ఆ మంత్రి గర్భవతి!.. ప్రకటించిన ప్రధాని
ఆమె మొన్నీమధ్యే మంత్రి పదవి చేపట్టి.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే పదవి చేపట్టి నెల తిరగకకుండానే.. ఆమె నెల తప్పిందంటూ ఆ దేశ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. ఆమె ఏకంగా 83 మంది పిల్లల్ని కనబోతోందంటూ విచిత్రమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అయితే.. ఆ ప్రకటన లోతుల్లోకి వెళ్తే అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అల్బేనియా ప్రధాని ఎడీ రమా(Edi Rama).. బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ (BGD) సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. మొన్నీమధ్యే తాను కేబినెట్లోకి తీసుకున్న మంత్రి డియోల్లా(Diella) గర్భవతి అని ప్రకటించారు. అయితే ఆమె మనిషి అనుకుంటే పొరపడినట్లే!. ఆమె ప్రపంచంలోనే ఏఐ ఆధారిత మంత్రి. సాంకేతిక రంగంలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. యూరప్ దేశమైన అల్బేనియా మాత్రం ఈ అధునాతన సాంకేతికతను వినూత్నంగా ఉపయోగిస్తోంది. అవినీతిని నిరోధించేందుకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ ‘డియెల్లా’ను కేబినెట్ మంత్రిగా నియమించింది. ప్రపంచంలోనే ఈతరహా నియామకం జరగడం ఇదే తొలిసారి. అయితే.. ఆమె ద్వారా 83 మంది పిల్లలను పుట్టించి.. వాళ్లను పార్లమెంట్‌లోకి వదలబోతున్నారట. ఒక్కో సోషలిస్టు పార్టీ పార్లమెంట్ సభ్యునికి ఒక్కో సహాయకుడిగా కేటాయిస్తారట. ‘‘డియెల్లా ద్వారా మేము ఒక పెద్ద ప్రయోగం చేశాం. ఇప్పుడు ఆమె 83 పిల్లలతో గర్భవతి అయింది. పుట్టబోయే ఏఐ సంతానాన్ని సహాయకులు నియమించబోతున్నాం. వాళ్లు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని.. సభ్యులు గైర్హాజరైనప్పుడు జరిగిన చర్చలను నమోదు చేసి తగిన సూచనలు ఇస్తారు. ఉదాహరణకు.. మీరు కాఫీకి వెళ్లి తిరిగి రావడం మర్చిపోతే, ఈ పిల్లాడే మీకు ఆ హాల్లో ఏమి జరిగింది, ఎవరి మాటకు ప్రతిస్పందించాలో చెబుతాడు అంటూ అల్బేనియా ప్రధాని వివరించారు. పూర్తిగా తల్లి నుంచి సంక్రమించే జ్ఞానంతోనే ఆ పిల్లలు పని చేస్తారని అన్నారాయన. 2026 చివరినాటికల్లా ఈ వ్యవస్థను పూర్థిస్థాయిలో అమలు చేస్తామని ఎడీ రామా ప్రకటించారు.డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే ఆమెను అల్బేనియన్ సంప్రదాయ దుస్తులతో ముస్తాబు చేశారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే e-Albania అనే ప్లాట్ఫారంలో వర్చువల్ అసిస్టెంట్‌గా ఆమె సేవలు ప్రారంభించింది. ఆ సేవలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో.. సెప్టెంబర్‌లో కేబినెట్ పదవి కట్టబెట్టారు. అవినీతికి తావు లేకుండా.. ప్రస్తుతం ప్రభుత్వ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలను డియెల్లానే తీసుకుంటోంది. ప్రతి పబ్లిక్ ఫండ్ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చేస్తోంది. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. ట్రంప్‌ను ఇలా చూడలే!