లిక్కర్ బాటిళ్లు దొరికినకాడికి దోచుకున్నారు
ధనెరా, గుజరాత్: మద్యం దొరక్క ఇబ్బంది పడుతున్న మందుబాబులు అంది వచ్చిన అవకాశాన్ని చేతినిండా ఉపయోగించుకున్నారు. ఎడారిలో నీటి చుక్క దొరికినట్టు మద్యపాన నిషేదం ఉన్న గుజరాత్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో మందు బాటిళ్లు పడిఉన్నాయన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి అందినకాడికి దోచుకు పోయారు. మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ మినీ ట్రక్ సోమవారం బోల్తా పడింది. ఈ సంఘటన బనాస్కంటా జిల్లాలోని సమర్ వాడా గ్రామంలో చోటకు చేసుకుంది. విషయం క్షణాల్లోనే గ్రామంలోని మందుబాబుల చెవిలో పడింది. ఇంకేముంది చేతిలో పట్టిన వరకు ఎన్ని చిక్కితే అన్ని పట్టుకొని అక్కడనుంచి ఉడాయించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూసే సరికి పగిలి పోయిన బాటిళ్లు ఖాళీ కాటన్ డబ్బాలు తప్ప ఏమీ మిగల్చలేదు. గుజరాత్లో మద్యం సేవించడం, అమ్మడం పై నిషేదం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు అక్రమంగా మద్యం అమ్మకాలు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి హోం డెలివరీ అవకాశాన్ని కూడా వినియోగదారులకు కల్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు సమీపంలోనే వారి అండతో ఓపెన్‌గానే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.