breaking news
estimated money
-
రూ.లక్ష కోట్లకు రంగుల పరిశ్రమ
న్యూఢిల్లీ: భారత్‌లో పెయింట్స్, కోటింగ్స్ పరిశ్రమ పరిమాణం వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.లక్ష కోట్లకు చేరుకోవచ్చని ప్రముఖ పెయింట్స్ కంపెనీ అక్జో నోబెల్ (డ్యూలక్స్ బ్రాండ్) ఇండియా అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిమాణం రూ.62,000 కోట్లుగా ఉంది. పెయింట్స్, కోటింగ్స్ పరిశ్రమ మార్జిన్ గత ఆర్థిక సంవత్సరం మాదిరే ఇంకా మెరుగుపడుతుందని, తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరలు తగ్గడాన్ని ప్రస్తావించింది. ఈ వివరాలను కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. పెయింట్స్ కంపెనీల మొత్తం తయారీ వ్యయంలో 55–60 శాతం ముడి సరుకులవే ఉంటాయి. ముడి చమురు, ఇతర కీలక సరుకుల ధరలు తగ్గడం 2022–23లో మార్జిన్లు పెరగడానికి దోహదపడినట్టు వివరించింది. ఈ రంగం ఆకర్షణీయం.. ‘‘ఇటీవలి కాలంలో పలు కొత్త సంస్థలు ప్రవేశించడంతో పెయింట్స్, కోటింగ్స్ పరిశ్రమ ఆకర్షణీయంగా మారిందని, కొత్త కంపెనీలు మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్‌పై ఖర్చు చేస్తూ, మార్కెట్ వాటాను పొందే ప్రయత్నంలో ఉన్నాయి. పోటీ పెరగడంతో ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవడం కోసం తమ సామర్థ్యాలను మరింత పెంచుకోనున్నాయి. ఇది ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకొస్తుంది’’ అక్జో నోబెల్ తన నివేదికలో తెలిపింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిడిలైట్, జేఎస్‌డబ్ల్యూ సంస్థలు కొత్తగా ఈ రంగంలోకి వచి్చనవి కావడం గమనార్హం. ప్రస్తుతం పెయింట్స్, కోటింగ్స్ పరిశ్రమలో 75 శాతం మార్కెట్ వాటాను ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్, అక్జో నోబెల్ ఇండియా కలిగి ఉన్నాయి. ఈ రంగం ప్రధానంగా ఆర్కిటెక్చరల్, ఇండ్రస్టియల్ అని రెండు భాగాలుగా ఉండగా, ఇందులో ఆర్కిటెక్చరల్ 69 శాతం మార్కెట్ వాటాను శాశిస్తోంది. ఇళ్లు, వాణిజ్య భవనాలకు పెయింట్స్ ఈ విభాగం కిందకే వస్తాయి. ‘‘పారిశ్రామిక విభాగంలో పెయింట్స్‌కు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్, అనుబంధ రంగాలు డిమాండ్‌ను నడిపించనున్నాయి’’అని అక్జో నోబెల్ తన వాటాదారులకు తెలియజేసింది. -
కన్నడ ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో డబ్బుల వరద పారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిష్టాత్మక పోరు కాబట్టే.. కర్ణాటక ఎన్నికలు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ శాయశక్తులా పనిచేస్తోంది. దీంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు రాహుల్, సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ చవాన్, ఉమెన్ చాందీ, సుశీల్ కుమార్ షిండే, రఘువీరారెడ్డి సహా మాజీ కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను బీజేపీ రంగంలోకి దించింది. సగటున రూ.20 కోట్లు కన్నడ గడ్డపై 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేయాలి. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయి. రూ.30–50కోట్లు ఖర్చు చేసేవి, రూ.50–70 కోట్లు, వందకోట్లకుపైగా ఖర్చు చేసే నియోజకవర్గాలూ ఉన్నాయి. సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా.. ఒక్కోపార్టీకి 4,480 కోట్లు ఖర్చవుతుంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే.. ఆ మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. జేడీఎస్‌ను కలుపుకుంటే రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా. ఆ మూడు చోట్ల.. 700 కోట్లు కర్ణాటకలో అత్యంత ఖరీదైన ఎన్నిక విజయనగరలో జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎంపీవీ కిష్టప్ప, బీజేపీ తరపున హెచ్ రవీంద్ర బరిలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కిష్టప్ప రూ.1300 కోట్ల ఆస్తులు చూపించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గోవిందరాజనగర్‌లో కిష్టప్ప కుమారుడు ప్రియాకృష్ణ కాంగ్రెస్‌పార్టీ నుంచి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ వీ. సోమన్న బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే హోస్కొటే నుంచి ఎంపీవీ నాగరాజు (కాంగ్రెస్), బీజేపీ తరపున మాజీమంత్రి బచ్చేగౌడ కుమారుడు శరత్ బరిలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు జేడీఎస్ అభ్యర్థుల ఖర్చు మొత్తం రూ.700 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బాదామీలోనూ బారెడు ఖర్చు బాదామీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరు నేతలకూ ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కో అభ్యర్థి 70 నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రాతినిథ్యం వహిస్తున్న తుమకూరు జిల్లా కొరటగేరే, సీఎం కుమారుడు యతీంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణతో పాటు పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉందని తెలుస్తోంది. మోదీ మ్యాజిక్ పనిచేయదు శివాజీనగర: ‘కర్ణాటక ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి.. రాష్ట్రంలో ఇక ప్రధాని మోదీ మ్యాజిక్ ఏదీ పనిచేయదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీ ట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుతున్న భాషను ప్రజలు ఛీకొడుతున్నారు. ఒక ప్రధాని నోటి నుంచి ఇలాంటి హీనమైన మాటలను వినాల్సి వస్తుందని వారు ఊహించలేదు’ అని మండిపడ్డారు. ‘2 ప్లస్ 1, టెన్ పర్సెంట్ ప్రభుత్వం, సీధా రూపయ్య’ అంటూ తమపై వ్యాఖ్యానాలు చేయటం ఇలాంటివేనని తెలిపారు. తమపై మోదీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదనీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలోనే ఉన్నందున విచారణ జరిపించి రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
ప్రాజెక్టుల అంచనా వ్యయంపై అనుమానాలు
ప్రాజెక్టులపై సాగునీటి రంగ నిపుణులతో బీజేపీ చర్చలు సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెంపుపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల వ్యయం రూ. 41 వేల కోట్ల నుంచి రూ. 81 వేల కోట్లకు ఎలా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు జి.కిషన్‌రెడ్డి, ఎన్.వి.ఎస్.ప్రభాకర్, సాగునీటి రంగ నిపుణులు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, హన్మంతరెడ్డి, పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ తమ్మిడిహెట్టి వద్ద 152 అడుగుల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అనుగుణంగా పునాదులు వేయాలని అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం రెట్టింపు, రీడైజన్లపై అందరిలోనూ చాలా అనుమానా లున్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన న్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైనింగు పేరుతో నిర్వాసితులను చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తిప్పికొట్టేవిధంగా సమగ్ర నివేదికను తయారు చేయాలని తీర్మానించింది.