3,500 కి.మీ. మేర డబుల్ రోడ్లు
రాష్ట్రంలో భారీ ఎత్తున రోడ్లు, వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్న ప్రభుత్వం అందుకు అడ్డంకిగా ఉన్న రహదారుల అనుసంధానంపై దృష్టి సారించింది. వచ్చే రెండేళ్లలో దాదాపు రూ.11 వేల కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణతోపాటు శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం... 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,600 కోట్లతో పనులు నిర్వహించనుంది. ఇందుకోసం రోడ్లు, భవనాలశాఖ తాజాగా ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణలో ఒకే ఏడాది ఇన్ని పనులు ప్రారంభించటం ఇదే తొలిసారి కావడం విశేషం.
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లకు..
రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, నియోజకవర్గాల మీదుగా రెండు వరసల రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,500 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.4 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నారు. ఇందులో 2,500 కిలోమీటర్ల మేర పనులను 2016 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రోడ్లు సరిగా లేనందున ఈ పనుల్లో ఆ రెండు జిల్లాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 744 కిలోమీటర్ల మేర, ఆదిలాబాద్‌లో 690 కిలోమీటర్ల మేర వీటిని నిర్మిస్తున్నారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రోడ్లు మెరుగ్గా ఉన్నందున వాటి పరిధిలో 380 కి.మీ., 390 కి.మీ. మేర పనులు చేపట్టనున్నారు.
పాత రోడ్లకు కొత్త రూపు...
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తారు రోడ్లున్నప్పటికీ వాహనాలు సరిగా ప్రయాణించలేని దుస్థితికి చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల పాత రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 వేల కిలోమీటర్ల రోడ్లను గుర్తించింది. ఇందుకు రూ. 1,200 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త రోడ్ల నిర్మాణం కంటే వీటిని తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో ఇప్పటికే రోడ్లు భవనాలశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. కొన్ని మార్గాల్లో సింగిల్ టెండర్లు దాఖలు కావటంతో వాటిని రద్దు చేసి మిగతా వాటి పనులు ప్రారంభిస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు దారితీసే రోడ్ల పనులను కూడా ఇందులో చేర్చారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 35 పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 238 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది.
ఏడాదిలో 60 వంతెనలు...
రాష్ట్రంలో రోడ్లపై చిన్న వంతెనలు మొదలు గోదావరి, కృష్ణా నదులపై ఉన్న పెద్ద నదుల వరకు చాలా నిర్మాణాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 383 వంతెల నిర్మాణం అవసరమని తేల్చిన సర్కారు... ఈ సంవత్సరం వాటిలో 60 వంతెలను నిర్మించనుంది. చిన్నాచితకా వాగులపై ఉన్న వంతెనలతోపాటు కృష్ణానదిపై రెండు కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన, గోదావరిపై రెండు, మానేరుపై రెండు... వెరసి ఐదు భారీ వంతెనలు కూడా ఉన్నాయి. ఇందుకు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ల అనుసంధానంగా మహబూబ్‌నగర్- కర్నూలు మధ్య కృష్ణానదిపై రెండు కిలోమీటర్ల పొడవుతో భారీ వంతెన నిర్మించాలని నిర్ణయించారు.
దీని అంచనా వ్యయం రూ. 190 కోట్లు. ఇందులో కొంత ఖర్చు భరించాల్సిందిగా ఏపీని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు మంథని-ఓదెల మార్గంలో ఓదెల వద్ద మానేరుపై 600 మీటర్ల వంతెన, కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో మానేరు మీద నీర్కుల వద్ద మరో భారీ వంతెన, గోదావరి నదిపై కరీంనగర్ జిల్లా రాయికల్ సమీపంలో బోర్నపల్లి వద్ద భారీ వంతెన, ఆదిలాబాద్ జిల్లా బాసరలో గోదావరిపై దాదాపు 800 మీటర్ల మేర విశాలమైన వంతెన నిర్మించనున్నారు. వీటికి సంబంధించి అంచనాలను సిద్ధం చేసి మరికొద్ది రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్‌లోనే అన్ని పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ల గడువును వారానికి కుదించిన నేపథ్యంలో ఆ ప్రక్రియలో జాప్యం ఉండదని చెబుతున్నారు.