breaking news
Galla Ramachandra Naidu
-
అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు
రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్ ప్రస్తుతం వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఆ తర్వాత చైర్మన్గా జయదేవ్ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్గా అనుష్ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు జయదేవ్ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
గల్లా రామచంద్రనాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు
రేణిగుంట: అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడిపై రేణిగుంట పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన కేశవులు, పుదిపట్లకు చెందిన శ్రీరాములు శుక్రవారం కోడూరుకు వెళ్తుండగా కరకంబాడి రైల్వే గేటు వద్ద వీరికి ఎదురుగా వచ్చిన గల్లా రామచంద్రనాయుడు ‘‘సాధారణ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా.. మీ అంతుచూస్తాం’’ అంటూ తమను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించినట్లు కేశవులు, శ్రీరాములు రేణిగుంట డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఫిర్యాదుచేశారు. ఆ సమయంలో డీఎస్పీ శ్రీనివాస్ లేకపోవడంతో ఆయన సీసీ ప్రసాద్ రాజు ఫిర్యాదును స్వీకరించారు. సాయంత్రం డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామచంద్రారెడ్డి క్రైమ్ నంబర్ 138-14 కింద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.