breaking news
Fierce attacks
-
ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
కీవ్: రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలే లక్ష్యంగా శనివారం రాత్రి చేపట్టిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం క్షతగాత్రులయ్యారు. మొత్తం 69 క్షిపణులు, 298 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. ఇరాన్ డిజైన్ చేసిన షహీద్ రకం డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయంది. మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఒకే రాత్రిలో రష్యా ఇంత భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారని తెలిపింది. శుక్రవారం మాదిరిగానే శనివారం రాత్రంతా కీవ్ వాసులు కంటిపై కునుకు లేకుండా గడిపారు. సైరన్ మోతలు, పేలుళ్లతో రాజధాని దద్దరిల్లింది. క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడి నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో మంటలు చెలరేగాయి. కీవ్‌లో అత్యధికంగా నలుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారని నగర భద్రతా విభాగం తెలిపింది. తర్వాత, జిటోమిర్ ప్రాంతంలో ముగ్గురు బాలలు సహా 12 మంది క్షతగాత్రులయ్యారు. సుమీ, మైకోలైవ్, ఖ్మెల్నిట్స్కీ, చరి్నహివ్, ఒడెసా, టెర్నోపిల్, పొల్టావా, నీప్రో, చెర్కసీ ప్రాంతాలపైనా దాడులు జరిగాయి. కీవ్ శివారులోని మర్ఖాలివ్స్కాలో పలు నివాసాలు మంటల్లో కాలిబుగ్గయ్యాయి. దాడుల అనంతరం మరో గ్రామం మొత్తం పొగలు, మంటలతో నిండిపోయింది. ఇక్కడ చోటుచేసుకున్న విధ్వంసం మరియుపోల్, బాఖ్ముత్లను తలపించిందని స్థానికుడొకరు పేర్కొన్నారు. రష్యా క్షిపణులు, డ్రోన్లతో 30కి పైగా నగరాలు, గ్రామాల్లో విధ్వంసం జరిగిందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ఉద్దేశ పూర్వకంగా సామాన్యులపై దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆంక్షలు విధించడం వంటి తీవ్రమైన ఒత్తిడి తేకుండా రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేయలేమన్నారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్ శనివారం రాత్రి ప్రయోగించిన 110 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది.మూడో విడత ఖైదీల మార్పిడి రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య మూడో విడత యుద్ధ ఖైదీల మారి్పడి కొనసాగింది. ఒకవైపు భీకర దాడులు కొనసాగుతుండగానే ఆదివారం మరో 303 మంది ఖైదీలను ఇచి్చపుచ్చుకున్నామని ఇరుదేశాలు ప్రకటించాయి. తుర్కియేలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి విడతలో శుక్రవారం 390 మందిని, శనివారం మరో 307 మందిని పరస్పరం మార్చుకోవడం తెల్సిందే. వీరిలో వివిధ విభాగాలకు చెందిన సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. మూడేళ్లలో మార్చుకున్న మొత్తం యుద్ధ ఖైదీల కంటే ఈ మూడు రోజుల్లో పరస్పరం అప్పగించుకున్న యుద్ధ ఖైదీల సంఖ్యే ఎక్కువని సమాచారం. -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
Israel-Hamas war: గాజా రక్తసిక్తం
ఖాన్ యూనిస్/రఫా/జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతోపాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్టుమెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్‌ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్‌తోపాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికిపైగానే మరణించినట్లు, వందలాది మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమాస్ చెరలో 240 మంది బందీలు ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 8,700 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని, 22,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 122 మంది పాలస్తీనియన్లు చనిపోయారని వెల్లడించింది. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. బందీగా ఉన్న ఒక ఇజ్రాయెల్ మహిళా జవాన్‌ను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు విడిపించాయి. 34 మంది జర్నలిస్టులు బలి ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో 34 మంది జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పాలస్తీనియన్ జర్నలిస్టులు దారుణ హత్యలకు గురవుతున్నారని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని పేర్కొంది. సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు మకాం వేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు మృతి గాజాలో హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఘర్షణలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు హలెల్ సోలోమాన్ (20) బుధవారం మృతిచెందాడు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని డొమోనా పట్టణానికి చెందిన సోలోమాన్ హమాస్ మిలిటెంట్లపై వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతిపట్ల డిమోనా మేయర్ సంతాపం ప్రకటించారు. డిమోనా పట్టణాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. భారత్ నుంచి వలస వచి్చన యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. గాజాలో మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. ఇంటర్నెట్, ఫోన్ సేవలకు అంతరాయం గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బుధవారం కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సాయంత్రానికల్లా పునరుద్ధరించారు. ఇంటర్నెట్, ఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతుండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులు ఆపేయండి గాజాలో సాధారణ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని బుధవారం ఆస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నేరాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయాలని, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు. -
ఈఫిల్ టవర్‌కు రక్షణగా గాజు గోడ
పారిస్: ఈఫిల్ టవర్‌పై దాడులను నిరోధించేందుకు దాని చుట్టూ 2.5 మీటర్ల ఎత్తున్న గాజు గోడను నిర్మించనున్నారు. గతేడాది యూరో ఫుట్‌బాల్ టోర్నీ సందర్భంగా ఈఫిల్ టవర్‌కు రక్షణగా ఏర్పర్చిన లోహపు కంచెల స్థానంలో ఈ గోడను నిర్మిస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడుల నేపథ్యంలో ఈఫిల్ టవర్ సహా ఇతర చారిత్రక కట్టడాల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు.