breaking news
Floater plan
-
వాహనం నడిపినంతే బీమా!.. తగ్గనున్న బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: కార్తీక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఒక కారు, ఒక బైక్ ఉన్నాయి. నిత్యం కార్యాలయానికి కారులో వెళుతుంటాడు. ఇతర పనులకు బైక్ ఉపయోగిస్తాడు. దీంతో అతడు రెండింటికీ వేర్వేరు మోటారు బీమా పాలసీలను తీసుకుని ఉంటాడు. ఇకపై ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. పైగా ప్రీమియం కూడా తక్కువకే వస్తుంది. ఎందుకంటే అతడు బైక్ వాడేది చాలా తక్కువ. పైగా కార్యాలయం కూడా 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలా చూసుకుంటే కారు వినియోగం కూడా తక్కువే. పైగా ఏకకాలంలో రెండు వాహనాలను వినియోగించడం అసాధ్యం. అందుకే అతడికి గతంతో పోలిస్తే ఇక మీదట ప్రీమియం చాలావరకు తగ్గనుంది. ఈ తరహా సంస్కరణలకు వీలు కల్పిస్తూ.. మోటారు ఇన్సూరెన్స్ పాలసీలకు అధునాతన ఫీచర్లతో కూడిన యాడాన్‌లను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతించింది. కొత్త యాడాన్లు..: మోటారు ఓన్ డ్యామేజ్ (ఓడీ) అన్నది బేసిక్ మోటారు బీమా ప్లాన్. ఇందులో వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం ఏర్పడితే కవరేజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ‘పే యాజ్ యూ డ్రైవ్, పే హౌ యూ డ్రైవ్’ అనే కాన్సెప్ట్ తోడు కానుంది. వాహనాన్ని నడిపిన మేరకు, నడిపే తీరుకు అనుగుణంగా బీమా సంస్థ టెక్నాలజీ సాయంతో ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు తక్కువ దూరం నడిపేవారికి తక్కువ ప్రీమియం, ఎక్కువ దూరం నడిపేవారికి కొంచెం ఎక్కువ ప్రీమియం ఇలా అన్నమాట. లేదంటే తక్కువ దూరం, సురక్షిత డ్రైవింగ్ విధానాన్ని అనుసరించే వారికి తక్కువ ప్రీమియానికే మరింత కవరేజీ లభించొచ్చు. అలాగే, ఒకే వాహనదారుడికి ఒకటికి మించిన వాహనాలు ఉంటే అన్నింటికీ కలిపి ఫ్లోటర్ పాలసీ జారీ చేసేందుకు కూడా ఐఆర్డీఏఐ అనుమతించింది. -
మీ ఆరోగ్యం విలువెంత?
ఎంత బీమా అవసరమో తెలుసుకోండి తీసుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఒకవైపు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తుంటే.. మరొకవైపు ఎప్పటి నుంచో ఉన్నవి మరింతగా విస్తరిస్తూ వాటి తడాఖా చూపిస్తున్నాయి. రోగం వచ్చి ప్రాణం బాగులేక ఆసుపత్రికి వెళితే.. అక్కడ వారి బిల్లులు చూశాక గుండె గుభేలుమంటోంది. ఇలాంటి సమయాల్లో అందరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. దురదృష్టవశాత్తూ ఇది కొందరికే ఉంటోంది. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లుగా.. దీనికి కూడా చాలా కారణాలున్నాయి. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా తీసుకుని తీరాల్సిందే. అపుడేమైనా జరగరానిది జరిగితే అది మనకు ఆర్థికంగా కొంత బాసటగా నిలుస్తుంది. మన కుటుంబానికి అండగా ఉంటుంది. మరి ఎంత మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. దీనికి సమాధానమే ఈ కథనం. ప్రీమియం చెల్లింపే ఆధారం... మార్కెట్లో పలు బీమా సంస్థలున్నాయి. అవి అనేక రకాల పాలసీలను విక్రయిస్తున్నాయి. అందుకే మన అవసరాలకు, ప్రాధాన్యాలకు అనువైన పాలసీలను ఎంచుకోవాలి. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే అంశం.. మీరు ఎంత మేరకు ప్రీమియం చెల్లించగలరనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ముందుగా అందుబాటు ప్రీమియం చెల్లింపుల్లో అనువైన పాలసీలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అంతేకానీ ఆరోగ్య బీమా తీసుకోవడంలో ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. స్వల్ప బీమా కవరేజ్కైనా సరే బీమాను వెంటనే తీసుకోవాలి. తర్వాత కావాల్సి వస్తే కవరేజ్‌ను పెంచుకోవచ్చు. చిన్న వయసులోనే బీమా ఎంత త్వరగా బీమా తీసుకుంటే అంత మంచిది. చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. అప్పుడు బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. గత మూడేళ్లలో హాస్పిటల్ ఖర్చులకు మనం ఎంత వెచ్చించామో ఒకసారి లెక్కించాలి. వార్షిక వేతనంలో సగభాగాన్ని, మూడేళ్లలో అయిన హాస్పిటల్ ఖర్చులను కలిపితే వచ్చే మొత్తానికి సమానంగా మన బీమా కవరేజ్ ఉండాలి. ఉదాహరణకు రాము అనే వ్యక్తికి వార్షిక వేతనం రూ. 5,00,000గా ఉంది. అతని మూడేళ్ల వైద్య ఖర్చులు రూ.50,000గా ఉన్నాయి. అప్పుడు రాము బీమా కవరేజ్ రూ.3,00,000గా ఉండాలి. ఇక్కడ హాస్పిటల్‌ను బట్టి కవరేజ్ మొత్తం మారుతుంది. అలాగే భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా కవరేజ్ తీసుకోవాలనుకుంటే.. అప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఎంచుకోవడం మంచిది. కుటుంబంలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత పాలసీ తీసుకోవడం కన్నా అందరికీ కలిసి ఫ్లోటర్ ప్లాన్‌ని తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. ఇక కంపెనీలు కూడా ఉద్యోగులకు ఆరోగ్య బీమాను ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇవి సమగ్రమైన కవరేజ్‌ను అందిస్తాయో లేదో తెలియదు. వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదు అనుకుంటే.. టాప్–అప్ ప్లాన్స్‌ను తీసుకోవాలి. ఇవి అదనపు కవరేజ్‌ను అందిస్తాయి. కొత్త పాలసీ తీసుకోవడానికి లేదా ఉన్న పాలసీని అప్‌గ్రేడ్ చేసుకోవడానికయ్యే ఖర్చు కన్నా టాప్–అప్ ప్లాన్స్ చౌకే. ఈ విషయాలు మరవొద్దు ♦ రీయింబర్స్మెంట్ పాలసీ కన్నా క్యాష్‌లెస్ పాలసీని తీసుకోవడానికి మొగ్గుచూపండి. అప్పుడే వైద్యానికి డబ్బు ముందు చెల్లించి, దాన్ని తిరిగి తర్వాత తీసుకోవాల్సిన పని తప్పుతుంది. ♦ హాస్పిటల్లో రూమ్ అద్దె ఖర్చు, డాక్టర్ ఫీజు, మందులకయ్యే వ్యయం వంటివి పాలసీ కవరేజ్‌లో భాగమో కాదో తెలుసుకోండి. అన్ని పాలసీలు అన్ని వ్యయాలను భరించవనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ♦ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్య హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలా? లేదా ఏ హాస్పిటల్లో చేయిం చుకున్నా రీయింబర్స్మెంట్స్ చెల్లిస్తారా? అనే అంశాలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి.