breaking news
gajuladinne
-
ఆరుతడి పంటలకే నీరు!
– జీడీపీ కింద రబీలో 24,372 ఎకరాల ఆయకట్టు – ప్రాజెక్టులో 1.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ - 6, 500 ఎకరాలకే సాగు నీరు! – విడుదలకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్ కర్నూలు సిటీ: హంద్రీ నదిపై నిర్మించిన గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టు కింద ఆరు తడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ శనివారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అనుమతులు ఇచ్చారు. అయితే, 6500 ఎకరాలకు మాత్రమే ఆనీరు అందనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కింద కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి మండలాలకు చెందిన 24,372 ఎకరాల ఆయకట్టు, 21 గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో ఆయకట్టు లేదు. జీడీపీకి ఈ ఏడాది గతంలో ఎప్పుడు కూడా లేనంతా నీరు వచ్చి చేరింది. అయితే, తుంగభద్ర దిగువ కాలువ నీరు చివరి ఆయకట్టుకు రాకపోవడం, వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఎండుతున్న ఖరీఫ్ పంటలకు నీరు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఇంజినీర్లు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీరు ఇచ్చారు. అయితే, జీడీపీ కింద రబీ ఆయకట్టు 24,372 ఎకరాలకు నీరు వస్తుందనే అశతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు 6500 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు కలెక్టర్ అనుమతులు ఇవ్వడంతో వారికి దిక్కుతోచడం లేదు. పట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలు, అధికారులు ఖరీఫ్ పంటలు కాపాడామని చెప్పుకుంటున్న నేతలు, అధికారులు హంద్రీనీవా ద్వారా ఎక్కువ నీటిని తీసుకువచ్చి రబీలో సైతం ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే, ఆ దిశగా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పందికొన నుంచి హంద్రీనీవా నీరు జీడీపీకి రోజుకు 200 క్యుసెక్కుల చొప్పున వదులుతున్నారు. కానీ ప్రాజెక్టులోకి గత నెల 3 నుంచి 379 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి విడుదలను 500 క్యుసెక్కులకు పెంచడానికి అవకాశం ఉన్నా అధికారులు ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. 24,372 ఎకరాల ఆయకట్టుకు 2.5 టీఎంసీల నీరు అయితే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న 1.8 టీఎంసీల నీటికి హంద్రీనీవా నీటి విడుదలను పెంచితే పంటలకు పూర్తిసాయిలో నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. మనకేందుకులే అనే ధోరణిలో అధికారులు ఉండడంతో స్థిరీకరించిన ఆయకట్టులో 25 శాతానికి మాత్రమే నీరు అందనుంది. ఇచ్చే నీటిలో అధిక శాతం డిప్యూటీ సీఎం సొంత మండలమైన కృçష్ణగిరి మండలానికి వెళ్లే కుడి కాలువ కింద ఆయకట్టే అధికంగా ఉంది. ఎడమ కాలువ కింద పత్తికి ఒక తడి నీరు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది. కుడి కాలువకు ఇప్పటికే నీటిని విడుదల చేయగా ఎడమ కాలువకు నేడు విడుదల చేయనున్నారు. 6,500 ఎకరాలకే సాగునీరు – లక్ష్మన్‌కుమార్, జీడీపీ డీఈఈ జీడీపీ నుంచి రబీకి నీరు విడుదల చేసేందుకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. 6500 ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తాం. మిగతా ఆయకట్టుకు ఇప్పటికే ఖరీఫ్‌లో నీరు ఇచ్చాం. ఇవ్వని ఆయకట్టుకు మాత్రమే నీరు ఇవ్వనున్నాం. కుడి కాలువకు నీరు విడుదల చేశాం. -
నేటి నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల బంద్
- జీడీపీలో తగ్గిన నీటి నిల్వలు - ఎస్ఈ చంద్రశేఖర్ రావు గూడూరు రూరల్: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎల్లెల్సీకి బుధవారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు నీటిపారుదలశాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టులో నీటినిల్వ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్యాలకుర్తి సమీపంలోని కర్నూలు బ్రాంచ్ కెనాల్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లెల్సీ నీటిని పైపులైన్లు వేసుకుని వినియోగించినా, అలాంటి వాటిని ప్రోత్సహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలచౌర్యం జరగుతోందని ఫిర్యాదులు రావడంతో కాలువను పరిశీలించామన్నారు. ఆయన వెంట ఈఈ భాస్కర్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌కుమార్, ఏఈ విజయ్‌కుమార్, సూపర్వైజర్ రామేశ్వరరెడ్డి, లస్కర్ మహబూబ్‌బాష ఉన్నారు. -
గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గంలోని కృష్ణగిరి సమీపంలోని గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను ఆయన ఈరోజు మధ్యాహ్నం పరిశీలించనున్నారు. అనంతరం గత ఫిబ్రవరి 19న వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ నేత చేరుకులపాడు లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.