breaking news
in force
-
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్‌లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్‌లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
ఉధృతంగా స్వచ్ఛ రైల్వే
– మొక్కలు నాటడమే కాదు..పరిరక్షణకూ చర్యలు – దక్షిణ మధ్య రైల్వే జోన్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ తిరుపతి అర్బన్: రైల్వే శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ రైల్వే కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ డైరెక్టర్ కేహెచ్‌కే దొర వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ రైల్వే ప్రచార వారోత్సవాల్లో భాగంగా శనివారం తిరుపతి రైల్వే స్టేషన్ ఆవరణలో సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణతో కలసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దొర విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖాధికారులు మొక్కలు నాటడం చేస్తుంటారని, వాటి సంరక్షణకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వే పరిధిలోని వ్యాపార సంస్థల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు కూడా స్వచ్ఛ రైల్వేలో భాగస్వాములై తిరుపతి స్టేషన్‌ను ఆదర్శంగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్(ఎస్ఎంఆర్) సుభోద్‌మిత్ర, రైల్వే హెల్త్ ఆఫీసర్ వేణుగోపాల్, ఐపీఎఫ్ నాగార్జున రావు, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సురేంద్రనాయక్, చీఫ్ టీటీఐలు టీవీ రావు, రాజాబాబు, మోహన్‌రెడ్డి, రైల్వే ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి దోసపాటి చైతన్య శర్మ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ మధుసూదనరావు, ఎస్ఎంఆర్ కార్యాలయ అధికారి రాజు పాల్గొన్నారు.