breaking news
female student
-
భద్రత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కోసిగి/తిరుపతి తుడా: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మార్గదర్శకాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా చీకటి పడితే చాలాచోట్ల హాస్టల్ ప్రాంగణాలు మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ఎవరు పడితే వారు యథేచ్ఛగా హాస్టళ్లలోకి వచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. కనీస సౌకర్యాలు, భద్రత ఎండమావిగా మారింది. గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల గుంటూరు నగరంలో రెండు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో దుమారం రేగింది. అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మెమోలు ఇవ్వడంతో పాటు చిన్న స్థాయి సిబ్బందిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నగరంలోని ఒక ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్లో ఒక విద్యార్థినిని ఓ ఆకతాయి మాయామాటలు చెప్పి ఒక రోజంతా బయటకు తీసుకువెళ్లాడు. సదరు విద్యార్థిని కనపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. స్టాల్ గరŠల్స్ కాంపౌండ్‌లోని బీసీ ప్రీ మెట్రిక్ (చిన్న పిల్లల) హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను ఇద్దరు ఆకతాయిలు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లారు. దీనిపై తోటి విద్యార్థిని వార్డెన్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. పట్టించుకోవాల్సిన వార్డెన్‌పై చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో గతంలో పనిచేసిన నగరపాలెం సీఐ వార్డెన్‌ను, వార్డెన్ డ్రైవర్‌ను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు భారీ మొత్తంలో సదరు సీఐ నగదు తీసుకున్నట్లు విమర్శలు వినిపించాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా ఇలాంటే సంఘటనలు జరుగుతున్నప్పటికి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. ఇదంతా హాస్టల్ సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో మహిళ వార్డెన్స్తో పాటు వారి భర్తలు కూడా హాస్టళ్లకు వస్తుంటారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేరుగా బాలికల రూముల్లోకి వార్డెన్ల భర్తలు వెళుతుంటారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సంక్షేమ హాస్టళ్ల అధికారులు మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు సోలార్ ఫెన్సింగ్ లేదు. సీసీ కెమెరాలు లేవు. హాస్టల్‌కు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. అని గమనించే వారే లేరు. చాలా చోట్ల హాస్టల్స్‌కు కాపలా ఉన్న సిబ్బంది ఆకతాయిలతో కుమ్మక్కు కావడంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో పిల్లలను ఉంచలేం..» కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి అత్యధికంగా ప్రజలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. తమ పిల్లలను హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు హాస్టల్లో భద్రత కరువైంది. కోసిగిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను పాత సంతమార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 210 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ చుట్టూ కంపు కొడుతోంది. హాస్టల్ ఒకవైపు మహిళల బహిర్భూమి ప్రాంతం ఉంది. మరో వైపు మురుగు నీరు నిల్వ ఉంది. ముందు భాగంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పందులు గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు హాస్టల్ ప్రాంతంలోనే మద్యం తాగి.. గ్లాసులు, సీసాలు అక్కడే పడేస్తున్నారు. పగటి పూట కోతుల బెడద ఉంది. కిటికీలకు ఉన్న గ్లాసు తలుపులన్నీ ధ్వంసమైపోయాయి. ఇద్దరికి గాను ఒక వార్డెన్ మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఈ హాస్టల్లో తమ పిల్లలను ఉంచలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు చదువు మాన్పించి వెంట తీసుకెళ్లారు. »తిరుపతి జిల్లాలో నాలుగు నెలలుగా గురుకుల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహారం తిని 23 మంది విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోందిమా సొంత గ్రామం సోమలగూడురు. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోంది. చుట్టూ చెత్తా చెదారమే. కాంపౌండ్ వాల్ లేక పోవడంతో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. ఎవరెంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు. – వీరేంద్ర, 9వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాభద్రత కల్పించాలిరాత్రిళ్లు చలి గాలి వీస్తోంది. హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదు. హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితే బావుంటుంది. హాస్టల్ కిటికీల తలుపులు పగిలి పోవడంతో దుర్వాసన వస్తోంది. ముఖ్యంగా భద్రత కల్పించాలి. – శ్రీధర్, 8వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాసంక్షోభ హాస్టళ్లుపేద విద్యార్థుల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యంసాక్షి, అమరావతి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను కూటమి సర్కారు గాలికి వదిలేసింది. తమకు సంబంధం లేదన్నట్లు బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. పేద పిల్లలు ఉండే వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 5 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. విద్యార్థుల భద్రతకు గత ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షోభ నివారణ వంటి పటిష్ట చర్యల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్ఓపీ అమలు చేసింది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ గతేడాది జూలైలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని 3,783 వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. తద్వారా వీటిలో చదువుతున్న సుమారు 6.40 లక్షల మంది పేద విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు సంబంధించిన జాగ్రత్తలు, భోజనం, మంచి నీరు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో సందర్శించి వాటి నిర్వహణను పర్యవేక్షించి చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలను అమలు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవడంతోపాటు సంక్షోభ నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. కాగా, రాష్ట్రంలో సుమారు 900 పైగా ఆశ్రమాలు, ట్రస్ట్ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో మేం నిర్వహించలేమంటూ (నాట్ విల్లింగ్) ఇచ్చిన సంస్థలు 65 నుంచి 70 శాతం ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు.. మేం ట్రస్ట్, ఆశ్రమాలు నడపడం లేదంటూ బుకాయించి, అనధికారికంగా వాటిని నిర్వహిస్తూ దేశ, విదేశీ దాతల నుంచి విరాళాలు దండుకుంటున్నవి అనేకం. ప్రతి నెలా వీటిని తనిఖీ చేసి నిర్వహణ లోపాలు, అనుమతి ధ్రువపత్రాలు వంటి వాటిని పరిశీలించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. -
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య
పాట్నా: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నాలో ఆత్మహత్యకు పాల్పడింది. బిహ్తాలో క్యాంపస్‌లోని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సూసైడ్ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని విద్యార్ధినిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని, ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్ధిని మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. మరోవైపు విద్యార్థి మరణవార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
విద్యార్థినితో టాయిలెట్ కడిగించిన టీచర్.. వైరల్
సాక్షి, తిరువల్లూర్(తమిళనాడు): విద్యార్థినితో టాయిలెట్ కడిగించిన టీచర్ ఉదంతం తమిళనాట కలకలం రేపింది. తిరువళ్లూర్‌లోని ఆర్ఎం జైన్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆరు నుంచి పదో తరగతి వరకు దాదాపు వెయ్యిమంది బాలికలు చదువుకుంటున్న ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినిని టాయిలెట్ కడగాలంటూ టీచర్ అదేశించింది. ఆపై విద్యార్థిని టాయిలెట్ కడుగుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఇందులో ఓ విద్యార్థిని చేతితో బట్ట ముక్కను పట్టుకుని తుడుస్తున్నట్లు, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు ఉంది. పక్కనే ఉన్న మరో బాలికతో నీరు తీసుకురావాలని అడగ్గా ఆమె తీసుకువచ్చిన నీటితో టాయిలెట్ కడుగుతున్నట్లుగా ఉంది. దీనిపై సదరు టీచరు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టి, సదరు బాలికలతో మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కూడా ప్రశ్నించారు. ఆ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని డీఈవో తెలిపారు. -
రూ.70 దొంగిలించిందనే అనుమానంతో అకృత్యం
భోపాల్ : దొంగతనం చేసిందనే అనుమానాంతో.. తరగతి గదిలోనే విద్యార్థిని వివస్త్రను చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్ పాఠశాలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. దమోహ్‌లోని రాణి దుర్గావతి హై స్కూల్లో పదో తరగతి బాలికల విభాగంలో దొంగతనం జరిగింది. ఒక బాలిక 70 రూపాయలను దొంగిలించిందనే అనుమానాన్ని బాధితురాలిపై తోటి విద్యార్థిని వ్యక్తం చేసింది. దీంతో మొదట బాధితురాలి పుస్తకాల బ్యాగును సోదా చేశారు. అందులో డబ్బులు దొరకకపోవడంతో.. బాధితురాలి బట్టలు విప్పించి వెదకమని టీచర్ చెప్పారు. తరగతి గదిలో అందరిముందు జరిగిన అవమానాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు వివరించింది. ఆగ్రహించిన తల్లిందండ్రులు పాఠశాల యాజమాన్యానికి, జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారులు.. పాఠశాలకు నోటీస్ జారీ చేయడంతో పాటు.. సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఇఫ్లూలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లో బీఈడీ చదువుతున్న ఒడిశాకు చెందిన ఉషా సాహూ (22) అనే విద్యార్థిని సోమవారం రాత్రి 7.30 గంటలకు హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. హాస్టల్లో ఉషాసాహూ సహచర విద్యార్థినులు మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉషాను కూడా రమ్మని ఆహ్వానించగా ఆమె తాను రాలేనని చెప్పి హాస్టల్లోనే ఉండిపోయినట్లు వారు తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి హాస్టల్‌కు వచ్చిన సహచర విద్యార్థినులకు.. గదిలో ఉషాసాహూ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. విద్యార్థులంతా కలిసి ఆమెను కిందకు దించి, చికిత్స కోసం వెంటనే నల్లకుంటలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇఫ్లూలో గత నాలుగేళ్లుగా ఆరుగురు విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాదిలోనే ఉషాసాహూతో కలిసి ముగ్గురు బలవన్మరణానికి గురయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన వర్సిటీ యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. అధ్యాపకుల వేధింపుల వల్లే..? ఇఫ్లూ అధికారుల తీరువల్లే విద్యార్థులు పిట్ట్టల్లా రాలి పోతున్నారని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నాలుగు నెలల కిందట బీఈడీ కోర్సులో చేరిన ఒడిశాకు చెందిన ఉషా ఎంతో చురుకైన విద్యార్థి అని వారు పేర్కొన్నారు. అధ్యాపకులు వివిధ కారణాలతో ఆమెను వేధించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని వారు ధ్వజమెత్తారు. అధ్యాపకుల వేధింపులు భరించలేక మూడేళ్ళ కిందట ఓ గిరిజన విద్యార్థిని సైతం ఆత్మహత్యకు యత్నించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు, అనవసరపు నిర్బంధాలు, ఎంత చదివినా ఫెయిల్ చేయడం లేదా మార్కులు తక్కువ వేయడం వల్ల మానసిక వేదనతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని శంకర్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఉషాసాహూ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల వేధింపులకు పాల్పడి, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.