breaking news
Gadchiroli - chimur Lok Sabha constituency
-
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నాలుగు లక్షల మంది నోటా నొక్కారు
సాక్షి, ముంబై: తొలిసారిగా వినియోగంలోకి వచ్చిన ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (నోటా) మీటా బటన్‌ను లక్షలాది మంది వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం అందించిన వివరాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,23,180 మంది ఓటర్లు ఈ నోటా మీటాను వినియోగించుకున్నారు. రాజకీయ నేతలపై ఉన్న అసంతృప్తిని చూపించారు. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో అత్యధికంగా 24,488 మంది గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో నోటామీటాను వినియోగించి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అత్యల్పంగా బీడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం 2,323 మంది ఓటర్లు ఈ మీటాను వినియోగించుకున్నారు. అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అనేక మంది ప్రజలు ఈ మీటా కారణంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుస్తోంది. గతంలో ఈ మీటా అందుబాటులోకి రాకముందు అభ్యర్థులపై అసంతృప్తిగా ఉండే వీరు ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఓటు హక్కు వినియోగించడమే మానేశారు. అయితే ఈ మీటా అందుబాటులోకి రావడంతో వీరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుపడింది. నాలుగు నియోజకవర్గాల్లో 20వేలమందికిపైగా ఓటర్లు ఈ మీటాను వినియోగించుకున్నారు. 13 నియోజకవర్గాల్లో 10 వేల నుంచి 20 వేల వరకు ఓటర్లు నోటా బటన్‌ను నొక్కారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె పోటీ చేసిన పవార్ కుటుంబీకులకు పెట్టనికోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో కూడా 14,216 మంది ఈ నోటా మీటాను నొక్కారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పోటీ చేసిన షోలాపూర్‌లో 13,778 మంది ఓటర్లు నోటా నొక్కి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.