా పనిచేశారు : టీటీడీ ఈవో కితాబు టీటీడీతోపాటు రెవెన్యూ, పోలీసు విభాగాలు సమష్టిగా పనిచేశాయని ఈవో దొండపాటి సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలు, భద్రతా కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేశామన్నారు.