వ్యవసాయం కుదేలు
కేపీఆర్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీసీ బయ్యారెడ్డి
ప్రభుత్వాల వైఖరే కారణం
కోలారు : ప్రభుత్వాల ఉదాసీనత, ప్రైవేటీకరణ వైఖరి వల్ల రాష్ర్టంలో వ్యవసాయ రంగం కుదేలవుతోందని కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీసీ బయ్యారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కేపీఆర్‌ఎస్ తాలూకా ఏడవ సమ్మేళనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ప్రభుత్వాలు తిలోదకాలిచ్చాయని అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండటంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
మరో వైపు రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయడం మండిపడ్డారు. దీంతో దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఓ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఆధారపడగా ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఇతర పార్టీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదన్నారు. రైతులకు వ్యవసాయ రుణంపై ఇచ్చే రాయితీలు కంపెనీల పాలవుతోందన్నారు.
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పట్టులో ఐదు శాతం కోలారు నుంచే వస్తోందన్నారు. అయితే పట్టు ఉత్పత్తిదారుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు పట్టు చీర కొనే స్థితిలో లేరన్నారు. తాలూకాలో వర్షాలు లేక వ్యవసాయ కార్యకలాపాలు స్తంభించాయన్నారు. తక్షణమే ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఏడాదికి 200 పనిదినాలు కల్పించి రోజుకు రూ. 300 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు.
బగర్‌హుకుం సాగు భూములను పంపిణీ చేయాలని, శాశ్వత నీటి పారుదల సౌలభ్యాలు కల్పించాలని, పాడి, పట్టు పరిశ్రమను కాపాడుతూ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేపీఆర్‌ఎస్ జిల్లాధ్యక్షుడు పీఆర్ సూర్యనారాయణ, తాలూకా అధ్యక్షుడు కుర్కి దేవరాజ్, టీఎం వెంకటేష్, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.