breaking news
fess reimbursement
-
సదువులు.. సందిగ్ధం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందని ద్రాక్షగా మారుతోంది. గత విద్యా సంవత్సరం బకాయిలు ఇంకా విడుదల కాకపోవడంతో వారి చదువులు సందిగ్ధంలో పడ్డాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రూ.92 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల యాజమాన్యాలు కూడా నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగిడినా గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నేటికీ విడుదల కాకపోవడంతో కొన్ని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల నిరుపేదల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆసరాగా నిలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందన్న భరోసాతోనే చాలామంది విద్యార్థులు ఉన్నత చదవులు చదివేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, డిప్లమా, డిగ్రీ, పీజీ విద్యనభ్యసించిన విద్యార్థులంతా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్ష మందికి పైగా విద్యార్థులను సర్కార్ అర్హులుగా తేల్చింది. అయితే వీరిలో 49,548 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.92 కోట్ల నిధులు ఫీజు రీయింబర్స్ కాలేదు. ఫీజు రీయింబర్స్ కాని విద్యార్థుల్లో బీసీ విద్యార్థులు 26,000 మంది, ఈబీసీ 3,578 మంది, ఎస్సీలు 12,000 మంది, ఎస్టీ విద్యార్థులు 6,000 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిసే లోపే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కావాలి. కానీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ పథకం విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో తమకు ఫీజు వస్తుందో..? లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఫైనలియర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలకు వెళ్లాలన్నా, ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హత పత్రాలు తీసుకోవాలన్నా ముందుగా ఫీజు మొత్తం చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఫీజు కడితేనే అర్హత పత్రాలు ఇస్తామని చెబుతుండడంతో విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక, అంత డబ్బు సొంతంగా కట్టలేక సతమతమవుతున్నారు. అంతా అగమ్యగోచరం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై భరోసాతోనే మారుమూల గ్రామాల్లోని నిరుపేదల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరి విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉన్నట్టుండి ఫీజు రీయింబర్స్ చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులను అడిగితే త్వరలో వస్తాయని సమాధానం చెబుతున్నారే కానీ, కచ్చితమైన సమయం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు మాత్రం తమను ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్ష రాసి సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. నూతన విధానం ఎప్పుడు..? తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాష్ర్ట విద్యార్థులకే ఫీజు పథకం వర్తింపజేసేలా కసరత్తు చేస్తోంది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా, మరోవైపు అడ్మిషన్ల సమయం సమీపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ అభ్యసిస్తున్న విద్యార్థులు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నట్లు సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. 1956 ముందు విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణలో నివాసం ఉన్నట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేయాలనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఇది అమలైనా ఈ కేటగిరిలో జిల్లాలో కేవలం కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతా అర్హులైన విద్యార్థులు అందరికీ ఫీజు విడుదలవుతుందని అధికారులు పేర్కొంటున్నా, విద్యార్థులు మాత్రం ఫీజు డబ్బుల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
‘పాలిటెక్నిక్’ విద్యార్థుల పరేషాన్
కమాన్‌చౌరస్తా: పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ నిలిచిపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పదిహేను రోజులు గడుస్తున్నా కళాశాలల్లో సీట్లు కేటాయించకపోవడంతో ఇంటర్మీడియెట్ చదువుపై దృష్టి సారిస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అధికారులు ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో సుమారు 4,806 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అనంతరం ఆప్షన్లు కూడా ఎంచుకున్నారు. ఈప్రక్రియ ముగిసి పదిహేను రోజులు గడిచిపోతున్నా విద్యార్థులకు సీట్లు కేటాయించడంలేదు. ఆప్షన్లు ఎంచుకున్న మూడు రోజుల్లో సీట్లు కేటాయించాల్సి ఉన్నా ఇంత వరకు కేటాయించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25వ తేదీన సీట్లు కేటాయిస్తామన్న అధికారులు తిరిగి 30వ తేదీ లోగా ప్రవేశాలు కల్పిస్తామని ఠీఠీఠీ.ఞౌడఛ్ఛ్టి.జీఛి.జీలో పేర్కొన్నారు. అయినా అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదివేందుకు ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. తొలగని సందిగ్ధత ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇంకా సందిగ్ధం తొలగకపోవడంతో సీట్ల కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కేవలం తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే దిశగా అధికారులతో చర్చలు జరిపారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించడంలేదు. 1956కు ముందు నుంచి తెలంగాణలో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అధికారులు సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు సీట్ల భర్తీ లేనట్టేనని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అన్నీ ఆటంకాలే పాలీసెట్ కౌన్సెంలింగ్ ప్రక్రియ మొదలు కళాశాలల్లో ప్రవేశాల వరకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి గత సంవత్సరం స్క్రాచ్ కార్డు ద్వారా ఆప్షన్లు ఎంచుకునే పద్ధతి ఉండేది. విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల మాయలో పడకుండా ప్రభుత్వం ఈసారి అభ్యర్థుల సెల్ ఫోన్‌కు పాస్వర్డ్ ఇతర సమాచారాన్ని పంపించే పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలోనూ ఇబ్బందులు తలెత్తాయి. కొందరికి సమాచారం సకాలంలో అందకపోగా, మరి కొందరికి ఆలస్యంగా, ఇంకొందరికి సమాచారమే రాకపోవడంతో విద్యార్థులు అయోమయం చెందారు. నానా తంటాలు పడి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయం రాగానే సీట్లు కేటాయిస్తాం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించగానే ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ఎప్పటికప్పుడు సమాచారమిస్తాం. - సాంబయ్య, పాలీసెట్ జిల్లా క్యాంప్ ఆఫీసర్