గుణపాఠాలు నేర్వలేదు! | Do not lessons | Sakshi
Sakshi News home page

గుణపాఠాలు నేర్వలేదు!

Jul 15 2015 2:19 AM | Updated on Mar 21 2019 7:25 PM

ముఖ్యమంత్రి సలహాలు, సూచనల మేరకు మాత్రమే పుష్కరాలు జరగాలి అనుకున్నారేమో కానీ...

గత పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారిని పట్టించుకోని వైనం
 
హైదరాబాద్: ముఖ్యమంత్రి సలహాలు, సూచనల మేరకు మాత్రమే పుష్కరాలు జరగాలి అనుకున్నారేమో కానీ... ఈసారి పుష్కర ఏర్పాట్లలో అధికారుల ప్రణాళికలు ఏవీ అమలు పెట్టలేదు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని.. గత పుష్కరాన్ని విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న అధికారుల సూచనలు, సలహాలనైనా తీసుకొన్న దాఖలాలు కనిపించలేదు. తాజా దుర్ఘటన నేపథ్యంలో పుష్కరాల నిర్వహణలోని ఈ లోపం తేటతెల్లం అవుతోంది. ‘పుష్కరస్నానాలు చేయడానికి వచ్చే వీఐపీలు సామాన్య ప్రజల ఘాట్ల వైపు రాకూడదు...’ 2003 సంవత్సరంలో జరిగిన పుష్కరాల సందర్భంగా నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ జవహర్‌రెడ్డి పెట్టిన నియమం ఇది. వీఐపీలకు ప్రత్యేక ఘాట్ ఉన్న నేపథ్యంలో రాజకీయ,సినీ, సామాజిక ప్రముఖులంతా అటువైపు వెళ్లి స్నానాలు చేసుకొనేలా ఏర్పాట్లు చేశారు.

దీని వల్ల సామాన్య భక్తులు స్నానాలు చేసే ఘాట్‌లలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. అప్పట్లో ఈ నియమాన్ని తప్పనిసరిగా అమలు చేశారు. నాటి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేస్తామని పట్టుబట్టినా లక్షలాది భక్తుల భద్రతా చర్యల దృష్ట్యా పుష్కర ఘాట్‌కు వస్తే సాధారణ భక్తుల్లాగే స్నానం చేయాలే తప్ప వీఐపీ సౌకర్యాలు కల్పించడం, సాధారణ భక్తులను స్నానం చేయకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ భక్తుల్లో ఒకరిగా వచ్చి స్నానం చేసి వెళ్తే అభ్యంతరం లేదని నేతలకు కలెక్టర్ తెలిపారు. దీంతో వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు సామాన్య భక్తులతో కలిసే అప్పుడు పుష్కర ఘాట్‌లో స్నానం చేశారు. ఈ తరహా ఏర్పాటు ఈ సారి లేకపోవడం... గత అనుభవాలను పట్టించుకోకపోవటంతో దుర్ఘటన జరిగిపోయింది.
 
విదేశాల్లో ‘పుష్కర’ మంత్రులు

 సాక్షి, హైదరాబాద్: పుష్కరాలను పర్యవేక్షించాల్సిన కీలక సమయంలో ముఖ్యమంత్రి సహా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన మంత్రులంతా విదేశీ పర్యటనల్లో తలమునకలయ్యారు. పుష్కర ఏర్పాట్లకు మంత్రులతో  ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఉపసంఘంలో సభ్యులైన యనమల, నారాయణ ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకూ సీఎం చంద్రబాబుతో పాటు జపాన్‌లో పర్యటించారు. పుష్కరాల కమిటీ ఛైర్మన్ పరకాల ప్రభాకర్ సైతం సీఎంతో పాటు జపాన్ పర్యటనకు వెళ్లారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు తానా సభలకు వెళ్లి వచ్చారు.
 
 
తిరుమలలోనూ అదే నియమం..

తిరుమలలో గరుడోత్సవానికి గతంలో ముఖ్యమంత్రులు హాజరయ్యేవారు. ఇరుకైన మాడ వీధుల్లో గరుడోత్సవానికి మందీమార్బలంతో ముఖ్యమంత్రులు రావడంతో తొక్కిసలాటలు జరిగి సాధారణ పౌరులు గాయపడేవారు. దీంతో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అజేయ కల్లం గరుడోత్సవానికి ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు రాకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో 2004 నుంచి గరుడోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలోని వారు హాజరు కావడం
 మానేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement