breaking news
Gas cylinder leak
-
గ్యాస్ సిలిండర్ లీకేజీతో ఐదుగురికి తీవ్రగాయాలు
ఆనందంగా పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమయ్యారు. రోజూలాగే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఆ భయానికి చుట్టు పక్కలవారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఆ ఇంటి నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు శబ్దం వచ్చిన ప్రదేశానికి చేరుకునేసరికి ఇల్లు కూలిపోయి ఉంది. ఇంట్లోని ఐదుగురు మంటల్లో కాలి, తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తున్నారు. ఈ సంఘటన కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్య చోటుచేసుకుంది. సాక్షి, కామేపల్లి: గ్యాస్ సిలిండర్ లీకై ఐదుగురు తీవ్రంగా గాయపడడంతోపాటు ఇల్లు కూలిపోయింది. గ్రామస్తుల కథనం మేరకు.. బోయినపల్లి ఉపేంద్రమ్మ తన కూతురు వంగా నాగమణి, మనుమళ్లు పల్లె నగేష్‌బాబు, మందా శ్రీనాథ్, మందా వినయ్‌కుమార్ ఇంట్లో నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున ఉపేంద్రమ్మ మనుమడు లేచి కరెంట్ స్విచ్ ఆన్‌చేశాడు. అప్పటికే గ్యాస్ సిలిండర్ లీకవుతుండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని భారీ శబ్దాలు వచ్చాయి. ఈ ఘటనలో ఇల్లు కూలిపోయింది. శబ్దానికి ఇరుగుపొరుగు వారు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురయ్యారు. తేరుకునేసరికి ఉపేంద్రమ్మ ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లి చూడగా ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. శరీరం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంటనే వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బోయినపల్లి ఉపేంద్రమ్మ 65 శాతం, వంగా నాగమణి 43 శాతం, పల్లె నగేష్‌బాబు 90 శాతం, మందా వినయ్‌కుమార్ 65 శాతం, మందా శ్రీనాథ్ 70 శాతం వరకు శరీరం కాలిపోయింది. ఉపేంద్రమ్మ కుమార్తె వంగా నాగమణి ప్రస్తుతం 6 నెలల గర్భవతి. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం పొందుతున్న క్షతగాత్రులను ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, భద్రాది జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేకల మల్లిబాబుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య పరామర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేయమని చెప్పడంతో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. క్షతగాత్రులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ లీక్
బాడంగి : మండలంలోని కోడూరు బీసీ కాలనీలో గ్యాస్ లీకవడంతో ఇద్దరు అన్నదమ్ములు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన కిలారి రాము ఇంటికి బంధువులు రానుండడంతో గ్యాస్ పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైభాగం నుంచి గ్యాస్ లీకవడంతో వెంటనే సిలిండర్‌ను తప్పించే క్రమంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యి మంటలు అంటుకున్నాయి. దీంతో రాము గాయపడగా, అతడ్ని కాపాడబోయే క్రమంలో సోదరుడు లక్ష్మనాయుడు కూడా గాయపడ్డారు. వెంటనే వీరిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన రామును విజయనగరం ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ లీకై మంటలు
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో శుక్రవారం గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగింది. స్తానికంగా ఉండే బుద్ధ రామకృష్ణ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అకస్మాత్తుగా ప్రమాదం మంటలు రావడంతో ఇంట్లోని వారంతా బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. సుమారు లక్ష రూపాయలకు పైగా ఆస్టినష్టం జరిగినట్టు అంచనా. -
గ్యాస్ సిలిండర్ పేలుడు
► రెండు నెలల చిన్నారి మృతి ► 18మందికి గాయాలు ► నలుగురి పరిస్థితి విషమం ► మంత్రులు, జిల్లా కలెక్టర్ పరామర్శ ► కంపించిన రంగిరీజువీధి విశాఖపట్నం : రంగిరీజువీధిలో నివసిస్తున్న కొప్పుల ఈశ్వరరావు (చిన్నా) ఇంట్లో కోట సత్యనారాయణ, వరలక్ష్మి అద్దెకుంటున్నారు. వీరి పెద్ద కుమారుడు నరసింగరావు, చిన్న కుమారుడు శ్రీను తండ్రితో పాటు అయ్యప్పమాల ధరించారు. నరసింగరావుకు భార్య బుజ్జి, కుమార్తెలు ఏడేళ్ల పూజిత, రెండున్నరేళ్ల చాందిని, ఏడాదిన్నర వయసున్న కొడుకు జయరామ్ ఉన్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీకై వాసన రావడాన్ని నరసింగరావు భార్య బుజ్జి పసిగట్టింది. వెంటనే మావయ్య కోట సత్యనారాయణకు చెప్పింది. అయ్యప్ప మాలలో ఉన్న ఆయన సమీపంలో పకోడి బండి నిర్వహిస్తున్న కొల్లి సూరిబాబుకు చెప్పాడు. ఆయన వచ్చి గ్యాస్ సిలిండర్‌కు ఉన్న పిన్ను సరిచేస్తుండగా ఒక్కసారిగా లీకై ఇల్లంతా వ్యాపించింది. అంతే... ఒక్కసారిగా ఇంటి నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న కోట వరలక్ష్మి (50) కోట బుజ్జి(25), కోట పూజిత(7), కోట చాందిని (రెండున్నరేళ్లు), కోట జయరామ్ (19 నెలలు)తో పాటు గ్యాస్లీక్ను అరికట్టేందుకు వచ్చిన కొల్లి సూరిబాబు (40) తీవ్రంగా గాయపడ్డారు. మేడపై ఉన్న ఇంటి యజమాని కొప్పుల ఈశ్వరరావు (చిన్ని)(40), పేలుడు సంభవించిన ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వచ్చిన డి.శాంతమ్మ (50), కె హరి (17), వీధిలో వెళ్తున్న కొల్లి బండమ్మ (50), రెడ్డి కీర్తి(11), ఎస్.తనూజ (8), జి.నాగేశ్వరి(30), గోరింట రాజు (35), సిహెచ్.వనజ(10), స్కూల్‌కి పిల్లల్ని తీసుకెళ్తున్న సునీత (40), చిన్నారులు మోహనకృష్ణ(13), యామిని(15) గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరం కేజీహెచ్ సూపర్‌స్పెషాల్టీ వార్డులో 80 శాతం గాయాలతో కొప్పుల ఈశ్వరరావు (చిన్న), 50 శాతం కాలిన గాయాలతో డి.శాంతమ్మ, 60 శాతం గాయాలతో కె.పూజిత, 76 శాతంతో కాలిన గాయాలతో కె.సూరిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేజీహెచ్ నుంచి సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి వివరాలు కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులో 15 శాతం గాయాలతో ఎస్.తనూజ, 12 శాతంతో కీర్తి, 30 శాతం గాయాలతో జయరామ్, 25 శాతం గాయాలతో చాందిని, 20 శాతం గాయాలతో హరి, 15 శాతం గాయాలతో నాగేశ్వరి, 30 శాతం గాయాలతో వరలక్ష్మి, 19 శాతం గాయాలతో బుజ్జి, 12 శాతం గాయాలతో బండమ్మ చికిత్స పొందుతున్నారు. మంత్రుల పరామర్శ... క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కేజీహెచ్‌కు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ ఎన్.యువరాజ్ ఎమ్మె ల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ హుటాహుటిన చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫోన్లో మంత్రి గంటాతో మాట్లాడారు. ప్రయివేటు ఆస్పత్రికి తరలించైనా సరే మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. కుళాయి ఆలస్యమే రక్షించింది రోజూ ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వచ్చే మంచినీటి కుళాయి మంగళవారం కాస్త ఆలస్యంగా వచ్చింది. అదే ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఎందుకంటే.. పేలుడు సంభవించిన ఇంటి ముందరే వీధి కొళాయి ఉంది. సుమారు 30 మంది వరకు మంచినీళ్లు పట్టుకుంటారు. కొళాయిని విప్పే ఫిట్టర్ పరోక్షంగా ఎందరికో ప్రాణదాత అయ్యాడు. అగ్నిమాపక శకటానికి దారేది? ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకు సందులో ఉంది. అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి తీసుకె ళ్లలేకపోయారు. దీంతో సిబ్బంది అష్టకష్టాలు పడి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సులు కూడా లోపలికి రాలేకపోవడంతో ఆటోల్లో కేజీహెచ్‌కు తరలించారు. మంగళవారం ఉదయం 7.30 గంటలు. ఎవరి హడావుడిలో వారున్నారు. అమ్మో..గ్యాస్ లీకైందంటూ పెద్ద ఎత్తున కేకలు... అరుపులు. అంతలోనే ఓ ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు. ఆ ధాటికి భవనాల గోడలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు గాల్లోకి లేచాయి. నిద్రిస్తున్న రెండు నెలల చిన్నారి ఉసురు తీశాయి. మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగింది?... ఏమైంది?.. అంతా గజగజ వణికిపోయారు. గాయాలతో హాహాకారాలు చేశారు. బాధతో విలవిల్లాడిపోయారు. పద్దెనిమిది మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వెక్కివెక్కి రోదిస్తున్నారు. ఏం పాపం చేశాం... దేవుడా అని కుమిలిపోతున్నారు. ఆనందంగా సాగిపోతున్న జీవితాల్లో అంతులేని విషాదం అలముకుంది. రంగిరీజు వీధిలో మంగళవారం ఉదయం సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడుతో విశాఖ నగరం మొత్తం ఉలిక్కి పడింది. రెండు నెలలకే నూరేళ్లు అక్టోబర్ 12న... హుద్‌హుద్ తుపాను విరుచుకు పడిన రోజు. గర్భిణి బండారు భవానికి నొప్పులొచ్చాయి. ఆ రోజు రాత్రి కటిక చీకట్లో ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యుత్ లేక శస్త్ర చికిత్సలకు అవకాశం లేదనడంతో ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో చివరిగా కేజీహెచ్‌కు తీసుకెళ్తే రాత్రి 11.40 గంటలకు ముద్దుల మూటగట్టే చిన్నారి జన్మించింది. ఆ చిన్నారికి ఇప్పటి వరకు నామకరణం కూడా చేయలేదు. తండ్రి ఆటో కార్మికుడు కావడంతో చాలీ చాలని ఆదాయంతో నెట్టుకొస్తున్నాడు. త్వరలోనే శుభకార్యం నిర్వహించి చిన్నారికి పేరు పెట్టాలనుకున్నారు. మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్ధానికి ఇంటి ఎదురుగా ఉన్న భవనం రెండో అంతస్తులో నిద్రిస్తున్న ఆ చిన్నారిపై పైకప్పు రేకులు పడ్డాయి. ఆమె ఊపిరిని ఆపేశాయి. తుపానును జయించిన ఆ చిన్నారి గ్యాస్ పేలుడు రూపంలో కబళించిన మృత్యువును తప్పించుకోలేకపోయింది. పుట్టిన రెండు నెలల్లోనే సుదూర తీరాలకు వెళ్లిపోయింది. అమ్మానాన్నలకు భరించలేనంత దుఃఖాన్ని మిగిల్చింది. ప్రాణాలకు తెగించిన ఆ నలుగురు గ్యాస్ లీకైన ఇంట్లోకి నలుగురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రవేశించారు. అప్పటికే ఒక సిలిండర్ పూర్తిగా కాలిబూడిదైంది. మరో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ప్రాణాలను సైతం పక్కనపెట్టి ఇంట్లో కాలుతున్న ఆ రెండు సిలిండర్లను అగ్నిమాపక శాఖ హెడ్‌కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ ఎల్లాపు, ఎల్.బాలకృష్ణ, ఎ.వి.రాజు, కె.శ్రీనివాస్‌లు బయటికి తెచ్చారు. ఈ ప్రయత్నంలో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఒక సిలిండర్ నుంచి భారీగా వస్తున్న గ్యాస్లీక్ను అరికట్టేందుకు సమీపంలో ఉన్న మంచినీటి డ్రమ్ములో ముంచేశారు. అవగాహన లేకే అనర్థాలు విశాఖపట్నం : వంటగ్యాస్ వినియోగంపై అవగాహన లేకపోవడంతో తరచూ సిలిండర్లు పేలుళ్లు సంభవిస్తున్నాయి. గ్యాస్‌డీలర్లు సేఫ్టీ క్లినిక్‌లను ఎక్కడ నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. గృహావసరాలు, పార్లర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, శుభకార్యాల్లోనూ గ్యాస్ సిలిండర్లు వాడటం ఆనవాయితీ. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోనందున ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. వాస్తవానికి గ్యాస్‌డీలర్లు మెకానిక్‌లతో గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లేక తనిఖీలు జరుగుతున్న దాఖలాల్లేవు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే చాలామంది మహిళలు ఉదయం వంట ప్రారంభించే సమయంలో ఆన్ చేసిన రెగ్యులేటర్‌ను రాత్రి పూట పడుకునే ముందు ఆఫ్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమని చమురు సంస్థల అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలామంది నాసిరకం రబ్బర్ట్యూబ్లనే వాడుతుంటారు. దీంతో ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలోనే పగుళ్లు వస్తాయి. దీంతో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి రెగ్యులేటర్‌ను ఆన్‌లోనే వుంచడంవల్ల గ్యాస్ వృథా అయ్యే అవుతుంది. సురక్షా గ్యాస్ ట్యూబ్ ఎంతో భద్రంగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. చాలామంది అయిపోయిన సిలిండర్లను దొర్లించడం, వేడినీళ్లలో ఉంచడం చేస్తుంటారు. ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చేటప్పుడు వాల్వ్ ఓరింగ్ లేకపోతే గ్యాస్ లీకయ్యే ప్రమాదముంది కాబట్టి, ముందుగానే సిలిండర్ సీల్ తీసి బోయ్తో తనిఖీలు చేయించుకోవడం మంచిది. తీసుకోవలసిన జాగ్రత్తలు గ్యాస్ సిలిండర్ కన్నా స్టవ్ ఎక్కువ ఎత్తులో ఉండాలి. ఎప్పటికప్పుడు రెగ్యులేటర్‌ను ఆఫ్ చేస్తుండాలి. సురక్ష గ్యాస్ ట్యూబ్ (అయిదేళ్ల గ్యారంటీ)నే వాడాలి. తగినంత గాలి, వెలుతురు ఉండాలి. సిలిండర్ డెలివరీ సమయంలోనే సీల్ తీయించి తగిన తనిఖీలు చేయించుకోవాలి. వాల్వ్ ఓరింగ్ సక్రమంగా వుందో లేదో ముందుగానే చూసుకోవాలి. గ్యాస్ బాయ్ వద్ద ఉండే తూనిక యంత్రంతో బరువు చూసుకోవాలి. ఎక్స్పైర్ తేదీని సరిచూసుకోవాలి. ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నాక స్టవ్ వెలిగించాలి. {పమాదాలు జరిగినపుడు గ్యాస్ రశీదుపై ఎమర్జన్సీ టెలిఫోన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.