breaking news
first verdict
-
అమరావతిలో హైకోర్టు తొలి తీర్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తొలి తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజీ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మద్యం గోడౌన్లలో 40 శాతం మంది హమాలీలను కొత్త గోడౌన్లలో పనిచేసేందుకు అనుమతించాలంటూ హమాలీల సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం గమనార్హం. ఇదీ నేపథ్యం విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్ మద్యం గోడౌన్ నిర్వహించేది. ఇందులో పలువురు హమాలీలు పనిచేసేవారు. అనంతరం నిడమానూరులో కొత్త మద్యం గోడౌన్‌ను ఏపీబీసీఎల్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి గోడౌన్లో పనిచేస్తున్న హమాలీల్లో 40 శాతం మందిని నిడమానూరు గోడౌన్లో పనిచేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ హమాలీల సంఘం ఏపీబీసీఎల్‌కు వినతిపత్రం సమర్పించింది. అధికారులు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ యూనియన్ అధ్యక్షుడు ఎ.సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై సతీష్ దాఖలు చేసిన అప్పీల్ తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గోడౌన్లో 40 శాతం మంది హమాలీలు పనిచేసేందుకు అనుమతిస్తూ గతంలో సర్కులర్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ తెలిపారు. అయితే ఈ సర్కులర్‌ను కేవలం మానవతా దృక్పథంతోనే ఇచ్చామని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది నివేదించారు. స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగి శాంతిభద్రతల సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యూనియన్ తరఫున సతీష్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. -
రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం
సాక్షి, ముంబై: ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ చట్టం రెరా (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) పరిధిలో తొలి తీర్పు వెలుపడింది. అదీ గృహకొనుగోలుదారుకు అనుకూలంగా ఈ తీర్పు వెలుడింది. అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనం చేయకపోవడంతో బాధితుడు ఆన్లైన్ ద్వారా రెరాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా బిల్డర్‌ను రెరా ఆదేశించింది. 2016నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని బిల్డర్ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీనికి తోడు ఆయన చెల్లించిన అడ్వాన్స్ సొమ్మను చెల్లించడానికి సదరు బిల్డర్ నిరాకరించారు. ఈ క్రమంలో బాధితుడు రెరాను ఆశ్రయించారు. రూ.5000 చెల్లింపు ద్వారా మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) వెబ్సైట్ లో ఫిర్యాదుదారు కేసు నమోదు చేశారు. దీన్ని విచారించిన రెరా గృహ కొనుగోలుదారునికి రూ. 26.15 లక్షలను తిరిగి చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ముంబైకి చెందిన బిల్డర్‌కు ఈ ఆదేశాలు జారీ చేసింది. గృహ-కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సంబంధిత చట్టాలు అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలని మహా రెరా చైర్మన్ గౌతం ఛటర్జీ మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా జైపీ ఇన్ ఫ్రాటెక్ కేసులు ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డెలివరీలో జాప్యానికి సంబంధించి ఇప్పటివరకు తమకు 98 ఫిర్యాదులను అందుకున్నామన్నారు. కారణం ఏదైనా కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయితే వినియోగదారులే నష్టపోతారని ఛటర్జీ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ ఆదేశాలు జారీ అయినే వెంటనే డెవలపర్ తనుకు చెక్‌ను అందించారంటూ ఫిర్యాదు దారు సంతోషం వ్యక్తం చేశారు.