breaking news
Extraterrestrials
-
అంగారకుడిపై నిర్మాణాలకు నీటి రహిత కాంక్రీట్
చెన్నై: ఇతర గ్రహాలపై సమీప భవిష్యత్తులో మానవ ఆవాసాలు నిర్మించడం సాధ్యమేనని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి ఆవల గ్రహాలపై ఆవాసాలు నిర్మించుకొనే దిశగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయా గ్రహాలపై లభించే వనరులతోనే ఇళ్లు రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాసుకు చెందిన ఎక్స్ట్రాటెరెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్(ఎక్స్‌టెమ్) గణనీయమై పురోగతి సాధించింది. నీటితో సంబంధం లేని కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. అంగారక(మార్స్) గ్రహంపై ఇళ్ల నిర్మాణానికి ఈ కాంక్రీట్ చక్కగా సరిపోతుందని చెబుతున్నారు. సల్ఫర్ మిశ్రమంతో కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఎక్స్‌టెమ్ బృందం వెల్ల్లడించింది. అంగారకుడిపై సల్ఫర్ సమృద్ధిగా ఉంది. అక్కడ ఇప్పటివరకైతే నీటి జాడ కనిపెట్టలేదు. ఇదిలా ఉండగా, ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఎక్స్‌టెమ్ బృందం పరిశోధనలు చేస్తోంది. మైక్రోగ్రావిటీ డ్రాప్టవర్ను రూపొందించింది. జీరో గ్రావిటీలో వస్తువుల లక్షణాలపై దీనిద్వారా అధ్యయనం చేయొచ్చు. భూమిపై నుంచి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇతర గ్రహాలపై ఉన్న వస్తువులు, వసతులతోనే వ్యోమగాములు అక్కడ మనుగడ సాగించేలా చేయాలన్నదే తమ ఆశయమని ఎక్స్‌టెమ్ ప్రతినిధి ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య చెప్పారు. -
Unidentified Anomalous Phenomena: కలవో, లేవో...!
ఏలియన్స్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్. గ్రహాంతరవాసులు.. ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు. వాళ్ల చుట్టూ ఎన్నెన్నో కథలు. వాళ్ల ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్లు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (ఎగిరే పళ్లాలు) చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత ఒకట్రెండు శతాబ్దాలలో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్నిసార్లు వినువీధిలో కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి. అవి ఎగిరే పళ్లాలేనని నమ్మిన వాళ్లు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఎందరో! దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ)గా పేర్కొంటూ, దీని తాలూకు నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్ గానీ, అవి ప్రయాణించే ఎగిరే పళ్లాలు గానీ ఉన్నాయని గానీ, లేవని గానీ ఇదమిత్థంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం! నాసా యూఏపీ ప్యానల్ నివేదిక ముఖ్యాంశాలు ► ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ) చాలావాటి అసలు స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయాం. ► ఎగిరే పళ్లాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు. ► వీటిలో చాలావరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి. ► అయితే కొన్ని యూఏపీ కేసులు అప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు. ► ఏలియన్స్, ఎగిరే పళ్లాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగిందే. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటాం. నాసాకు యూఏపీ ప్యానల్ సిఫార్సులు ► యూఏపీ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ కోసం ఒక స్టాండర్డ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ► యూఏపీలపై అవగాహనను విస్తృతం చేసుకోవడానికి కృత్రిమ మేధ తదితర టెక్నాలజీల సాయం తీసుకోవాలి. ► యూఏపీల అధ్యయనంలో పారదర్శకత, ఇతర దేశాలు, అధ్యయన సంస్థలతో పరస్పర సహకారం చాలా అవసరం. ► యూఏపీ పరిశోధనలకు, డేటా సేకరణ, అధ్యయనం, ప్రభుత్వ, విదేశీ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం తదితరాల నిమిత్తం ఈ ప్రాజెక్టుకు నిధులను మరింత పెంచాలి. ఎగిరే పళ్లాలను గురించి జనాల్లో నెగటివ్ భావజాలం ఎంతగానో పాతుకుపోయింది. ఏలియన్స్ ఉనికి తాలూకు నిజానిజాలను నిర్ధారించేందుకు అత్యంత కీలకమైన డేటాను సేకరించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది’ – నాసా యూఏపీ అధ్యయన బృందం ఏలియన్స్ ఉన్నదీ లేనిదీ పక్కాగా తేల్చాలన్నా, దీనిపై లోతుగా పరిశోధన చేయాలన్నా ఇప్పుడున్న వాటికి చాలా భిన్నమైన, సృజనాత్మక శాస్త్రీయ అధ్యయన పద్ధతులు అత్యాధునికమైన శాటిలైట్ టెక్నాలజీ కావాలి. అంతకు మించి, ఈ అంశంపై జనం దృక్కోణంలోనే మౌలికంగా చాలా మార్పు రావాలి’ – నాసా – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్, అవునా.. నిజమా?!
గ్రహాంతర జీవనం.. మనిషికి ఎప్పటికీ ఓ ఆసక్తికర అంశమే. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం.. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెప్తుంటాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్ లైఫ్ గురించి ఓ క్లారిటీ కాదు కదా కనీసం ఓ అంచనా కూడా రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల థీయరీలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. ‘బ్లాక్ నైట్ శాటిలైట్ కాన్స్పిరెన్సీ థియరీ’.. ప్రకారం ఇది అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు కూడా పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్ యూనియన్లు స్పేస్‌లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందన్నమాట. టిక ఈ మిస్టరీ శాటిలైట్ గత పది రోజుల్లో విపరీతంగా షేర్ అయ్యింది. మరి నాసా దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం.. అదసలు శాటిలైట్ కాదని తేల్చేసింది నాసా. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్క్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెప్తున్నారు. పైగా భూ కక్క్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చేసింది. చదవండి: వారెవ్వా.. ఖగోళంలో మునుపెన్నడూ చూడని దృశ్యం ఇది -
‘ఆ మర్మాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేము’
ఆకాశంలో ఎగురుతూ దర్శనమిచ్చిన(యూఎఫ్‌వో) ఘటనలపై దర్యాప్తు ఫలితాన్ని.. శుక్రవారం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది. ఈ నివేదికపై ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఏదో చెబుతాయనుకుంటే.. మళ్లీ పాతపాటే పాడాయి నిఘా వర్గాలు. అవి ఏంటో అనే విషయంపై ఎలాంటి నిర్ధరాణకు రాలేదని సింపుల్‌గా తేల్చి చెప్పాయి. వాషింగ్టన్: వరుసగా యూఎఫ్‌వో ఘటనలు.. అది కూడా మిలిటరీ ఎయిర్‌స్పేస్‌లోనే దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యూఎఫ్‌వో ఘటనలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రక్షణ దళాల్ని ఆదేశించింది అమెరికన్ పార్లమెంట్(కాంగ్రెస్). దీంతో కిందటి ఏడాది ఆగష్టులో యూఎపీటీఎఫ్(Unidentified Aerial Phenomena Task Force)ను ఏర్పాటు చేయించింది పెంటగాన్. అటుపై 2004 నుంచి 144 ఘటనలపై నివేదికలు తెప్పించుకుని.. వాటిపై మళ్లీ నిఘా వర్గాలతో దర్యాప్తు చేయించి తుది నివేదికను తయారు చేయించింది. అయితే సుదీర్ఘ విచారణ, దర్యాప్తుల తర్వాత వాటిపై అంచనాకి రాలేకపోయామని తేల్చేసింది. శత్రుదేశాల పనికాదు! వేల పేజీల రిపోర్టులను పరిశీలించి.. సింపుల్‌గా కొన్నిపేజీల(పదిలోపే) ఫలితాన్ని ప్రకటించడం కొసమెరుపు. ‘‘ఆ వీడియోల్లో కనిపించినవి వేరే గ్రహానికి చెందినవని, ఏలియన్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవని చెప్పడానికి నిఘా వర్గాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలాగని రష్యా, చైనాలాంటి దాయాది దేశాల సాంకేతిక పన్నాగమూ అని కూడా నిర్ధారణ కాలేదు’’ అని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఆ మర్మాలకు సంబంధించి ఒక నిర్ధారణకు మాత్రం ఇప్పటికిప్పుడే రాలేమని, అలాగని ప్రచారపు సిద్ధాంతాలను కొట్టిపారేయడానికి తగిన ఆధారాలు లేవని పెంటగాన్ ప్రకటించడం విశేషం. కొత్తగా ఏముందంటే.. శోధించి.. పరిశీలించి.. జాబితాను రూపొందించినట్లుగా పెంటగాన్ ప్రకటించడంపై సెటైర్లు పడుతున్నాయి. పైగా పెంటగాన్ ఇప్పుడు తుది నివేదిక ప్రత్యేకంగా చెప్పింది ఏం లేదన్నది చాలామంది మాట. అయితే పదకొండు ఘటనల్లో మాత్రం దాదాపుగా ‘ఢీ కొట్టేంత పని చేశాయన్న పైలెట్ల వివరణ’ను ప్రకటించడం మాత్రం కొత్తేనని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు, గ్రహాంతర విషయాలపై ఆసక్తికనబరిచే పరిశోధకులు. పైగా వాటి ఆకారాలపై కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం(విమానాల తరహాలోనే ఉన్నప్పటికీ.. బెలూన్ల షేప్ ఆకారాలు వాటికి తగిలించి ఉన్నాయని) పరిశోధనలో ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఇక యూఎఫ్వోకి బదులు యూఏపీ(Unidentified Aerial Phenomena) ప్రతిపాదనను బలపరచడం, కిందటి ఏడాది ఏప్రిల్‌లో యూఎస్ నేవీ రిలీజ్ చేసిన వీడియోల్ని పరిగణిస్తున్నామని ప్రకటించడం ద్వారా యూఎఫ్‌వో థియరీలను ఇంకా సజీవంగానే ఉంచాలని పెంటగాన్ భావిస్తోందని తెలుస్తోంది. -
అపరిచితులు...
కవర్ స్టోరీ : జూలై 2 వరల్డ్ యూఎఫ్ఓ డే ఆకాశంలో ఏదో ఎగురుతూ కనిపిస్తుంది. విమానమా..? కాదు. హెలికాప్టరా..? అస్సలు కాదు. పోనీ రాకెట్టా..? ఉహు.. కానే కాదు. ఆకారం చూస్తే వాటిలా ఏమీ అనిపించదు. గుండ్రంగా పళ్లెంలా ఉంటాయి. వెలుగులు విరజిమ్ముతూ ఎగురుతూ ఉంటాయి. ఎక్కడివో, ఏమిటో గుర్తు తెలియని ఈ ఎగిరే పళ్లాలకు ఇంగ్లిషులో ‘అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్’గా పేరు పెట్టారు. వీటినే సంక్షిప్తంగా యూఎఫ్ఓలని అంటున్నారు. పళ్లాల్లా ఉంటాయి కాబట్టి వీటిని ‘ఫ్లయింగ్ సాసర్స్’ అని కూడా అంటారు. వీటి ఉనికి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గ్రహాంతర వాసులు వీటిని నడుపుతున్నారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యాలు చాలాకాలంగా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాయి. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అనేందుకు ఇంతవరకు తగిన ఆధారాల్లేవు. ఒకవేళ ఉంటే వాళ్లు మనకు మిత్రులా? శత్రువులా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఉన్నారో, లేరో తెలియని గ్రహాంతరవాసులు ఇప్పటికి మాత్రం మనకు అపరిచితులు. చాలా చరిత్రే ఉంది మన దేశంలో ఇలాంటి ఎగిరే పళ్లాలను (యూఎఫ్ఓలు) చూసిన వారు దాదాపు లేరు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలాంటివి తమకు కనిపించాయని చెప్పిన వారు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ అక్కడక్కడా కొందరు ఆకాశంలో ఎగిరే పళ్లాలను చూసినట్లు చెబుతూనే ఉన్నారు. అలా చూశామని చెబుతున్న వారిలో కొందరు ఔత్సాహికులు ఫొటోలు, వీడియోలు తీసి మరీ ఇంటర్నెట్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. యూఎఫ్ఓల వెనుక చాలా చరిత్రే ఉంది. క్రీస్తుపూర్వం 214లో తొలిసారిగా వీటిని చూసినట్లుగా రోమన్ చరిత్రకారుడు టైటస్ లివియస్ తన రచనల ద్వారా వెల్లడించాడు. వీటిని ఆయన ఆకాశంలో ఎగిరే పడవలుగా అభివర్ణించాడు. యూఎఫ్ఓల గురించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే. చరిత్ర పూర్వయుగంలోనే మనుషులు ఇలాంటి యూఎఫ్ఓలను చూసి ఉండవచ్చని ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా చరమా వద్ద బయటపడ్డ గుహాచిత్రాలను పరిశీలించిన నిపుణులు భావిస్తున్నారు. ఈ గుహా చిత్రాల్లో ఆధునిక స్పేస్‌సూట్స్ వంటి దుస్తులు ధరించిన వారి బొమ్మలతో పాటు ఫ్లయింగ్ సాసర్స్ వంటి వాటి బొమ్మలు ఉండటం విశేషం. యూఎఫ్ఓలు కనిపించిన ఉదంతాలు చరిత్రలో వందలాదిగా నమోదయ్యాయి. మన దేశంలో తొలిసారిగా ఢిల్లీలో ఒక ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన పాతిక మంది సభ్యులు 1951 మార్చి 15న యూఎఫ్ఓను చూశారు. పొగచుట్ట ఆకారంలో దాదాపు వంద అడుగుల పొడవున్న యూఎఫ్ఓ ఆకాశంలో శరవేగంగా ఎగురుతూ కనుమరుగైనట్లు వారు చెప్పారు. ఆ తర్వాత 1954 సెప్టెంబర్ 15న యూఎఫ్ఓ కనిపించిన ఉదంతం వార్తలకెక్కింది. బిహార్‌లోని మన్భూమ్ జిల్లాలో మూడు గ్రామాలకు చెందిన దాదాపు 800 మంది ప్రజలు ఆకాశంలో ఎగిరే పళ్లాన్ని చూసినట్లు చెప్పారు. మధ్యాహ్నం వేళ ఆరుబయట ఉన్న సమయంలో ఆకాశంలో ఎగిరే పళ్లెం కనిపించిందని, దాని వ్యాసం దాదాపు పన్నెండు అడుగులు ఉంటుందని, అది బూడిద రంగులో ఉందని వారు చెప్పారు. ప్రజలు యూఎఫ్ఓలను చూసిన ఉదంతాలు ఎక్కువగా అమెరికాలోనే నమోదయ్యాయి. అయితే, మన దేశంలోనూ యూఎఫ్ఓలు కనిపించిన ఉదంతాలు లేకపోలేదు. గత ఏడాది జూన్ 25న కాన్పూర్‌లో, నవంబర్ 28న గోరఖ్‌పూర్‌లో యూఎఫ్ఓలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు 2007 అక్టోబర్ 29న వేకువ జామున కోల్‌కతాలో కొందరు యూఎఫ్ఓను చూసి వీడియో తీశారు. వెలుగులు చిమ్ముతూ వేగంగా ఆకాశంలో ఎగురుతున్న ఈ యూఎఫ్ఓ దృశ్యాలను తర్వాత కోల్‌కతాలోని బిర్లా ప్లానెటోరియంలో ప్రదర్శించారు. యూఎఫ్ఓల అమీ తుమీ తేల్చడానికి అమెరికా, సోవియట్ రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్, చైనా ప్రభుత్వాలు పలు పరిశోధనలు సాగించాయి. ఇవి ఇప్పటికీ సాగిస్తూనే ఉన్నాయి. చాలాకాలంగా ఈ పరిశోధనలు రహస్యంగానే సాగినా, సమాచార హక్కు చట్టాలు అమలులోకి రావడంతో ఆ రహస్య పరిశోధనలు, వాటి కోసం ప్రభుత్వాలు చేసిన ఖర్చుల వివరాలు బహిర్గతం కాక తప్పలేదు. యూఎఫ్ఓలు, గ్రహాంతరవాసులపై పరిశోధనల కోసం పలు ప్రభుత్వాలు ఇప్పటికే వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా. మరోవైపు కొందరు సంపన్నులు, ప్రైవేటు సంస్థలు కూడా వీటిపై పరిశోధనలు సాగిస్తుండటం విశేషం. ‘అపరిచితుల’ కోసం రాయబారి! గ్రహాంతరాలకు చెందిన ‘అపరిచితుల’ కోసం ఐక్యరాజ్య సమితి ఏకంగా ఒక రాయబారినే నియమించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతరిక్ష వ్యవహారాల కార్యాలయానికి (యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది ఔటర్ స్పేస్ అఫైర్స్- యూఎన్‌ఓఓఎస్‌ఏ) అధిపతిగా మలేసియాకు చెందిన అస్ట్రోఫిజిసిస్ట్ మజ్లాన్ ఓత్మన్‌ను 2010 సెప్టెంబర్‌లో ఐరాస నియమించింది. గ్రహాంతరవాసులతో పాటు అంతరిక్షానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలూ ఈ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఓత్మన్‌ను ‘అపరిచితుల’ రాయబారిగా చెప్పుకోవచ్చు. సినిమాల్లో ‘అపరిచితులు’ గ్రహాంతర వాసులపై ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. వీటిలో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ. గ్రహాంతర వాసులపై వచ్చిన మొట్టమొదటి సినిమా ఫ్రెంచి భాషలో తీసిన ‘లె వోయేజ్ డాన్స్ లా లూన్’ (చంద్రుడి పైకి ప్రయాణం) 1902లో వచ్చింది. ఇది మూకీ సినిమా. జూల్స్ వెర్న్ నవలలు ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’, ‘ఎరౌండ్ ది మూన్’తో పాటు మరికొన్ని రచనల ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు జార్జెస్ మెలీస్ ఈ సినిమాను రూపొందించారు. దీనికి ఆయనే నిర్మాత కూడా. ఇక బాలీవుడ్లో 1967లో దారాసింగ్ హీరోగా ‘చాంద్ పర్ చఢాయీ’ సినిమా విడుదలైంది. చంద్రయానం ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమాలో యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులు కూడా కనిపిస్తారు. అయితే, అంతకు రెండేళ్ల ముందే దిగ్దర్శకుడు సత్యజిత్ రే ఇలాంటి సినిమా ఒకటి తీసే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా రాసుకున్న కథ ‘బంకుబాబురొ బొంధు’ (బంకుబాబు స్నేహితుడు) ఆధారంగా ‘ది ఎలీన్’ పేరిట హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘కొలంబియా పిక్చర్స్’ సహకారంతో తలపెట్టిన ఈ సినిమా అర్ధంతరంగానే నిలిచిపోయింది. ఆ తర్వాత ‘ది ఎలీన్’ స్క్రిప్టు ప్రభావంతోనే ‘ఆస్కార్’గ్రహీత స్టీవెన్ స్పీల్బర్గ్ 1982లో ‘ఇ.టి. ది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్’ రూపొందించారు. అయితే, ‘బంకుబాబురొ బొంధు’ను సత్యజిత్ రే తనయుడు సందీప్ రే 2006లో టీవీ సీరియల్‌గా రూపొందించారు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులపై ‘కోయీ మిల్గయా’, ‘క్రిష్’, ‘జోకర్’, ‘చాంద్-2013’, ‘పీకే’వంటి బాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. పాలపుంత పరిస్థితి సువిశాల విశ్వంలో అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు మన గ్యాలెక్సీ అయిన పాలపుంతనే తీసుకుందాం. ఇందులో 20 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలాంటి గ్యాలెక్సీలు అంతరిక్షంలో ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్కలేవీ లేవు. పాలపుంతలో ఉన్న వాటిలో కనీసం సగానికి సగం నక్షత్రాల చుట్టూ మన భూమి వంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవజాలం భూమికి మాత్రమే పరిమితం కాదనుకుంటే, పాలపుంతలో సౌరకుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట మిగిలిన గ్రహాల్లో కొన్నింటి మీదైనా జీవజాలం ఉండే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అదే నిజమైతే, ఆ గ్రహాలపై ఇప్పటికే నాగరికత వర్ధిల్లే అవకాశాలు లేకపోలేదు. 1500 ఏళ్ల తర్వాత ఎలీన్స్తో దోస్తానా? ఎగిరే పళ్లాలనే కాదు, వాటిలో వచ్చే గ్రహాంతర వాసులను (ఎలీన్స్) చూశామని చెప్పిన వారు కూడా లేకపోలేదు. అయితే, ఎలీన్స్ ఊహాచిత్రాలే తప్ప వాళ్ల ఫొటోలేవీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు. భూమ్మీద నివసించే మనుషులతో ఎలీన్స్ మాటామంతీకి ప్రయత్నించిన దాఖలాలేవీ ఇప్పటి వరకు లేవు. అయితే, భూమ్మీద మనుషులతో ఎలీన్స్ సంబంధాలు నెరపే రోజులు వస్తాయని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాని, ఆ రోజులు రావడానికి కనీసం 1500 ఏళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటి వరకు ఎలీన్స్ నుంచి మనకు ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, అంతరిక్షం సువిశాల ప్రదేశం. విశాల విశ్వంలో మన మానవులం మాత్రమే మనుగడ సాగిస్తున్నామని భావించడం సరికాదు. ఎప్పుడో ఒకరోజు ఎలీన్స్ నుంచి మనకు సమాచారం అందేరోజు రాకపోదు. అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. సుమారు 1500 ఏళ్ల తర్వాత ఇది జరగవచ్చనే అంచనా వేస్తున్నాం’ అని అమెరికాలోని కార్నెల్ వర్సిటీ పరిశోధకుడు ఎవాన్ సాల్మనైడ్స్ చెబుతున్నారు. అవీ-ఇవీ... గ్రహాంతరవాసులు తనను కిడ్నాప్ చేశారంటూ కాల్మికియా తొలి అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్నిజోవ్ వార్తల్లోకెక్కారు. యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా ఏర్పడిన కాల్మికియాకు 1993లో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. పసుపు రంగు కళ్లద్దాలు ధరించి వచ్చిన గ్రహాంతర వాసులు తనను 1997 సెప్టెంబర్ 17న కిడ్నాప్ చేసినట్లు కిర్సాన్ ప్రకటించారు. యూఎఫ్‌ఓలో వారు తనను వేరే గ్రహానికి తీసుకుపోయి, గంటసేపు అక్కడ ఉంచి, తర్వాత తిరిగి భూమ్మీదకు తెచ్చి వదిలేశారని చెప్పారు. ఆకాశంలో కనిపించే ఎగిరే పళ్లాలను మొదట్లో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పిలిచేవారు. వీటికి ‘ఫ్లయింగ్ సాసర్స్’ అనే పేరు 1947 నుంచి వాడుకలో ఉండేది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎడ్వర్డ్ రపెల్ట్ 1952లో వీటికి ‘అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్ఓ)గా నామకరణం చేశాడు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటిని ‘యూఎఫ్ఓ’లుగా పేర్కొనడం ప్రారంభమైంది. గ్రహాంతర వాసులపై ఇప్పటికీ చాలామందిలో లేనిపోని అనుమానాలు, భయాలు ఉన్నాయి. యూఎఫ్ఓలలో భూమ్మీదకు వచ్చే ‘అపరిచితులు’ ఇక్కడి మనుషులను కిడ్నాప్ చేస్తారనే వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ భయాల కారణంగానే అమెరికాలో దాదాపు 40 వేల మంది గ్రహాంతర వాసుల ద్వారా కిడ్నాప్‌కు గురయ్యే ‘ప్రమాదం’ నుంచి రక్షణ కోసం బీమా పాలసీలు కూడా తీసుకున్నారు. - కాల్మికియా తొలి అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్నిజోవ్