breaking news
Fedal castro
-
కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పటి వరకు 186 దేశాలకు విస్తరించిన ఈ మహ్మమారిని.. ఎదర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకూ వైరస్ సోకడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనగా మారింది. ఈ క్రమంలో అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న అతిచిన్న దేశం క్యూబా కరోనా బాధిత దేశాలకు అండగా నిలుస్తోంది. పక్కనున్న శత్రుదేశం అమెరికాను కరోనా పీడిస్తున్న తరుణంలో ఆ దేశానికి వైద్యులను పంపి ఆదుకుంటోంది. యూఎస్‌కే కాదు క్యూబా వైద్యులు నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు సేవలందిస్తున్నారు. క్యూబా.. ఒక చిన్న దేశం.. మన దేశంలో ఓ జిల్లా అంత విస్తీర్ణంలో ఉంటుంది. కేవలం కోటి మంది జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే డాక్టర్ల కార్ఖానాగా వెలుగొందుతోంది. జనాభా పరంగా చూస్తే హైదరాబాద్ కంటే తక్కువ జనాభాగల దేశం. కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో క్యూబా వైద్యులు అనేక దేశాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. క్యూబాపై అనేక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఛీదరించుకునే అమెరికాలో, ఇటలీలో కరోనా వైద్య సేవల్లో క్యూబన్ డాక్టర్లు నిమగ్నమయ్యారు. కరోనా కారణంగా ఆరోగ్యం అనేది గాలిలో దీపమైపోయిన వేళ.. భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపిస్తున్న ఇలాంటి సమయంలో క్యూబా మన కళ్ల ముందు కనిపించే ఓ కాంతి రేఖ. విప్లవ యోధులైన చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల ప్రభావం అక్కడి యువతరంపై ఎక్కువ. ముఖ్యంగా గొప్ప వైద్యుడు, మానవతావాది అయిన చేగువేరా స్ఫూర్తి క్యూబా డాక్టర్లలో కనిపిస్తుంది. దేశ సేవ అంటే మనుషులకు సేవ చేయడమేననేది క్యూబా సోషలిస్టు ప్రభుత్వం నమ్మే సిద్ధాంతం. అందుకే.. ప్రపంచం మొత్తాన్నీ కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ.. క్యూబా అధ్యక్షుడిగా క్యాస్ట్రో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రపంచానికి క్యూబా ఏం ఇస్తోందో క్యాస్ట్రో చెప్పారు. యుద్ధం చేసి ప్రాణాలు తీసే బాంబులను క్యూబా తయారు చెయ్యబోదన్న క్యాస్ట్రో.. మనుషులకు ప్రాణం పోసే డాక్టర్లను తమ దేశం తయారు చేస్తుందన్నారు. క్యాస్ట్రో చెప్పిన విధంగానే క్యూబా తనను తాను డాక్టర్ల కార్ఖానాగా నిరూపించుకుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా క్యూబా ప్రభుత్వం ఆయా దేశాల సహాయార్థం భారీగా డాక్టర్ల బృందాలను పంపి స్వచ్ఛంద వైద్య సేవల్ని అందిస్తుంది. కరోనా అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తున్న వేళ.. క్యూబా డాక్టర్లు కరోనా బాధిత దేశాలకు సేవలందించేందుకు తరలివెళ్లారు. క్యూబా సోషలిస్టు భావాలంటే అమెరికా భయపడుతుంది. అందుకే.. క్యూబా అమెరికా మధ్య విపరీతమైన ఆంక్షలుంటాయి. క్యూబాను అణగదొక్కేందుకు అమెరికా చెయ్యని ప్రయత్నాల్లేవు. అలాగే ఇటలీ, బ్రిటన్, జర్మనీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షల అస్త్రశస్త్రాలు విసురుతూనే ఉంటాయి. అవేవీ మనసులో పెట్టుకోని క్యూబా కరోనా వైద్య సేవలందించేందుకు తన దేశం నుంచి వైద్య బృందాలను పంపింది. తమ దేశంలోకి క్యూబా వైద్యులు రాగానే ఇటలీ పౌరులు కరతాళ ధ్వనులతో వారికి గొప్ప స్వాగతం పలికారంటే.. అది క్యూబా వైద్యులపై ఇటలీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ ఇలా అనేక దేశాల్లో ప్రస్తుతం వేలాది మంది క్యూబన్ వైద్యులు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ రోగాలు ప్రబలిన సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా డాక్టర్లు సైనికుల్లా ముందుకు కదిలారు. హైతీలో కలరా వ్యాపించి జనం పిట్టల్లా రాలిపోతోంటే.. క్యూబా డాక్టర్ల బృందాలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి సేవలందించాయి. పశ్చిమాసియా దేశాలకు ఎబోలా ప్రబలినప్పుడు కూడా క్యూబా వైద్యులే ఆపద్భాందవుల్లా కదిలారు. విపత్కర పరిస్థితులలో సరిహద్దులకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే క్యూబా డాక్టర్లు కష్టకాలంలో పోరాడే యోధులు. కరోనా కరాళ నృత్యంతో అమెరికా కకావికలం అయిపోతోంది. ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్పెయిన్, ఇరాన్ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయ్. ఈ దేశాలన్నీ సంపన్న దేశాలు. ఆధునిక పోకడలు ఎక్కువగా ఉన్న దేశాలు. కానీ క్యూబా అమెరికాను ఆనుకొని ఉన్న చిన్న దేశం. అమెరికా విద్వేషాన్ని ఎదుర్కొంటూ తన దేశాన్ని తీర్చిదిద్దుకున్న దేశం. ఆయుధాల కంటే ఆరోగ్యమే గొప్ప అని నమ్మిన దేశం. కరోనా విసిరిన సవాలును దీటుగా స్వీకరించి వైద్యసేవలందిస్తున్న క్యూబా మన లాంటి దేశాల ప్రాధాన్యతలు ఎలా ఉండాలో గుర్తు చేస్తోంది. ఆఫ్రికా ఖండం ఎబోలాతో తల్లడిల్లినపుడు అండగా నిలిచింది క్యూబా వైద్యులే. ఇవాళ కరోనాతో అతలాకుతలమవుతున్న వేళ అగ్రరాజ్యాలు చేతులెత్తేసినపుడు మేమున్నామని భరోసా ఇచ్చింది క్యూబా వైద్యులే.. క్యూబాను చూసైనా భారత్ తో సహా అనేక దేశాలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయుధాలు, అణ్వస్త్రాల కంటే విద్య, వైద్యం పైన ఎక్కువ దృష్టిసారించాలి. భవిష్యత్తులో యుద్ధాలంటూ చేయాల్సివస్తే అది శతృదేశాలతో కాదనీ.. కరోనా లాంటి భయంకరమైన వైరస్లతోనన్న నిజాన్ని గుర్తించాలి. అందుకు దేశపౌరులను సిద్ధం చేసేందుకు వైద్యరంగాన్ని అత్యంత ప్రాధాన్యమైన రంగంగా గుర్తించాలి. ప్రాణాలు తీసే ఆయుధాల కంటే.. ప్రాణం పోసే వైద్యాన్ని పటిష్టం చేసుకోవాలంటూ దిశా నిర్దేశం చేస్తోంది క్యూబా. -
ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఆత్మహత్య
-
ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఆత్మహత్య
హవానా: దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ (68) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. 'డియాజ్ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయినా తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు' అని ప్రభుత్వ అధికార వెబ్సైట్ క్యూబాడిబేట్ పేర్కొంది. ఫిడెల్ క్యాస్ట్రో మొదటి భార్య మిర్టా డియాజ్ బాలార్ట్ కుమారుడు డియాజ్ బలార్ట్.. ఈయనను స్థానికంగా జూనియర్ క్యాస్ట్రో, ఫిడెలిటో గా పిలుస్తారు. అప్పటి సోవియట్ యూనియన్‌లో అణు భౌతిక శాస్త్రవేత్తగా పనిచేశారు. అదే విధంగా క్యూబా ప్రభుత్వానికి శాస్త్ర సలహాదారుగా.. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో ఆరోగ్య సమస్యల కారణంగా 90 ఏళ్ల వయసులో 2016 , నవంబర్ 26 న మృతి చెందిన విషయం తెలిసిందే. (తండ్రి క్యాస్ట్రోతో డియాజ్ బలార్ట్ చిన్ననాటి ఫొటో) -
విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూత
-
విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో కన్నుమూత
హవానా: కమ్యూనిస్టు శిఖరం కూలిపోయింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో(90) కన్నుమూశారు. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10:30కు(భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9గంటలకు) కన్నుమూశారు. ఫెడెల్ సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ఈ విషయాన్ని జాతీయ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఫెడల్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను కుగదీసింది. ఫెడల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూస్(ఫెడల్ క్యాస్ట్రో) 1926, ఆగస్టు 13న బిరాన్(హొల్గూయిన్ ఫ్రావిన్స్)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. నాటి అమెరికా అనుకూల బటిస్టా సేనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా చేస్తోన్న ఆందోళనల్లో విద్యార్థి నాయకుడిగా భాగం పంచుకున్న క్యాస్ట్రో.. తర్వాతి కాలంలో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పోరాటానికి వెన్నుచూపని నైజం అతడిని పార్టీ నాయకుడిగా ఎదిగేలా చేసింది. ఫెడల్ క్యాస్ట్రో నేతృత్వంలో చేగువేరా, రావుల్క్యాస్ట్రో, ఇంకా వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు జరిపిన విప్లవ పోరాటం ఒక సమోన్నత చరిత్ర. 1959లో క్యూబాను హస్తగతం చేసుకున్న ఆ పార్టీయే నేటికీ అధికారంలో కొనసాగుతుండటం గమనార్హం. 1959 నుంచి 1976దాకా క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై, 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. మాక్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతాలకు క్యూబా జాతీయతను రంగరిస్తూ ఫిడెల్ అనుసరించిన విధానం దేశంలో అతనిని తిరుగులేని నేతగా నిలబెట్టింది. విద్య, వైద్య, ప్రజా సేవల రంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలోకీ పైస్థానంలో నిలిచేలా చేసింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది డాక్టర్లను అందించిన దేశంగా, సుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్‌గా క్యూబా ఎదగడం వెనుక క్యాస్ట్రో కృషి అనిర్వచనీయం. వృధాప్యం కారణంగా 2008లో ఫెడెల్ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయన తమ్ముడు రావుల్ క్యాస్ట్రో అధ్యక్ష పదవిని చేపట్టారు.